కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని కడప జిల్లా రాజంపేట లోక్ సభ అభ్యర్ధిగా బీజేపీ ఖరారు చేసింది. కాంగ్రెస్ కు రాజీనామా చేసి బిజెపిలో చేరాక పురందేశ్వరినికి సీటు విషయం అంత ఈజీగా ఓ కొలిక్కి రాలేదు. అయితే విశాఖపట్నం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపిగా పనిచేసిన ఆమె బీజేపీ తనకు అదే స్థానాన్ని కేటాయిస్తుందని ఆశపడ్డారు. కాని బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆ స్థానాన్ని ఆ పార్టీ చీఫ్ కె.హరిబాబుకు కట్టబెట్టింది. బీజేపీ తీసుకున్న ఈ కీలక నిర్ణయం వెనుక తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబునాయుడి హస్తం ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఒకరు ఎన్టీఆర్ కూతురు అయితే మరొకరు అతని అల్లుడు, అయినప్పటికీ వీరిద్దరి మధ్య ఉన్న విరోధమే పార్టీ నిర్ణయానికి కారణమై ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ- టీడీపీల పొత్తును అవకాశంగా చేసుకుని చంద్రబాబే కేంద్రంలో మంతనాలు చేసుంటాడని పలువురు అభిప్రాయపడ్డారు. తాజాగా కేటాయించిన రాజంపేట లోక్ సభ స్థానానికి బదులు విశాఖ స్థానం దక్కుతుందని ప్రగాఢమైన విశ్వాసం పెట్టుకున్న చిన్నమ్మ పార్టీ నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురైంది. మరి ఈ విషయంలో చిన్నమ్మ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: