టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోవడంతో పాత ఆటలు మరచిపోయి ఉంటారని ప్రత్యర్ధులు ఊహించారు. అధికారానికి దూరమవడంతో పార్టీనేతలపై చంద్రబాబుకి పట్టు తగ్గి ఉండచ్చేమో కానీ టార్గెట్ చేసిన వారి అకౌంట్ క్లోజ్ చేసే పాత నైజం మాత్రం ఆయనలో ఏ మాత్రం మారలేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేతిలో బుక్ అయిపోయి, బతుకు బస్టాండ్ అయినవాళ్ల లిస్ట్ చాంతాడంత ఉంటుంది. చంద్రబాబు బాధితుల్లో పార్టీ నేతలే కాదు ఏకంగా టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని స్ధాపించిన అన్నగారికి కూడా తేడా వస్తే చంద్రబాబు ఎలా ఝలక్ ఇచ్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఎన్టీఆర్ తో పాటూ ఆయన సతీమణి లక్ష్మీపార్వతి, వీరిద్దరికీ మద్దతిచ్చిన చాలా మంది నేతల అడ్రస్ గల్లంతయ్యే విధంగా చంద్రబాబు తన ప్రతాపం చూపించారు. చంద్రబాబు బాధితుల జాబితాలో ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ చేరినా మారిన సమీకరణాల వల్ల ఆయన మళ్లీ బావ పంచన చేరారు. సీఎంగా ఉన్నంత కాలం మోనార్క్ గా వ్యవహరించిన చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత మారిన మనిషిగా నిరూపించుకునేందుకు చంద్రబాబు అపరిచితుడి క్యారెక్టర్ ని కొంతకాలం తెరవెనుకకు నెట్టేశారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమనే ధీమా పెరగడంతో బాబులో నిద్రపోతున్న అపరిచితుడి క్యారెక్టర్ ని తట్టిలేపి మళ్లీ దానికి పని చెబుతున్నారు. తనకు ఎవరితోనైనా ముప్పు ఉందని గుర్తించినా, ఎవరైనా తనను బాగా విసిగించినా వారిని వెంటపడి వేటాడేందుకు చంద్రబాబు ఏ మాత్రం వెనకాడరు. గతంలో తనతో విభేదించిన హరికృష్ణను చేరదీసి రాజ్యసభ సీటు కట్టబెడితే చివరకు ఆయన చంద్రబాబుకు కంట్లో నలుసులా మారారు. జూనియర్ ఎన్టీఆర్ పాపులారిటీని అతిగా ఊహించుకుని హరికృష్ణ బాబును తెగ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. తన సహనాన్ని ఎంతో కాలంగా పరీక్షిస్తున్న హరికృష్ణ దూకుడుకి ఎలా కళ్లెం వేయాలో చంద్రబాబు ఆలోచిస్తున్న సమయంలో సీతయ్య సెల్ఫ్ గోల్ వేసుకుని అడ్డంగా బుక్ అయిపోయారు. సమైక్యవాద నినాదాన్ని అడ్డంపెట్టుకుని సీమాంధ్రలో హీరో అవ్వాలనే ఉద్దేశంతో హరికృష్ణ రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీనిద్వారా తెలంగాణ విషయంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్న టీడీపీ హైకమాండ్ ని ఇరకాటంలో పడేయాలన్నది హరికృష్ణ వ్యూహం. ఇలాంటి చిల్లర గేమ్ లను ఎలిమెంట్రీ స్కూల్లో ఆడేసిన బాబు.. అదును చూసి హరికృష్ణను కోలుకోలేని దెబ్బతీశారు. అప్పటికే బహిరంగ లేఖల ద్వారా తనను ఇబ్బంది పెడ్తున్న హరికృష్ణను చక్రబంధంలో ఇరికించాలని బాబు డిసైడ్ అయ్యారు. హరికృష్ణ ఇచ్చిన రాజీనామాను వెంటనే ఆమోదించే విధంగా చంద్రబాబు పావులు కదపడంతో రాజ్యసభ ఛైర్మన్ ఆయన రాజీనామాను నిమిషాల్లో ఆమోదించేశారు. ఈ అనూహ్య పరిణామంతో హరికృష్ణ ఖంగుతిన్నారు. ఇక చేసేది లేక హరికృష్ణ చేతులెత్తేసి మళ్లీ చంద్రబాబు పంచన చేరారు. తాను రాజీనామా చేసిన రాజ్యసభ సీటు మళ్లీ తనకే దక్కుతుందని హరికృష్ణ భావించారు కానీ చంద్రబాబు ఈసారి కొంత కఠిన నిర్ణయం తీసుకున్నారు. హరికృష్ణ సీటును గరికపాటి మోహనరావుకు కేటాయించి బావమరిదికి బాబు షాక్ ఇచ్చారు. రాజ్యసభ సీటు ఎలాగూ చేజారిపోయింది కనీసం టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురం టిక్కెట్ అయనా దక్కుతుందేమోనని హరికృష్ణ ఆశించారు.ఈసారి బాబు వేసిన ఎత్తుతో హరికృష్ణ మైండ్ బ్లాక్ అయిపోయింది. హిందూపురం టిక్కెట్ విషయంలో హరికృష్ణతో పాటూ బాలకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. తనకే ఆ సీటును కేటాయించాలని హరికృష్ణ మొండికేశారు. అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టి చంద్రబాబు తమాషా చూశారు. చివరకు వివాదం తార స్ధాయికి చేరిన తర్వాత పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకు హిందూపురం టిక్కెట్ ని బాలకృష్ణకు కేటాయిస్తున్నట్లు బాబు ప్రకటించేశారు. తమ్ముడి నుంచి ప్రమాదం పొంచి ఉందని ముందే ఊహించినా ఇక చేసేది లేక హరికృష్ణ హ్యాండ్స్ అప్ అనేశారు. ఎలాగూ హిందూపురం టిక్కెట్ ఇవ్వలేదు కనీసం కృష్టా జిల్లాలో ఏదో గెలిచే సీటైనే ఇవ్వమని హరికృష్ణ పైరవీ చేసుకుంటున్నారని సమాచారం. మొత్తం మీద మీసాలు తిప్పి, వీరావేశంతో డైలాగ్ లు చెప్పిన సీతయ్య సీన్ హిందూపురం టిక్కెట్ రాకపోవడంతో సితారయ్యిందని తెలుగుతమ్ముళ్లు సెటైర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: