ఈ సార్వత్రిక ఎన్నికలు అసాధారణమైన ఎన్నికలుగా అభివర్ణిస్తున్నారు. ఎన్నో స్పెషాలిటీలున్న ఈ ఎన్నికల్లో సామాన్యులు మొదలుకుని.. సెలబ్రిటీలవరకూ అందరూ ఉత్సాహం చూపుతున్న ఏకైక ఎన్నికగా 2014 ఎన్నికలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. ప్రాంతాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, విదేశాల్లో స్థిరపడ్డవారుసైతం అందరూ ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంటూ.. ఎన్నికల్లో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. కళాకారులు, వీఐపీలు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ఒక్కరేమిటి అందరూ ఈదఫా ఎన్నికలపై చెవి కోసుకుంటున్నారు. ముఖ్యంగా యువతీ-యువకులు రాజకీయాలపై అమితాసక్తి ప్రదర్శిస్తూ.. ఓటర్లుగా నమోదు చేసుకుని.. పోటీకి సైతం సై అంటోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజకీయ రంగప్రవేశంతో ఒక్కసారిగా దేశరాజకీయాల్లో రాజకీయ విప్లవానికి తెరలేచింది. ఓవైపు సోషియల్‌ మీడియా మరోవైపు.. ప్రింట్‌-ఎలక్ట్రానిక్‌ మీడియా చొరవతో ఇటు గ్రామీణ ప్రజానీకం.. అటు పట్టణ-నగరాల్లోని ప్రజలు ప్రజాస్వామ్యంపట్ల విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ, ఓట్ల పండుగకోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు చావో-రేవో తేల్చుకునేందుకు కాంగ్రెస్‌-బీజేపీలమధ్య హోరాహోరా పోటీ జరుగుతుండగా.. ఓటర్లంతా ఏం జరుగనుందోనంటూ నరాలు తెగే ఉత్కంఠతో లోక్‌సభ ఎన్నికలపై శ్రద్ధ కనబరుస్తున్నారు. అందుకే అద్వానీవంటి తలపండిన రాజకీయనేతలుకూడా ఇలాంటి రాజకీయ ఉత్సాహం గతంలో ఎన్నడూ చూడలేదని గర్వంగా చెబుతున్నారు. పారిశ్రామికవేత్తలుకూడా ప్రత్యక్ష ఎన్నికల్లో దిగి.. తమ రాజకీయ ఆరంగేట్రంకోసం శ్రమిస్తుండగా.. అతిపెద్ద ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికల కవరేజీకి..విదేశీ మీడియాకూడా తరలివచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: