తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి భగ్గుమంటోంది. పొత్తుల ఎత్తులు పార్టీలోకి నేతల చేరికలు ఆ పార్టీలో చిచ్చు పెట్టాయి. అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో సీమాంధ్రలోని ప్రతి జిల్లాలోనూ టీడీపీ నేతల గొడవలు పతాక స్థాయికి చేరాయి. ఒకవైపు 15 అసెంబ్లీ స్థానాలను బీజేపీకి కేటాయించడం మరోవైపు కాంగ్రెస్ నుంచి వచ్చి చేరుతున్న నేతలకు చంద్రబాబు పెద్ద పీట వేయండం తెలుగుదేశం పార్టీలో గొడవకు కారణాలు అవుతున్నాయి. తెలుగుదేశంలో అసంతృఫ్త వాదానికి, అసమ్మతి సెగకు ఏ జిల్లా కూడా మినహాయింపు కాకుండా పోయింది. శ్రీకాకుళం జిల్లాలో బీజేపీకి కేటాయిస్తున్న నియోజకవర్గం విషయంలో పార్టీ దివంగత నేత ఎర్రన్నాయుడి తనయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఈ విషయంలో ఆయన పదే పదే చంద్రబాబును కలుస్తూ బీజేపీకి ఆ సీటును ఇవ్వొద్దని స్పష్టం చేస్తున్నాడు. ఇక విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతకు ఎస్.కోట సీటు ఇవ్వడంపై తీవ్రమైన గొడవే జరుగుతుంది.ఈ విషయంలో అసంతృప్తితో ఉన్న తెలుగుదేశం నేతలు హింసాత్మక చర్యలకు కూడా దిగినట్టు కనిపిస్తోంది. ఇక విశాఖ పట్నంలో అయ్యన్నపాత్రుడు - అవంతి శ్రీనివాస్ ల మధ్య గొడవ జరుగుతోంది. అలాగే గంటా విషయంలో కూడా అయ్యన్నపాత్రుడు అసంతృప్తితో ఉన్నాడు. కృష్ణా జిల్లాలో విజయవాడ ఎంపీ సీటు విషయంలో పవన్ కల్యాణ్ ఇన్ వాల్వ్ మెంట్ కూడా తెలుగుదేశంలో అసంతృప్తికి కారణం అవుతోంది. కేశినేని వర్గాన్ని ఓడిస్తామని పీవీపీ వర్గం అంటుంటే.. పీవీపీకి టికెట్ ఇస్తే వైకాపా అభ్యర్థిని గెలిపిస్తామని కేశినేని వర్గం స్పష్టం చేస్తోంది. ఈ గొడవ ఏ తీరాలకు చేరుతుందో అర్థం కావడం లేదు. అంతో ఇంతో ప్రశాంతంగా ఉన్నది రాయలసీమ మాత్రమే. ఇక్కడ ఎక్కువ స్థాయిలో కాంగ్రెస్ నేతలకు టికెట్ లు దక్కాయి. అయినప్పటికీ తెలుగుదేశం నేతలు కిక్కరుమనడం లేదు. మొత్తం రాజ్యం అంతా కాంగ్రెస్ వాళ్లదే అయిన విషయాన్ని కార్యకర్తలు అయితే గమనిస్తున్నారు. తెలుగుదేశం అభిమానులు కూడా ఈ విషయంలో చాలా అసంతృఫ్తితో ఉన్నారు. అయితే వాళ్లందరూ చాలా గుంభనంగా కనిపిస్తున్నారు. మరి ఆ మౌనం దేనికి సూచికో...!

మరింత సమాచారం తెలుసుకోండి: