సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో టిడిపి అధినేత చంద్రబాబు కుటుంబం, పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్.టి.రామారావు మనుమడు, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మధ్య అంతర్గత విభేదం మరింత పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరుస్తున్నట్లుగా సీమాంధ్రలో టిడిపి తరఫున ప్రచారం చేస్తున్న చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ టిడిపి ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించకపోవడాన్ని తేలిగ్గా తీసుకున్నారు. "పార్టీ కోసం ప్రచారం చేయాలని మేమెవర్నీ బతిమిలాడం. పార్టీలో ఉన్నవారెవరైనా సరే ఆహ్వానం కోసం ఆగకుండా ప్రచారంలో పాల్గొనవచ్చు" అని జూనియర్ ఎన్టీఆర్ కనిపించకపోవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు లోకేశ్ పుల్ల విరిచినట్లుగా సమాధానం చెప్పారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు అలియాస్ నాని పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా టిడిపికి మేలు చేశారని చెప్పడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్‌ను ఇరకాటంలో పెట్టడానికి ఆయన ప్రయత్నించారు.  నాని సినీ హీరోకు అత్యంత నమ్మకస్థుడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ బోర్డులపై టిడిపి వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ ఫోటోను ఆయన ఉంచడం టిడిపి నాయకత్వానికి ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో లోకేశ్ జూనియర్ ఎన్టీఆర్ లక్ష్యంగా నానీపై విమర్శలు చేస్తున్నారని కొందరు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి దూరమైన ఓటర్లను వెనక్కి రప్పించే క్రమంలో సీమాంధ్ర, తెలంగాణ అంతటా సుడిగాలి పర్యటనలు చేయాలనే ఆలోచనలో లోకేశ్ మామయ్య, సినీ హీరో బాలకృష్ణ ఉన్నప్పటికీ అటు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇటు ఆయన తండ్రి హరికృష్ణ పార్టీ తరఫున తమ ప్రచారంపై పెదవి విప్పడంలేదు. ఇదిలా ఉండగా టిడిపి అధినేత కుటుంబం, జూనియర్ ఎన్టీఆర్ మధ్య పెలుసుగా ఉన్న సంబంధానికి మరింత సమస్య సృష్టిస్తున్నట్లుగా సినీ హీరో అభిమానులు కొందరు సోమవారం రాత్రి నల్లగొండ జిల్లాలో ధర్నాకు దిగారు. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి టిడిపి అభ్యర్థి వెంగళ స్వామి గౌడ్‌కు ప్రచురితమైన ప్రచార పోస్టర్లు అందాయి. వాటిపై జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ముద్రించలేదు కానీ చంద్రబాబు, బాలకృష్ణ, జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉన్నాయి. దీంతో కలత చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పోస్టర్లను తగలబెట్టారు. ధర్నాకు దిగారు. టిడిపి ప్రచార పోస్టర్లపై జూనియర్ ఎన్టీఆర్‌కు బదులుగా పవన్ కళ్యాణ్ ఫోటోలు రావడానికి కారణమేంటని పార్టీ అభ్యర్థిని నిలదీశారు. పరిస్థితి హింసాత్మకంగా మారేలోగా పోలీసులు జోక్యం చేసుకొని చక్కబరిచారు. టిడిపి నాయకత్వం, జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు పెరిగిపోవడంతో యంగ్ హీరో ఈసారి పార్టీ తరఫున ప్రచారం చేస్తారా అనే సందేహం పార్టీ నాయకులు, శ్రేణులను పట్టి పీడిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: