నందమూరి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు మళ్ళీ తెరపైకి వస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయన్న వార్తలకు తాజా పరిణామాలు మరోసారి బలం చేకూర్చాయి. టీడీపీ ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనకపోవడంపై సినీనటుడు, హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ బుధవారం పరోక్షంగా విమర్శించారు. ‘‘పార్టీ కోసం ప్రచారం చేయాలంటూ టీడీపీ నాయకత్వం ఎవరినీ బొట్టు పెట్టి పిలవదు. పార్టీతో అనుబంధం ఉన్న వారు ఎవరైనా తమంతట తాము ముందుకు వచ్చి పార్టీకోసం ప్రచారం చేయాలి’’ అంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించారు. హిందూపురంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బాలయ్య మాట్లాడారు. ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం కృషి చేయాల్సిన బాధ్యత నందమూరి కుటుంబ సభ్యులందరిపైన ఉందని కూడా ఆయన అన్నారు. కాగా, చంద్రబాబు కుమారుడు, బాలకృష్ణ అల్లుడు నారా లోకేశ్ జూనియర్ ఎన్టీఆర్‌పై వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే బాలయ్య నోటి నుంచి కూడా అదే రకమైన విమర్శలు రావడంతో హాట్ టాపిక్ గా మారుతోంది. మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్‌పై బాలకృష్ణ విమర్శలు గుప్పించిన కొద్ది నిమిషాలకే, జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ మీడియా ముందు తన అసంతృప్తి వ్యక్తపరిచారు. రానున్న ఎన్నికల్లో తనకు అసెంబ్లీ టిక్కెట్ కేటాయించకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అసలు పార్టీ టిక్కెట్‌నే ఎన్నడూ కోరలేదని తనపైన దుష్ప్రచారం జరుగుతోందన్నారు. అయితే ఇందులో నిజంలేదని.. కృష్ణా జిల్లా నుంచి టిక్కెట్ కేటాయించవలసిందిగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును తాను గతంలోనే కోరానని హరికృష్ణ వివరించారు. కృష్ణా జిల్లా లోని పెనమలూరు అసెంబ్లీ స్థానం కాని అనంతపురం జిల్లాలోని హిందూపురం లోక్ సభ స్థానం కాని కేటాయించాలని తాను గతంలోనే కోరినట్లు ఆయన చెప్పారు. మొత్తానికి హరికృష్ణను ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ ను పట్టించుకోకపోవడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ తాత్కాలికంగా ఓ అడుగు వెనక్కి వేసినట్లు మాత్రమే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో కాలు పెట్టాలనే ఉద్దేశం కూడా ఆయనకు ఉన్నట్లు లేదు. తన రాజకీయ ప్రవేశానికి సంబంధించి ఆయనకు భారీ ప్రణాళిక ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: