సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఎంత చెడ్డా ఒకటీ రెండు నియోజకవర్గాల్లో మాత్రం కచ్చితంగా తన సత్తాను చాటే అవకాశం ఉంది. కనీసం ఇద్దరు కాంగ్రెస్ నేతలు అయినా గెలుస్తారనేది ఒక అంచనా. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థులు జంకే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ కు సీమాంధ్రలో అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు దొరకడం కూడా కష్టమైన పనే. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలోని మెజారిటీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించుకొంది. అయితే వారిలో ఎంతమంది నామినేషన్ వరకూ వెళతారు? అనేది అనుమానాస్పదంగా మారింది. కాంగ్రెస్ జాబితాలో ఉన్న నేతల్లో ఇద్దరు ముగ్గురు తమకు పోటీ చేసే ఉద్దేశం ఏదీ లేదని స్పష్టం చేశారు. తమకు తెలియకుండానే కాంగ్రెస్ హైకమాండ్ టికెట్ ఖరారు చేసిందని ,తాము నామినేషన్ వేయమని వారు స్పష్టం చేశారు. ఇక విజయవాడలో వెల్లంపల్లి శ్రీనివాస్ కు కాంగ్రెస్ టికెట్ కన్ఫర్మ్ కాగా ఆయన బీజేపీ వైపు చేరిపోయాడు. ఆ పార్టీ తరపున పోటీ చేయనున్నాడు. మరి ఇంత దుర్భర పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరపున ఒకరిద్దరు నేతలు గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.అలా గెలవగల సత్తా ఉన్న వాళ్లలో కన్నా లక్ష్మినారాయణ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితే మరీ దుర్భరంగా ఉంది. ఈ మాజీ ముఖ్యమంత్రి పార్టీ తరపున ఏ ఒక్క అభ్యర్థి కూడా కచ్చితంగా గెలిచే అవకాశం కనపడటం లేదు. ఆఖరికి కిరణ్ కుమార్ రెడ్డి అయినా కచ్చితంగా గెలుస్తాడా? అంటే కచ్చితంగా గెలుస్తాడని చెప్పే పరిస్థితిలేదు. అసలు ఇప్పటి వరకూ ఆయన ఎక్కడ పోటీ చేస్తాడో కూడా అర్థం కాని పరిస్థితి. ఆయన ఎక్కడో ఒక చోట పోటీ చేసి జాగ్రత్తగా ప్రచారం చేసుకొంటే ఎలాగోలా గెట్టక్కగలడు. అయితే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తన అభ్యర్థులను గెలిపించుకోవాలని తిరిగితే మాత్రం పోటీ చేయబోయే నియోజకవర్గంలో కూడా దెబ్బతినడం ఖాయం అవుతందని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: