విశాఖపట్నంలో విజయలక్ష్మి నామినేషన్ ఎందుకు వేశారు? రాజంపేటను పురందేశ్వరికి ఎందుకు కేటాయించారు? దీనికి వెనక రాజకీయం ఏమైనా ఉందా? ఈ ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానం ఉంది. రాజకీయాల్లో ఎత్తులు పైయెత్తులకు ఈ రెండు సీట్లు నిదర్శనాలు. సాధారణంగా ఉత్తరాంధ్ర టీడీపీ కంచుకోట. ఇప్పుడు కూడా అక్కడ టీడీపీకి అనుకూలంగా గాలి వీస్తోందని కథనాలు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో యువకుడైన రామ్మోహన నాయుడు లోక్ సభకు పోటీ చేస్తున్నాడు. ఎర్రన్నాయుడు కొడుకుగా ఆయన మీద సానుభూతి ఉంది. విశాఖలో గంటా శ్రీనివాసరావు వంటి ఆర్థికంగా బలవంతులు బరిలో ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మూడు జిల్లాల్లో టీడీపీకి అత్యధిక శాతం సీట్లు వస్తాయని అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో టీడీపీకి చెక్ చెప్పడానికి జగన్ పావులు కదిపాడు. తొలుత, విశాఖలో షర్మిలను పోటీ చేయించి, కోస్తా జిల్లాలోని అనపర్తిలో తాను స్వయంగా బరిలోకి దిగాలని భావించారు. కానీ, చివరికి వచ్చేసరికి ఈ ప్లాన్ మారిపోయింది. ఉత్తరాంధ్రలో అత్యధిక జనాభాగా ఉన్న కాళింగులు, పోలినాటి వెలమలు తదితర బీసీ వర్గాలకు ఎక్కువ సీట్లు ఇచ్చి వారిలో విభజన తీసుకు రావాలని భావించారు. అందుకే, ఆ మూడు జిల్లాల్లో 80 శాతం సీట్లను ఉత్తరాంధ్రలోని ప్రాబల్య వర్గాలకే కట్టబెట్టారు. అనకాపల్లి, శ్రీకాకుళం వంటి కొన్ని లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో అయితే రిజర్వుడు నియోజక వర్గాలు మినహా ఇతరులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అక్కడ అగ్రవర్ణాలకు కూడా చోటు కల్పించలేదు. ఒక క్షత్రియ, ఒక వైశ్య మినహా మిగిలిన సీట్లన్నీ ఉత్తరాంధ్రలోని బీసీ వర్గాలకే కేటాయించారు. దీనితోనే అక్కడి ప్రజలు తమ వైపు మొగ్గు చూపరని కూడా భావించారు. విశాఖ నుంచి షర్మిల లేదా విజయలక్ష్మి పోటీ చేస్తే ఆ మూడు జిల్లాల్లోనూ ప్రభావం ఉంటుందని భావించారు. అయితే, పోటీకి షర్మిల ససేమిరా అనడంతో విజయలక్ష్మిని బరిలోకి దింపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీని దెబ్బకొట్టి ఆ పార్టీ ఓట్లను చీల్చడమే ధ్యేయంగా విజయలక్ష్మిని పోటీకి పెట్టారు. అక్కడి అభ్యర్థుల ఎంపిక కూడా అలాగే జరిగింది. మరి, వైసీపీ ఎత్తుకు టీడీపీ కూడా పైయెత్తు వేస్తుంది కదా. అలాగే వేసింది అది రాయలసీమలో. రాయలసీమలో ప్రాబల్య వర్గం రెడ్లు. అక్కడ అత్యధిక సీట్లు వైసీపీకే వస్తాయని అంచనాలు వెలువడుతున్నాయి. ఉత్తరాంధ్రలో తమకు దెబ్బకొట్టాలని భావించిన వైసీపీకి రాయలసీమలోనే చెక్ పెట్టాలని టీడీపీ భావించింది. అందుకే, హిందూ పురం నుంచి బాలకృష్ణను రంగంలోకి దింపింది. అనంతపురం అసలే టీడీపీ కంచుకోట. బాలకృష్ణ బరిలో నుంచుంటే ఆ చుట్టుపక్కల కూడా దాని ప్రభావం ఉంటుంది. బాలకృష్ణను రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేయించడం ద్వారా లబ్ధి పొందాలని టీడీపీ భావించింది. బాలకృష్ణ ఒక్కడే అయితే పూర్తి లాభం రాదనుకుందో ఏమో. పురందేశ్వరిని రాజంపేట నుంచి బరిలోకి దింపేలా బీజేపీతో పావులు కదిపింది. పురందేశ్వరిని రాజంపేట నుంచి బరిలోకి దింపడం ద్వారా చంద్రబాబుకు చాలా ప్రయోజనాలు నెరవేరతాయి. ఒకటి.. హిందూపురంలో బాలకృష్ణ, రాజంపేట ఎంపీకి పురందేశ్వరి బరిలోకి దిగితే వారిద్దరి ప్రభావం రాయలసీమ జిల్లాల్లో బలంగా ఉంటుంది. దాంతో, టీడీపీ, బీజేపీ పొ్త్తు ఫలించి రాయలసీమలో టీడీపీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజంపేటలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లోనే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పురందేశ్వరి, బీజేపీ ప్రభావం ఉంటుంది. ఎన్టీఆర్ కుమార్తెగా పురందేశ్వరి వ్యక్తిగత ప్రాబల్యం, బీజేపీ ప్రభావం, మోదీ హవా కలిస్తే టీడీపీకి భారీగా మేలు జరుగుతుంది. తద్వారా వైసీపీకి చెక్ చెప్పడానికీ అవకాశం ఉంటుంది. ఇది జరిగితే తనకు లబ్ధి చేకూరుతుంది. లేకపోతే, పురందేశ్వరి కోరుకున్న విశాఖ, విజయవాడ, నర్సరావుపేట స్థానాలకు సంబంధించి ఇప్పటికే ఆమెకు ఎసరు పెట్టిన చంద్రబాబు.. తాజాగా రాజంపేటకు పంపించేలా పావులు కదిపారు. అక్కడ ఆమె గెలిస్తే తనకు లాభం. ఓడిపోతే తనకు లాభం. ఆమెకు నష్టం. అందుకే ఉత్తరాంధ్రలో తనకు చెక్ పెట్టిన వైసీపీకి చంద్రబాబు రాయలసీమలో చెక్ పెట్టారు. అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి, బాలకృష్ణ, రాజంపేటలో పురందేశ్వరి ప్రభావంతో మెజార్టీ సీట్లు సాధించాలనేది చంద్రబాబు వ్యూహం. రెండు పార్టీలూ పోటా పోటీ వ్యూహం పన్నాయి. కానీ, వీటిలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: