బెంగళూర్ –నాందేడ్ ఎక్స్ ప్రెస్ లో శనివారం తెల్లవారుజామున 3.30గంటలకు ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో 20 మంది సజీవ దహనం అయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, ఇద్దరు చిన్నారులు సహా 23 మంది గాయపడ్డారు. ప్రమాదంలో బి-1 ఏసీ బోగీ పూర్తిగా దగ్ధమైంది. మరో బోగీ పాక్షికంగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అనంతపురం జిల్లా కొత్తచెరువు, పుట్టపర్తి రైల్వే స్టేషన్ల మధ్య రైల్లో మంటలు వ్యాపించాయి. రైల్లోని ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఏసీ బోగీ బి వన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇందులో 64 మంది ప్రయాణిస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన పుట్టపర్తి రైల్వే గేట్ మెన్న అధికారులను అప్రమత్తం చేసారు. అధికారులు రైలును పుట్టపర్తి రైల్వే స్టేషన్ లో ఆపివేసి ఏసీ బోగీల లింక్ ను తొలగించారు. అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా మంటలు రెండో బోగీకి వ్యాపించాయి. బి1 బోగీ పూర్తిగా కాలిపోయింది. కొందరు ప్రయాణికులు బోగీలో చిక్కుకున్నట్టు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురు ప్రయాణికుల్ని చికిత్స నిమిత్తం ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద వార్త తెలియగానే అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లను తీసుకెళ్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఇక ధర్మవరం స్టేషన్ నుంచి సహాయ సిబ్బందిని తీసుకుని ప్రత్యేక రైలు ప్రమాద స్థలానికి బయల్దేరి వెళ్లింది. సమీపంలోని పుట్టపర్తి, ధర్మవరం ఆస్పత్రి సిబ్బందిని అప్రమత్తం చేశారు. క్షతగాత్రులను ధర్మవరం, పుట్టపర్తి ఆస్పత్రులకు తరలించారు. బోగీల నుంచి ప్రయాణికులు దిగేయడంతో ప్రాణ నష్టం కొంతవరకు తగ్గింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: