సోనియమ్మను ప్రసన్నం చేసుకోవడంలో తెలంగాణా కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారా? ఆమె పర్యటనను ఓట్లు రాల్చే ప్రచారంగా మార్చుకోలేకపోయారా? అవుననే అనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితి. విభజన తర్వాత తొలిసారి తెలుగుగడ్డపై కాలు మోపిన ఆమె, అనుకున్నంతగా తెలంగాణా వారిని ఆకట్టుకోలేకపోయారు. ఢిల్లీ నుంచి ఇక్కడికొచ్చినంత టైమ్కూడా సోనియా కరీంనగర్లో ఉండలేదు. కేవలం పావుగంటలో ప్రసంగం ముగించి వెళ్లిపోయారు. ఆమెకెందుకంత నిర్లిప్తత. చూడబోతే.. టీకాంగ్నేతలు బలవంతంగా ఆమెను కరీంనగర్సభకు తీసుకొచ్చినట్లుగా కనిపించింది. కానీ, సోనియా మాట్లాడిన కొద్ది సమయంలో.. మాటలు, హావభావాలు ఒకటే కసిని ప్రస్ఫుటం చేశాయి. అదే తెలంగాణ క్రెడిట్ను కేసీఆర్కు దక్కకూడదన్న చేసి ఆయన్ను జనానికి దూరం చేయడం. విభజనకు చంద్రశేఖరరావు చేసిందేమీ లేదని, కర్త, కర్మ, క్రియ అంతా తానై నడిపించానని, దాన్ని ప్రజలు గుర్తించి తీరాలని చెప్పుకొచ్చారు. కానీ ఆమెలో గతంలో ఉన్న గర్వం, ఆనందం ఇప్పుడు ఏకోశానా కనిపించలేదు. ఇందుకు లోకల్లీడర్లపై అసంతృప్తి కావచ్చు. టీకాంగ్ నేతలపై అమ్మ కోపంగా ఉన్నారా అంటే, అది కోపం కాకపోయినా, ఒకరమైన నిరాశ. గత రెండు పర్యాయాలుగా రాష్ట్రంలో దేదీప్యమానంగా వెలిగిపోతున్న కాంగ్రెస్ను.. ఒక ప్రాంతంలో పణంగా పెట్టి మరీ ఆమె తెలంగాణాను ప్రకటించారు. అది కూడా 25సీట్లున్న సీమాంధ్రను వదులుకోవడం అంటే మామూలు మాట కాదు. విభజన ముందు వరకూ తామేదో కింగ్మేకర్లమని చెప్పి ఆమె చుట్టూ తిరిగిన టీ కాంగీయులు... ఇప్పుడు ప్రజల చుట్టూ తిరిగలేకపోతున్నారన్న బాధ సోనియమ్మకు ఉండి ఉండొచ్చు. తెలంగాణాను విడగొట్టేదాకా... నాలుగున్న కోట్ల మంది సారథులుగా చెప్పుకుంటూ పట్టుబట్టిన జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ.. వంటి నేతలు ఇప్పుడు ప్రజలను ఎందుకు తమవైపుకు తిప్పుకోలేకపోతున్నారన్న ఆలోచనా కావచ్చు. మొత్తానికి మేడమ్కి మాత్రం టీకాంగీయులపై ఏమంత ప్రేమ లేదన్నది కరీంనగర్వేదికపైనే తేలిపోయింది. కానీ ఎలాగూ వచ్చారు కాబట్టి పది నిమిషాల్లో.. పని ముగించారు. వాస్తవానికి... తెలంగాణా కాంగ్రెస్నేతలు కూడా సోనియమ్మ వస్తున్నారన్న దర్పాన్ని ఎక్కడా ప్రదర్శించలేదు. ఆమె వచ్చి వెళ్లిన తర్వాత కాంగ్రెస్కు తిరుగుండదు అని భావించిన తెలంగాణా నేతలు.. అంత లాభం చేకూర్చే రీతిలో తమ ప్రయత్నాలు చేయలేకపోయారు. ప్రణాళికాలోపంతో... తమ చేతగానితనాన్ని స్పష్టంగా చాటుకున్నారు. సభకు సరైన ప్రచారంగానీ, లక్షల్లో జనసమీకరణ గానీ చేయలేకపోయారు. విభజన తర్వాత తెలంగాణా గడ్డపై అడుగుపెడుతున్న ఆమెను తాము చెప్పే వరాల దేవతగా చూపకుండా మమ అనిపించేశారు. కనీసం కేసీఆర్ నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో పదో వంతైనా ఉండి ఉంటే... ప్రజలు కాంగ్రెస్పై ఎక్కువ దృష్టిసారించే అవకాశం ఉండేది. రాజశేఖరరెడ్డి బతికున్న కాలంలో.. ఆమెను చాలా గొప్పగా చూపేవారాయన. దేవతగా చూపకపోయినా, అందరికీ అమ్మగా పరిచయం చేశారు. ఎలా తరలివచ్చేవారోగానీ సోనియా వచ్చిన ప్రతీసారి జనం ఇబ్బడిముబ్బడిగా తరలివచ్చేవారు. ఆమెలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చేవారు. ఆయన చనిపోయిన తర్వాత.. ఆ కుటుంబానికి సానుభూతి చూపి వెళ్లి పోయిన సోనియా... మళ్లీ విభజన తర్వాతే ఇక్కడ అడుగుపెట్టారు. సోనియా రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా, వైఎస్సార్ మాత్రం ఆమె దర్పాన్ని ఘనంగా చాటేవారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్రాన్నే ఇచ్చినా, నాయకులు పదుల సంఖ్యలో ఉన్నా... ఆ సీన్ కనిపించలేదు. ఏమాటకామాట... టీకాంగ్రెస్నేతలు సోనియా పర్యటనను మాత్రం క్యాష్ చేసుకోలేకపోయారు. సోనియాకు కూడా వైఎస్సార్లేనిలోటు చాలా స్పష్టంగా కనిపించే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: