రాష్ట్రంలో భారీ స్థాయిలో బహిరంగ సభలు నిర్వహించేందుకు బీజేపీ, టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ భారీ బహిరంగసభల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ ఒకే వేదికపై కనిపించనున్నారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ ముగ్గురూ ప్రచారం చేయనున్నట్లు టీడీపీ-బీజేపీ శ్రేణులు వెల్లడించాయి. ఈనెల తెలంగాణలో ఏప్రిల్ 22 తేదిన నిర్వహించే బహిరంగ సభల్లో మోడీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికను పంచుకోనున్నట్టు పీటీఐ తెలిపింది. ఏప్రిల్ 22న కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, సికింద్రాబాద్ లో నిర్వహించే సభల్లో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొనున్నారు. ఈ సభల్లో బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నాయకుల అందుబాటును బట్టి ఈ సభల నిర్వహణ తేదీల్లో మార్పులు జరిగే వీలుంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ మేరకు నరేంద్ర మోడీ కార్యాలయానికి కూడా ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. అయితే.. ఒకే రోజు మూడు సభలంటే సమయం సరిపోదేమోనని, రెండు సభలైతే బాగుంటుందేమోనన్న అభిప్రాయాన్ని మోడీ కార్యాలయం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరో రెండురోజుల్లోగా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకే రోజు మూడు సభలు నిర్వహిస్తే మాత్రం.. ఉదయం కరీంనగర్‌లో, మధ్యాహ్నం నిజామాబాద్‌లో, రాత్రి హైదరాబాద్‌లో బహిరంగ సభలు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం, దీనిపై అటు పవన్ కళ్యాణ్‌తో కూడా బీజేపీ నేతలు చర్చలు జరిపారు. తెలంగాణ, సీమాంధ్రల్లో నరేంద్ర మోడీ పాల్గొనే సభల్లో.. పవన్ కల్యాణ్ పాల్గొంటారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. విశాఖ, గుంటూరు, రాజమండ్రి, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాల్లో సభలు నిర్వహించాలని యోచిస్తున్నారు. మరోవైపు.. బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ తో పాటు పార్టీకి చెందిన ఇతర జాతీయ నేతలతో వివిధ ప్రాంతాల్లో సభలు నిర్వహించాలని బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: