స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలకు సార్వత్రిక ఎన్నికలకు బాదరాయణ సంబంధం ఒకటి ఉంటుందా ఉండదా అనే సంగతి తరవాత... అయితే.. పురపాలక ఎన్నికల ఫలితాలు వెంటనే వచ్చేస్తే.. వాటి ఎపెక్టు ఎంతో కొంత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళిపై పడుతుందని పార్టీలు మధన పడుతున్నాయి. పురపాలక ఫలితాలు ఇప్పుడే వచ్చేస్తే తమకు నష్టం జరుగుతుందని కొందరు, వస్తేనే మేలు.. మరింతగా జనాదరణను ఈ పునాదుల మీద నిర్మించుకోవచ్చునని కొందరు ఎవరి అంచనాలు, ఎవరి ఊహల్లో వారు తేలియాడుతున్నారు. మునిసిపల్ ఎన్నికల ఫలితాల వెల్లడికి సంబంధించి ఇవాళ (సోమవారం) సుప్రీం కోర్టు తుది తీర్పును వెల్లడించవలసి ఉంది. ప్రస్తుతానికి ఫలితాల వెల్లడిపై సుప్రీం వారి స్టే కొనసాగుతోంది. గతంలో ఫలితాలను 9వ తేదీన వెల్లడి చేసేయాల్సిందేనని రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై కొందరు సుప్రీంను ఆశ్రయించారు. తాత్కాలిక స్టే ఇచ్చి ఇవాళ విచారించబోతోంది. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్ని బేరీజు వేస్తే గనుక.. పురపాలక ఎన్నికల గురించి తెలంగాణలో పెద్ద టెన్షన్ గా ఎదురుచూస్తున్న పార్టీలు లేవు. తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన నేపథ్యంలో కాంగ్రెస్, తెరాస లు వాటిని పంచుకునే అవకాశం ఉంది. పైగా ఈ ఫలితాలు సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఆ రాష్ట్రంలో లేదు. అదే సీమాంధ్ర విషయానికి వస్తే పరిస్థితి వేరు. అక్కడ తెలుగుదేశం, వైకాపా ల మధ్య పోటీ తీవ్రంగటా నడుస్తోంది. ఇరు పార్టీల మీద ప్రజలకు కొంత నమ్మకమూ, కొన్ని అనుమానాలూ ఉన్నాయి. ఇరువురి ఆదరణ మధ్య తేడా స్వల్పంగా ఉండడంతో స్థానిక ఎన్నికల ఫలితాల గురించి ఆ పార్టీలు మీమాంసలో ఉన్నాయి. వైకాపా క్షేత్రస్థాయి నిర్మాణం గురించి పూర్తి పటిష్టంగా రూపొందని నేపథ్యంలో మునిసిపల్ ఎన్నికల్లో చాలాచోట్ల పోటీకే కిందా మీదా అయింది. తనకున్న ఆదరణతో నిమిత్తం లేకుండా.. వారికి ఇబ్బందులు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి అలాంటివేమీ లేకుండా.. ఎంచక్కా అన్ని స్థానాల్లో పోటీచేశారు. ఎటూ కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో పతనం అయిపోయింది గనుక.. దాని ఊసు అనవసరం అని అందరూ అనుకుంటున్నారు. మునిసిపల్ ఫలితాలు వస్తే తమకే ఎక్కువ స్థానాలు దక్కుతాయని.. దాన్ని చాటుకుంటూ.. తాము సార్వత్రిక ఎన్నికలకు కాస్త మైలేజీ సాధించుకోవచ్చునని తెలుగుదేశం భావిస్తోంది. అయితే వైకాపా ఎన్నికల ఫలితాలు రాకపోతేనే మంచిది.. ప్రజల్లో తమ పార్టీకి ఉన్న ఆదరణ ఎమ్మెల్యే ఎన్నికల్లోనే ప్రతిబింబిస్తుందని.. మధ్యలో ఈ ఫలితాల వల్ల అది పలచన అయిపోకుండా ఉంటుందని అనుకుంటోంది. మొత్తానిక పార్టీల ఆశల ఊగిసలాట రకరకాలుగా ఉంది. సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: