కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుడతాడు అన్నట్లు ఉంది వైకాపా ప్రరిస్థితి! అటు సీమాంధ్రనుంచి.. ఇటు తెలంగాణా నుంచి సైతం జిల్లా స్థాయినేతలు వైకాపాలో చేరిపోతున్నారు! చిత్తూరు టీడీపీ జిల్లా శాఖ అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు మంగళవారం వైసీపీ కండువా కప్పుకున్నారు.! దీంతో చంద్రబాబు సొంతం అయిన చిత్తూరు జిల్లాలో టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలినట్లు లెక్క! ఇప్పటికే బీజేపీ - టీడీపీ పొత్తు వ్యవహారంలో ఆందోళనల పర్వానికి తెరతీశారు తెలుగు తమ్ముళ్లు! ఆ రచ్చతోనే సతమతమవుతున్న పార్టీకి ... పార్టీ అధ్యకుడి సొంత జిల్లాలోనే ఇలాంటి పరిణామం జరగడం... సీమాంధ్రలో సైతం టీడీపీ బలహీనతను ఎత్తి చూపిస్తుందని పలువురి విమర్శ! ఇదిలా ఉంటే... ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ నేత, మాజీమంత్రి.. వనమా వెంకటేశ్వర్లు సైతం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. అచ్చంగా ఇక్కడ కలిసొచ్చే కాలానికి గెలిచొచ్చే నేతలాగా వనమా తమ పార్టీలోకి వచ్చాడని వైకాపా వర్గాలు మురిసిపోతున్నాయి. స్థానికంగా కొంత వ్యతిరేకత సహజమే అయినా.. వనమా చేరికతో తెలంగాణాలో వైసీపీకి కొత్త బలం వచ్చినట్టే! రాజకీయంగా ఎంతో అనుభవం ఉండి... తమకంటూ సొంత కేడర్‌ ఉన్న నేతలు వచ్చి చేరుతుండటం... నిజంగా వైకాపాకు కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవాలి! ప్రస్తుతం రాజకీయ పార్టీల్లో సొంత నాయకులకంటే... కొత్తగా వచ్చి చేరుతున్నవారికే వెంటనే సీట్లు కేటాయించేస్తున్నాయి అన్ని పార్టీలు! దానిలో భాగంగానే... తెలంగాణాలో కొద్దో గొప్పో బలం ఉందని భావిస్తున్న నేతలు వచ్చి... సమైక్యాంధ్ర పదం ఎత్తుకున్న జగన్‌ పార్టీలో చేరడం నిజంగా వైకాపాకు మంచి పరిణామనే చెప్పాలి! వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో అసలు అభ్యర్థులే దొరకరని.. దుర్భిణి వేసి వెతుక్కోవాలని.. రకరకాల విమర్శలు గతంలో ప్రత్యర్థులు గుప్పించారు. అయితే చివరిక్షణంలో ఒక స్థాయి ఉన్న నాయకులు కూడా క్యూ కట్టి వచ్చి పార్టీలో చేరుతుండడం.. ఒక రకంగా పార్టీ ఇక్కడ కూడా మిగిలిన వారితో సమానంగా స్థిరపడడానికి మంచి అవకాశం అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: