ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు అతి పెద్ద అగ్ని ప‌రీక్ష ఎదురు కానుంది. అదేదో ఏపీకి ప్ర‌త్యేక హోదా తెచ్చిపెట్ట‌డ‌మో?  లేక 2018 నాటికి పోల‌వ‌రం పూర్తి చేయ‌డ‌మో కాదు!  చాలా సింపులే అయినా ప్ర‌స్తుతానికి మాత్రం కొండ‌ను త‌ల‌పిస్తున్న క‌ష్టంగా మారింది. దీంతో బాబు ఈ ప‌రీక్ష నుంచి గ‌ట్టెక్క‌డం ఎలాగా? అని త‌ల‌ప‌ట్టుకుంటున్నార‌ట‌! విష‌యంలోకి వెళ్తే.. క‌ర్నూలు జిల్లా స్థానిక సంస్థ‌ల కోటాలో ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయిన విష‌యం తెలిసిందేక‌దా. ఈ ఏడాది మేలో  జ‌రిగిన ఈ ఎన్నిక‌ల్లో అప్ప‌టి టీడీపీ అభ్య‌ర్థి శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి ఎమ్మెల్సీగా ఎనిక‌య్యారు. కేవ‌లం 70 ఓట్ల తేడాతో ఆయ‌న ఈ సీటును ద‌క్కించుకున్నారు. 


అయితే, ఆ త‌ర్వాత నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక నేప‌థ్యంలో వైసీపీలోకి చేరిన త‌న అన్న శిల్పా మోహ‌న్‌రెడ్డి కోసం చ‌క్ర‌పాణి రెడ్డి త‌న ప‌ద‌విని త్యాగం చేసిన టీడీపీకి ఝ‌ల‌క్ ఇచ్చి జ‌గ‌న్ చెంత‌కు చేరుకున్నారు. దీంతో ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయింది. దీనికి ఇప్పుడు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలోనే టీడీపీలో ఈ టికెట్‌ను ద‌క్కించుకునేవారు లెక్క‌కు మిక్క‌లిగా తేల‌డంతో వారిని స‌ముదాయించ‌డం, టికెట్ విష‌యంలో నిర్ణ‌యం తీసుకోవ‌డం వంటివి బాబుకు అగ్ని ప‌రీక్ష‌క‌న్నా ఎక్కువ‌గా అనిపిస్తున్నాయ‌ని స‌మాచారం. నిజానికి  ఈ ఉప ఎన్నిక విష‌యంలో తాను నేరుగా జోక్యం చేసుకోకుండా జిల్లా పార్టీ నేత‌ల‌కే చంద్ర‌బాబు వ‌దిలిపెట్టారు. 


అయితే,  జిల్లా నాయకులు కూడా ఏకాభిప్రాయానికి రాకపోవడంతో సీఎం చంద్రబాబు ఇప్పుడు త‌ల ప‌ట్టుకున్నారు.  ఈ నెల 23 వ‌ర‌కు స‌మ‌యం ఇచ్చి అప్పటిలోగా అందరూ ఓ నిర్ణయానికి వచ్చి తన వద్దకు రావాలని సీఎం సూచించారని తెలిసింది.  తొలుత జిల్లా నాయకులు ఎవరికి వారు తాము ప్రతిపాదించిన వ్యక్తినే అభ్యర్థిగా ఎంపిక చేయాలని పట్టుపట్టారు. అందరు కలిసే వెళ్లినా ఐదారుగురు టికెట్‌ ఆశిస్తుండడంతో వారికి మద్దతుగా తెలుగుతమ్ముళ్లు నాలుగు గ్రూపులుగా విడిపోయినట్టు తెలుస్తోంది. మరో ఏడాదిన్నరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తుండడంతో అదరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థి ఎంపిక చేయడానికి సీఎం కసరత్తు చేస్తున్నారు.  


అమరావతిలో జిల్లా నాయకులతో సీఎం భేటీ అయ్యారు. అభ్యర్థి ఎంపికపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులు జిల్లా నాయకులతో ఉదయం విడివిడిగా సేకరించిన అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, వీరి అభిప్రాయాల‌న్నీ దేనికి అదే బాగుండ‌డం, ఎవ‌రికి వారే టికెట్ కోసం ప‌ట్టుబ‌ట్ట‌డంతో నేత‌లు ఏం చేయాల‌తో తెలియడం లేద‌ని బాబుకు విన్న‌వించుకున్నార‌ట‌. దీంతో చంద్ర‌బాబు ఇప్పుడు ఏం చేయాల‌నే విష‌యంపై మ‌ధ‌న‌ప‌డుతున్నార‌ని స‌మాచారం. మ‌రి ఎలా నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఏ మాత్రం తేడా వ‌చ్చినా వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ ప‌రిస్థితి దారుణంగా త‌యార‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: