నాన్న....పదం పలుకుతుంటేనే గొంతులో గౌరవం ధ్వనిస్తుంది. నీ అడుగుల్లో తన భవిష్యత్ ప్రపంచాన్ని చూసుకుంటాడు. నీ చేతల్ని చూస్తూ ఆనందం పొందుతాడు. నీ నవ్వుల్లో, తన జీవితంలోని అంధకారాల్ని పొగొట్టే వెన్నెలని కనుగొంటాడు. నాన్న మీసంలో గాంభీర్యం ఉంటుంది. కాని నాన్న మనసులో మనపైన గంపెడు ప్రేమ ఉంటుంది. నీవు ఆకాశమంత ఎత్తు ఎదగడానికి తను నిచ్చెన కావాలనుకుంటాడు. నీ ప్రతి అడుగులోనూ తన చేతులను పాన్పుగా పరుస్తాడు. తప్పు చేస్తే ఆగ్రహిస్తాడు. ఒప్పు చేసేలా శాసిస్తాడు. నీ దారిలో అవరోధాల్ని ద్వేషిస్తాడు. నీ ఆలోచనలను శుద్ధి చేస్తాడు. నాన్న అరుపులో ప్రేమ ఉంటుంది. నాన్న మనసులో మనపట్ల అభిమానం ఉంటుంది. నాన్న కోపంలో అర్ధం ఉంటుంది. నీ వయసులో నాన్న అనుభవం ఉంటుంది. వీపు మీద నువ్వు ఎక్కినప్పుడు గుర్రం అవుతాడు. భుజంపై ఎక్కి తొక్కినప్పుడు ఏనుగు అవుతాడు. నీ రక్షణకై కాపలా కాస్తాడు. నీకోసం తన జీవితమంతా గొడ్డులా కష్టపడతాడు. అందుకని నాన్నని చులకనగా చూడకు. నీ ఆనందంకోసం నడిచిన ఆ మనిషికి విశ్రాంతిని కల్పించు. నీ ఎదుగుదలకోసం పరుగులు తీసిన ఆ పాదాలని సేద తీరనీయి. నిత్యం నీ ఆలోచనలతో అలసిపోయిన ఆ మెదడుకి ఆహ్లాదాన్ని కలిగించు. నవ్వించు, రక్షించు కాని ప్రేమించు. నిన్ను తన కాళ్ళపై నుంచోబెట్టి నడక నేర్పించిన నాన్నని, నీ కాళ్ళపై నువ్వు నిలబడి తలెత్తుకునేలా చేయి. నీ గమ్యంతో నాన్న ప్రయాణాన్ని పూర్తిచేయి. నీ విజయంతో నాన్నకి గెలుపునివ్వు. నీ నవ్వుతో నాన్నకి మళ్ళీ ఆనందానివ్వు. నీ ప్రేమతో, వాత్సల్యంతో నాన్నకి మరో జన్మనివ్వు.

మరింత సమాచారం తెలుసుకోండి: