తెలుగుదేశం పార్టీలో యుద్ధవాతావరణం నెలకొంది. టికెట్ ల కేటాయింపు వ్యవహారం ముగింపు దశకు వస్తున్న కొద్దీ, గొడవలు ముదురుతున్నాయి. పార్టీ ఆఫీసుల ముందు మోహరింపు, ఫర్నిచర్ ధ్వంసం వంటి 'శాంతియుత' వ్యవహారాలు జరుగుతున్నాయి. ఈ ఊరు ఆ ఊరు అని లేదు. కర్నూలు నుంచి విశాఖ దాకా ఇదే తీరు. అయితే పెద్ద తలకాయలు కాబట్టి, కాస్త గుంభనంగా, పార్టీ ఆదేశమే శిరోధార్యం అని కబుర్లు చెబుతున్నారు. అనకాపల్లి టికెట్ మహిళకు ఇచ్చి, విశాఖను భాజపాకు ధారాదత్తం చేయడంతో గంటా కుడితిలో పడ్డారు. ఇప్పుడు అందుకే అనకాపల్లి టికెట్ మార్చాలని కార్యకర్తల డ్రామా మొదలైంది. విజయవాడ సంగతి తెలిసిందే. పవన్ పుణ్యమా అని కేశినేని నాని సీటు కిందకు నీళ్లు వచ్చాయి. కర్నూలులో ఊరేగింపులు ఇతరత్రా వ్యవహారాలు ముదిరాయి. సీమలో జేసి ల అల్లుడు దీపక్ రెడ్డి సిఎమ్ రమేష్ పై భగ్గుమన్నారు. అనపర్తిలో నల్లమల రామకృష్ణారెడ్డి హ్యాండ్ ఇచ్చారు. యలమంచిలి నుంచి రాజాబాబు, విశాఖ నుంచి వెంకట్రామయ్య మళ్లీ కాంగ్రెస్ బాట పట్టడానికి రెడీ అయిపోతున్నారు. దేశంలో ఈ వ్యవహారాలు చూసి, రావాలనుకున్నవారు కూడా కాస్త ఆలోచిస్తున్నారు. డీఎల్ రవీంద్రారెడ్డి ఈ కోవలో ముందున్నారు. అప్పుడే లోకేష్ ఓ మాట విసిరేసారు. పార్టీలోకి చేర్చుకునేవారికి ఎటువంటి హామీలు ఇవ్వడం లేదని. హామీలు ఇచ్చినవే నెరవేరడం లేదు. ఇంక ఇవ్వకుంటే ఎవరు గోడ దూకుతారు. ఇప్పుడు ఇలా దూకి భంగపడిన వారంతా లోపాయి కారీగా ఒకటే మాట అంటున్నారు. జగనే నయం. ముందుగానే మా దగ్గర ఖాళీ లేదు అని చెప్పేసారు. బాబు, రమ్మని, ఇస్తామని ఆశ పెట్టి, ఎందుకూ కాకుండా మా రాజకీయ జీవితాలతో ఆటాడుకున్నారు అని. అందుకే కాంగ్రెస్ జాబితాలో దూరిపోయి, కనీసం పోటీ అన్నా చేయాలని చూస్తున్నారు. మొత్తానికి రాబోయే ఒకటి రెండు. రోజుల్లో మాంచి హడావుడే వుంటుంది. సామ, దాన ఉపయాలు వాడి బాబు వాళ్ల చేత, పార్టీ విజయానికి కృషి చేస్తాం లాంటి ప్రకటనలు ఇప్పించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, వాళ్ల చేత నిజంగా ఆ పని చేయించడం మాత్రం కష్టం. రాజకీయం అంటే అదే. పైకి మాట. లోపల చేత వేరు వేరుగా వుంటాయి. ఇవి కచ్చితంగా రాబోయే ఎన్నకల్లో పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపుతాయి. చిత్రమేమిటంటే, గడచిన ఎన్నికల్లో బాబు స్వంత పార్టీవారు చాలా మందికి టికెట్ లు ఇవ్వలేదు. అక్కడ వున్న పోటీ నాయకులకు ఇచ్చారు. స్వంత పార్టీలో వెనుక గోతులు తవ్విన వారి పుణ్యమా అని టికెట్ వచ్చినవారు బకెట్ తన్నేసారు. ఈ సారి బాబు గతంలో ఆశించి భంగపడినవారికి ఇచ్చారు. ఇప్పుడు గతంలో టికెట్ వచ్చి, ఇప్పుడు రాని వాళ్లు ఇక గునపాలు పట్టుకుంటారు. అంటే టికెట్ లు ఎవరికి ఇచ్చినా గునపాలు పట్టుకునే వారు వుండనే వుంటారు. అదీ సంగతి.

మరింత సమాచారం తెలుసుకోండి: