మన దారిలో మనకే తెలియని మలుపులెన్నో, మన పయనంలో ముందెన్నడూ కానరాని అవరోధాలెన్నో. ఎటు అడుగేయాలో, ఏ వైపుగా నడవాలో తెలియని సంకటస్థితి....ఆ నిమిషంలో మన భుజం చుట్టూ తన చేయి వేసి, తన వేలితో మన గమ్యాన్ని చూపించేదే...స్నేహం. మన క్షేమాన్ని కాంక్షించేది స్నేహం. మన గెలుపుకై ఆకాంక్షించేది స్నేహం. మనం పొరపాటు చేస్తే సగభాగం తాను స్వీకరించి బరువును, బాధ్యతను పంచుకుంటుంది స్నేహం. మనం ప్రయత్నిస్తే ప్రొత్సహిస్తుంది. మనం గెలిస్తే ఉత్సాహంతో గంతులేస్తుంది. మనం ప్రమాదంలో చిక్కుకుంటే ఉరుకులు పరుగులతో ఆగమేఘాల మీద వస్తుంది. ఆనాడు మహాభారతంలో అంగరాజ్యానికి రాజునయ్యానన్న ఆనందం కన్నా, తనకి విలువనిచ్చే దుర్యోధనుని మిత్రునిగా పొందానన్న ఆనందమే కర్ణుడి సొంతమయింది. అందుకే వారి స్నేహం అంత ప్రాచుర్యం పొందింది. ఈ జగత్తులో అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళు లేని వారుండొచ్చు కానీ నేస్తం లేని జీవితం ఉండదు. ఆహార్యంలేని నాట్యం, ధైర్యంలేని దేహదారుఢ్యం, స్నేహం లేని జీవితం ఒక్కటే. తుమ్మెద వాలని పువ్వులుండొచ్చు, మనిషి విజ్ఞానానికి అందని అద్భుతాలుండొచ్చు. కానీ, నిజమైన స్నేహానికి అర్ధం కాని మనం ఉండం. ఒకవేళ ఉంటే అది మనం కాలేం. స్నేహం ఒక వన్నెతరగని అద్భుతం. స్నేహం ఒక విలువ తగ్గని అమృతం. స్నేహం తన రెక్కలపై మనని మోసుకెళ్ళే స్వేచ్చా కపోతం. స్నేహం మనలందరిని కలిపే గొప్ప మతం. గెలువు,ఓడు,నడువు,పాకు,అరువు....ఎదైనా చేయి. ఆవేశం,కోపం,ఉక్రోషం,దుఃఖం,ఆనందం...ఎదైనా చూపించు. సౌమ్యం,కఠినం,కరుకు,సున్నితం...ఎలా అయినా మాట్లాడు. ఆకాశం,భూమి,గాలి,నిప్పు,నీరు....పంచభూతాల సాక్షిగా నిన్ను ఎన్నటికీ వీడనిది, మారమని అడగనిది, కసిరినా,తన్నినా,తిట్టినా వదలనిది స్నేహం ఒక్కటే.

మరింత సమాచారం తెలుసుకోండి: