జేసీ బ్ర‌ద‌ర్స్‌! అనంతపురానికి చెందిన కాంగ్రెస్ మాజీ నేత‌లు, ప్ర‌స్తుతం టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీలు. వీరి మాటకు ఇప్ప‌టి వ‌ర‌కు అనంత‌పురంలో తిరుగేలేదు. వారు చెప్పిందే వేదం, వారు చేసిందే శాస‌నం. లేకుంటే చావు దెబ్బ‌లు, వేధింపులు త‌ప్ప‌వు. ఎంపీ అయిన దివాక‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే గా ఉన్న ప్ర‌భాక‌ర్ రెడ్డిలు ఇద్ద‌రూ ఇద్ద‌రేన‌నే విష‌యం పాలుతాగుతున్న ప‌సికందున‌డిగినా చెబుతుంది! ఇదీ జిల్లాలో ముఖ్యంగా వారి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితి. అయితే, ఇప్పుడు టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు కూడా జేసీల మాట‌కు `జీ హుజూర్‌` అంటున్నారా?  వారిని నెత్తిన పెట్టుకుంటున్నారా?  వారు చెప్పిన ప‌నులు హుఠాహుటిన చేసేస్తున్నారా ?  వారి మాటే వేదంగా బాబు న‌డుస్తున్నారా ? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. 


విష‌యంలోకి వెళ్తే.. ఎంపీగా ఉన్న దివాక‌ర్ రెడ్డి నెల రోజుల కింద‌ట హై డ్రామాకు తెర‌దీశారు. త‌న మాట‌కు విలువ లేకుండా పోతోంద‌ని, త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని రైతుల‌కు చుక్క నీరు కూడా ద‌క్క‌కుండా పోతోంద‌ని, అధికార పార్టీకి చెందిన ఎంపీ అయి ఉండి పీకిందేంట‌ని రైతులు న‌న్ను ప్ర‌శ్నిస్తున్నార‌ని పెద్ద ఎత్తున హంగామా సృష్టించారు. ఈ క్ర‌మంలోనే త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మీడియా ను పిలిపించుకుని మ‌రీ దాదాపు రెండు గంట‌ల‌పాటు హాట్ హూట్ అంటూ చెల‌రేగిపోయారు. దీంతో హుటాహుటిన స్పందించిన సీఎం చంద్ర‌బాబు ఆఘ‌మేఘాల‌పై అనంత‌పురం జిల్లా జేసీ నియోజ‌క‌వ‌ర్గానికి నీరందేలా చూడాల‌ని మంత్రి దేవినేని ఆదేశించారు. 


దీంతో 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క‌ముందే నీరు పారింది. దీంతో జేసీ త‌న రాజీనామాను తూచ్‌! అంటూ కొట్టిపారేశారు. ఇక‌, ఇప్పుడు ఆయ‌న త‌మ్ముడు తాడిప‌త్రి ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్‌రెడ్డి వంతు వ‌చ్చింది. అయితే, ఈయ‌న త‌న అన్న‌లా రాజీనామా డ్రామాకు తెర‌లెత్త‌కుండా తెలివిగా అధికారులు, మంత్రుల‌పై బూతుల‌తో విరుచుకుప‌డ్డార‌ని స‌మాచారం. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో గ్రానైట్ క్వారీలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని, వాటికి రాయ‌ల్టీ త‌గ్గించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అయితే, చూస్తాం.. చేస్తాం.. అంటూ న‌చ్చ‌జెప్పిన మంత్రులు, అధికారుల‌పై ప్ర‌భాక‌ర్ బూతులు తిట్టేస‌రికి విష‌యం సీఎం చంద్ర‌బాబు దాకా వెళ్లింది. 


దీంతో ఈ విష‌యంలోనూ బాబు చ‌క‌చ‌కా పావులు క‌దిపారు. రాయల్టీలో 20 శాతం తగ్గింపునకు ఆమోదముద్ర వేశారు. నిజానికి ఇలా త‌గ్గించ‌డం వేల కోట్ల రూపాయ‌ల ప్ర‌భుత్వ ధ‌నం త‌గ్గిపోతుంది. అయినా కూడా ప్ర‌భాక‌ర్ రెడ్డి టంగ్‌ ప‌వ‌ర్‌కి బాబు ఓకే అన‌క త‌ప్ప‌లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.  సో.. ఇదీ జేసీల ప‌రిస్థితి. మ‌రి ఇలా అయితేనేకానీ, చంద్ర‌బాబు ప‌నులు చేయ‌రా? అని మిగిలిన ఎమ్మెల్యేలు ప్ర‌శ్నిస్తుండడం గ‌మ‌నార్హం. మ‌రి దీనికి బాబు ఏమ‌ని స‌మాధానం చెబుతారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: