అప్పుడు గులాబీ కండువా కప్పుకున్నారు....ఇప్పుడు పచ్చ జెండా పట్టుకున్నారు....గతంలో హస్తం నీడన ఉన్నారు...ఇప్పుడు కారులో షికారు చేస్తున్నారు....వీళ్లంతా కేవలం పార్టీలు మాత్రమే మారారు...మిగతావన్నీ సేమ్ టూ సేమ్......ఇలా రాష్ట్రంలోని ప్రతీ పార్టీలో ఇతర పార్టీల నాయకులు భారీగా వచ్చి చేరారు. దీంతో ఈసారి ఎన్నికల్లో నిలబడుతున్న క్యాండిడేట్లు అందరూ పాత వాళ్లే...కాకపోతే కాంగ్రెస్ లో ఉన్నవాళ్లు టీఆర్ఎస్ లో, టీడీపీలో ఉన్నవాళ్లు కాంగ్రెస్ లో కనిపిస్తున్నారు...జెండా, కండువాలే మారాయి, అభ్యర్థులు మాత్రం మారలేదు.. రాష్ట్ర విభజన వల్ల గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో అనేక విచిత్రాలు చోటు చేసుకున్నాయి. 2009 ఎన్నికల్లో ఒక పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించి, ఈసారి మరో పార్టీ నుంచి బరిలోకి దిగుతున్న వారి సంఖ్య వంద వరకు కనిపిస్తోంది. అదేవిధంగా గత ఎన్నికల్లో ఒక పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారూ, ఈసారి మరో పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న వాళ్లలో... 2009 ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి గెలిచిన వారు వందమంది వరకూ ఉన్నారు. టీఆర్ఎస్ ఒక్కటే ఇప్పటి వరకు అధికారికంగా 73మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మిగిలిన పార్టీల్లో అభ్యర్థులు ఎవరనేది తేలినా, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. టీఆర్ఎస్ ప్రకటించిన 69మంది అభ్యర్థుల తొలి జాబితాలో.. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 21 వరకూ ఉంది. 69మందిలో మొత్తం 30మంది టీడీపీ నుంచి వచ్చిన వారే. టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా టీడీపీ నేతలమయంగా కనిపిస్తుంటే... టీడీపీ సీమాంధ్ర అభ్యర్థుల జాబితాలో కాంగ్రెస్ వారు పెద్దసంఖ్యలో ఉన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ నేతలు టీడీపీ ముఖంతో పోటీ చేస్తుంటే, తెలంగాణలో టీడీపీ నేతలు టీఆర్ఎస్ ముఖంతో పోటీ చేస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత సీమాంధ్రలో కాంగ్రెస్ పేరుతో గెలిచే అవకాశం ఎంతమాత్రం లేదని గ్రహించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు టీడీపీని ఆశ్రయించారు. టీఆర్ఎస్ తొలి జాబితాలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న, హరీశ్వర్‌రెడ్డి, వేణుగోపాలాచారి, మహేందర్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ , గంగుల కమలాకర్, హనుమంతు షిండే, ఎస్ సత్యనారాయణ, కెఎస్ రత్నం ... వీళ్లంతా 2009లో టీడీపీ తరపున అసెంబ్లీకి ఎన్నికైన వాళ్లే. సిపిఐ నుంచి వైరా ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరారు. ఆమెకు వైరా సీటు ఖరారు చేశారు. అదేవిధంగా టీడీపీ నుంచి చేరిన ముఖ్య నాయకులకు, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, బాబుమోహన్‌లాంటి వారికి అవకాశం కల్పించారు. బాబుమోహన్‌కు ఆందోల్ అసెంబ్లీ సీటు, కడియం శ్రీహరికి వరంగల్ పార్లమెంటు నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. గత ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పార్లమెంటుకు పోటీ చేసిన టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు తూమ్ బీమ్‌సేన్‌కు ఈసారి సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎంపీ సీటు లభించింది. విభజన జరిగేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న సీమాంధ్ర నేతలు టీడీపీలో చేరుతున్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరిన గల్లా అరుణకు అసెంబ్లీ సీటు, ఆమె కుమారుడికి పార్లమెంటు సీటు ఖరారైంది. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి చివరి వరకు ఏకైక మద్దతుదారునిగా నిలిచిన మంత్రి పితాని సత్యనారాయణ సైతం ఆయన్ని వీడి టీడీపీలో చేరారు. టికెట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఇప్పుడు పోటీ చేస్తున్న వారంతా గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో పని చేసిన వారే. ఇలా చాలా మంది నాయకులు సీట్ల కోసం జంప్ జిలానీలుగా మారి ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు..తమకు కావల్సింది పదవేనని, పార్టీ ముఖ్యం కాదని నిరూపిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: