నేడు జరుగుతున్న ఎన్నికల సమరం 'క్వార్టర్ ఫైనల్స్'! ఇంకా సెమీ ఫైనల్స్‌లాంటి పరిషత్ ఎన్నికలున్నాయి. ఆ తర్వాత... ఫైనల్స్ అయిన సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. వీటన్నికి తొలిమెట్టనుకున్నారో ఏమో దాదాపు అన్ని ప్రధాన పార్టీల నేతలు రాత్రంతా కట్టలు తెంచారు. అదే నండీ క్యాష్ ప్యాక్ లు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఒక్క ఓటుకి గరిష్టంగా పన్నెండువేలు ముట్టజెబితే, ఇంట్లో ఎక్కువ ఓట్లుంటే ఏకంగా ఫ్యామిలీ ప్యాక్ లే ఇచ్చేశారు. కీలకఘట్టమైన పోలింగ్ వేళ రాజకీయపార్టీలు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. రాత్రంతా నగదు, మద్యం ఏరులైపారింది. ఓటుకు ఊహించనంత రేటు పలికింది. ఒక చోట వెయ్యి, మరోచోట రెండు వేలు! దీనికే అమ్మో అనుకుంటుండగా... ఇంకో చోట ఏకంగా ఐదువేలు! దానిని తలదన్నుతూ మరోచోట ఏకంగా 12 వేలు! ఇలా ప్రత్యర్థి పార్టీ బలమైన స్థానంలో ఉన్నారని భావించిన చోట... ఓటు విలువ సర్రున పాకిపోయింది. చీరలు, కుక్కర్లు, ఫ్యాన్లు, టీవీలు, వెండి భరిణలు, చివరికి... ఎల్ఈడీ టీవీలు కూడా నేతలు పంచిపెట్టారు. ఇంట్లో ఉన్న ఓట్ల సంఖ్యను బట్టి 'ఫ్యామిలీ ప్యాకేజీ'లు ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఒక విడత పంపిణీ పూర్తయిన చోట.. ఎందుకైనా మంచిదని శనివారం రాత్రి మరో విడత మొదలుపెట్టారు. అటు ఓట్ల పండగ, ఇటు ఉగాది పండుగ రావడంతో రాజధాని హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున జనం స్వగ్రామాలకు తరలి వెళ్లారు. కాగా, పోలీసు తనిఖీల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీగా నగదు పోలీసుల చేత చిక్కింది. మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ లో నగర పంచాయితీ ఎన్నికల సందర్భంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేశారు. 550 లీటర్ల సారాయి, 3లక్షల 50వేల నగదు స్వాధీనం చేసుకుని 92 బైండోవర్ కేసులు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లోని లక్ష్మీ మెస్లో ఎక్సైజ్ అధికారులు 72 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లిలో రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులు మెరుపుదాడులు చేసి భారీగా నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి నుంచి 20లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 2లక్షల75వేల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల పట్టణంలో కారులో తరలిస్తున్న 43వేల నగదును పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మంజిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో డబ్బు ఏరులై పారినట్టు సమాచారం. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మద్యం సీసాలు, చీరలు, నగదు భారీ మొత్తంలో పోలీసులకు పట్టుబడినట్టు తెలుస్తోంది. రాజమండ్రి అర్బన్ పోలీసులు జిల్లా పరిధిలో మొత్తం 22లక్షల వరకూ నగదు, వంటసామాగ్రి , చీరలు, చెప్పులు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలం పొట్టిలంకలో 750 స్టీల్ బిందెలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో వైసీపీ కార్యకర్తలు డబ్బు పంచుతుండగా పోలీసులు పట్టుకుని 50వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో 800ల కేసుల్లో తరలిస్తున్న మధ్యాన్ని పోలీసులు స్వాధీన పర్చుకున్నారు. చిత్తూరు జిల్లాలోనూ డబ్బు కట్టలు లెక్కకు మిక్కిలిగా తెగిపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: