లొంగిపోతారా?.. లేదా? అంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వరం హెచ్చరించిన సమయంలో.. భారత ప్రభుత్వంతో సంధి చేసుకోవటానికి మించిన ప్రత్యామ్నాయం తన ముందు లేదని అర్థం చేసుకొన్న నవాబు... కలలో కూడా ఊహించని సంఘటన జనవరి 20న చోటు చేసుకుంది. ప్రజాస్వామ్య భారతంలో భారత ప్రజలు తనను.. తన పాలనను పొగుడుతారని నిజాం అనుకోని ఉండరు. తనపై ఏ ప్రజలైతే తిరుగుబాటు చేసి తనను పదవీచ్యుతికి గురి చేశారో.. తన రాజరిక వ్యవస్థకు సమాధి కట్టారో అదే సమూహానికి చెందిన ప్రతినిధులు తనను ఘనంగా స్మరించుకుంటారని.. అరవయ్యేళ్లకు పైబడిన ప్రజాస్వామ్యం తన వైఫల్యాన్ని చట్టసభ సాక్షిగా ఒప్పుకుంటుందని.. తాము చేయలేని అభివృద్ధిని నిజాం చేయగలిగారన్న ప్రసంశలతో ముంచెత్తుతారని ఆయన అస్సలు ఊహించి ఉండరు. ఒకవేళ ఆయన వారసులు హైదరాబాద్ కు దూరంగా ఉండి.. సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చ గురించి తెలిస్తే వారు నవ్వుకుంటారేమో. తమ పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన వారికి తగిన శాస్తి జరిగిందని భావిస్తారేమో. ఇదే వైఖరి మరికొంత దూరం వెళితే విచిత్రమైన వాదనలు వినిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదేమో. తమ తాత ముత్తాతలు సాధించిన ప్రగతిని స్వాతంత్ర్య భారతం సాధించలేని విషయాన్ని ఒప్పుకోవటం చూసి.. తమ రాజ్యం తమకు ఇవ్వాలన్న డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదేమో. తమ తాత ముత్తాతల తలపై కత్తి పెట్టి తమ రాజ్యాన్ని భారత సర్కారు దురాక్రమించిందని.. ఇప్పటికైనా చేసిన తప్పులపై లెంపలేసుకొని తమ రాజ్యాన్ని తిరిగి ఇచ్చేయటం మంచిదన్న వాదన చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతేనా.. తమ పెద్దలు ఎంత జనరంజకంగా పరిపాలించిన విషయాన్ని తమ రాజ్యప్రజలు.. ఇప్పటి ప్రజాప్రతినిధులు తమ చట్టసభల్లోనే వ్యాఖ్యానిస్తున్నారని.. కావాలంటే అధికారిక రికార్డులు చెక్ చేయాని అంతర్జాతీయ న్యాయస్థానంలో వ్యాజ్యం వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. అలాంటివి ఎందుకు చోటు చేసుకుంటాయి? ఇదేమైనా సినిమానా? ఎక్కడో ఉన్న నిజాం వారసులు వచ్చి తమ రాజ్యం తమకు కావాలని డిమాండ్ చేయటం ఏమిటన్న ప్రశ్నలు అక్కర్లేదు. ఎందుకంటే.. నిజంగా వారికి అవకాశం ఉంటే అడగలేరని మీరు చెప్పగలరా? మీరు వారిని వ్యతిరేకించగలరా? ఎందుకంత పిడి వాదన చేస్తున్నారు? ఏ మాత్రం వాస్తవికత లేని అంశాలపై చర్చ అనవసరం అని కొట్టిపారేయలేం. ఎందుకంటే కలలో కూడా ఊహించని విషయాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. విభజన వ్యవహారం అసెంబ్లీ ముంగిట్లోకి వచ్చిన వేళ.. పునర్విభజనకు సంబంధించిన చర్చపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో నిజాం నియంతృత్వ పాలనను పలువురు సభ్యులు ప్రస్తావించటం జరిగింది. నిజానికి ఈ ఎత్తుగడ మొత్తం కూడా ఆయా పార్టీల్ని ఇరుకున పెట్టటం కోసమే. అయితే.. పదే, పదే నిజాం ప్రస్తావన రావటం.. ఆయనపై విమర్శలు సంధించటం మజ్లిస్ నేత అక్బరుద్దీన్ కు అస్సలు నచ్చలేదు. నిజాంను ఆయన మైనార్టీల ప్రతినిధిగా చూశారే తప్ప.. ఒక అరాచక ప్రభువు అన్న కోణంలో చూడలేదు. అదే ఇప్పుడొచ్చిన సమస్య. నిజాం అంటే.. మైనార్టీలకు చెందిన వ్యక్తిని పదే.. పదే విమర్శించటంగానే ఆయన భావించారు. మత రాజకీయాలలో ఆరితేరిన మజ్లిస్ ప్రతినిధులు నిజాంను వీలైనంత ఎక్కువగా పొగడటం ద్వారా.. తాము ప్రాతినిధ్యం వహించే పాతబస్తీ ప్రజల్లో మరింత అభిమానాన్ని పొందేందుకు ఆయన పావులు కదిపారు. అక్బరుద్దీన్ తెలివైన రాజకీయ నేత. తాను నిజాం ప్రభువును పొగిడినా.. ఆయనకు అసెంబ్లీలో ఘన సన్మానం చేసినా మిగిలిన పార్టీ నేతలెవర్వరూ పెద్దగా విరుచుకుపడరని తెలుసు. అక్బర్ మాటలకు అభ్యంతరం చెబితే.. మొత్తంగా మైనార్టీల మీద దాడిగా ముద్ర వేసే అవకాశం ఉండటం.. మిగిలిన సంగతులెలా ఉన్నా మైనార్టీలకు వ్యతిరేకం అన్న ముద్ర మాత్రం పడకూడదని తపిస్తారు. ఆ బలహీనత అక్బర్ కు బాగా తెలుసు. ’’పదిహేను నిమిషాలు సమయం ఇవ్వండి. మేం ఏమిటో చూపిస్తాం. వాళ్లు వంద కోట్ల మంది ఉన్నా.. మేం ఉన్న అతికొద్ది మందిమైనా మా సత్తా ఏంటో చాటతాం‘‘ అంటూ అదిలాబద్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అక్బర్ గురించి తెలిసిందే. అక్బర్ కి.. ఆయన ప్రాతినిధ్యం వహించే మజ్లిస్ అంటే మిగిలిన పార్టీలకు ఎంత భయం అంటే.. అక్బర్ చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యల్ని ఖండించే సాహసం రాష్ట్రంలోని ఏ నేతా చేయలేదు. అదే సమయంలో ఆయన చేసిన జాతివిద్రోహ వ్యాఖ్యల్ని ప్రచురించించే ధైర్యం ఏ పత్రికా చేయలేదు. సామాజిక నెట్ వర్క్ ల్లో విపరీతమైన చర్చ జరిగి.. ఆ విషయం ఢిల్లీలో ఉన్నఒక ఎన్జీవో సంస్థకు చెందిన మైనార్టీ మహిళ దృష్టిలో పడటం.. ఆమె ఈ ఉదంతంపై ఫిర్యాదు చేశాక కానీ.. పత్రికల్లో దీనికి సంబంధించిన వార్త రాలేదు. ఈ మొత్తం జరగటానికి దాదాపు నాలుగైదు రోజుల కంటే ఎక్కువ సమయమే పట్టింది. అనంతరం చట్టం తన పని తాను చేయటం మొదలుపెట్టి.. అక్బర్ ను తమ వద్దకు హాజరు కావాలని ఆదేశిస్తే.. చివరకు ఆ నోటీసును అందుకోవటానికి కూడా అక్బర్ కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. చివరకు ఆయన్ని అదుపులోకి తీసుకోవటం.. తర్వాతి వ్యవహారం తెలిసిందే. ఇలాంటి వ్యాఖ్యలే ఇంకెవరైనా చేసి ఉంటే.. దేశంలోని అన్నీ రాజకీయ పార్టీలు స్పందించేవి. చివరకు అమెరికా లాంటి దేశాలు కూడా స్పందించి సదరు నేత మీద ఉగ్రవాది కంటే భయంకరమైన మతవాది అన్న ముద్ర వేసి పారేసి.. అతన్ని ఓ అంటరాని వాడిగా మార్చేవారు. వీరికి తోడుగా మానవతావాదులు.. సెక్యులరిస్టులు.. కమ్యూనిస్టులు.. మానవహక్కుల నేతలు వంత పాడేవారు. విచిత్రమైన విషయం ఏమిటంటే.. ఎన్ని చేసినా.. ఎలా మాట్లాడినా అక్బర్ లాంటి వారి మీద ఈగ కూడా వాలదు. ఈ దేశంలో ఓట్ల ఆధారంగా నడిచే రాజకీయంలో మతం, కులం, ప్రాంతం లాంటి వాదనలకు పెద్ద పీట వేస్తూ ప్రజలు సైతం భావోద్వేగంతో స్పందిస్తుంటారో అప్పటివరకు అక్బర్ లాంటి వాళ్లు తెగబడుతూనే ఉంటారు. ఈ రోజు నిజాం భేష్.. ఆయన లాంటి వాళ్లు ఇంకెవరూ లేరన్న పెద్దమనిషి.. రేపొద్దున హైదరాబాద్ వరకూ ప్రత్యేక దేశంగా ఏర్పడాలన్న వాదనను తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు. నిజాం అకృత్యాల గురించి ఎవరైనా ప్రస్తావిస్తే.. ’’మానిన గాయాన్ని కెలుకుతారా? అలా చేస్తే రక్తస్రావం అవుతుంది‘‘ అంటూ అసెంబ్లీలోనే హెచ్చరికలు చేసేందుకు సైతం అక్బరుద్దీన్ వెనుకాడరు. ఆయన అలా చెలరిగిపోతున్నా.. ధీటుగా ఎవరూ బదులివ్వరు. అలా అని మాట్లాడే వాళ్లు లేరా? అంటే ఉన్నారు. కానీ.. చూస్తూ.. చూస్తూ అక్బర్ ను ఏమైనా అంటే.. ఆయన ప్రాతినిధ్యం వహించే వర్గం దూరం అవుతుందేమోనన్న సందేహం వారిని మాట్లాడనీయకుండా చేస్తుంది. ఈ మౌనానికి చెల్లించాల్సిన ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుందన్న మర్చిపోవటం ప్రజలు చేసుకున్న దురదృష్టంగా చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: