రాజకీయాలన్నాక ఎత్తుల పై ఎత్తులు కామన్. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా, తేదేపా పలు ప్రాంతాల్లో పట్టు, ఊపు సాధించడం కోసం కొత్త ఎత్తులు వేస్తున్నాయి. ఎలాగైనా అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా అవి ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నాయి. పైగా ఆ రెండు పార్టీలు దాదాపు ఒకే రకమైన వ్యూహాన్ని విజయం కోసం రచించడం విశేషం.. ఈ సారి సీమాంద్రలో వైకాపాకు, టిడిపికి విజయం సాధించడం అన్నది తప్పనిసరి. ఎవరికి అధికారం రాకుంటే వారు రాజకీయంగా దాదాపు ఉనికి కోల్పోయినట్టే. అందుకే తమ సర్వశక్తియుక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరి పరిస్థితి భిన్నంగా ఉంది. జగన్ కు రాయలసీమలో పట్టుంది. సీమలో చంద్రబాబు కంటే జగన్ కే కాస్తా పట్టు ఎక్కువ ఉంది. దీంతో సీమలో పట్టు పెంచుకోవడం తెలుగుదేశం తక్షణావసరం. దీని కోసమే వ్యూహాత్మకంగా బాలకృష్ణకు అనంతపురం జిల్లా హిందుపురం నుంచి బరిలోకి దింపారు. మరో వైపు పురంధరీశ్వరిని రాజంపేట నుంచి బిజేపి ద్వారా రంగంలోకి దించారు. ఏమిటీ ఎత్తుగడ అంటే మరేమీ లేదు. ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్లు తమ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారంటే, ఆ ప్రాంత పార్టీలో కాస్త కొత్త ఊపు వస్తుంది. ఆ ఊపు ప్రభావం జనాలపై కూడా కాస్తో, కూస్తో వుంటుంది. చిత్రంగా జగన్ కూడా సేమ్ ఇదే పాలసీ పాటిస్తున్నారు. జగన్ పార్టీకి కోస్తాంధ్ర,లో పట్టు పెంచుకోవడం అవసరం. దీనికోసం ఏకంగా తల్లి విజయమ్మను విశాఖ నుంచి బరిలోకి దించారు. విజయమ్మకు వైఎస్ భార్యగా, మహిళగా కాస్తా పట్టు దొరుకుతుంది. నిజానికి ఇక్కడి నుంచి షర్మిలను బరిలోకి దింపాలని భావించారు. కానీ ఎందుకో వ్యూహం మార్చారు. అసలు జగన్ కూడా తూ.గొ. జిల్లా నుంచి రంగంలోకి వస్తాడని అనుకున్నారు. కానీ అదీ కుదరలేదు. మొత్తానికి అదంతా విజయమ్మ వంతయింది. ఏకంగా వైకాపా పార్టీ అధ్యక్షురాలు ఇక్కడి నుంచి పోటీ చేస్తుంటే, సహజంగానే పార్టీ శ్రేణుల్లో కాస్త హుషారు వస్తుంది. ఇలా జగన్, చంద్రబాబులు ఇద్దరు కూడా సీమాంద్రలో విజయం కోసం పక్కా వ్యూహంతోనే అడుగులు వేస్తున్నారు. గతంలో షర్మిల కూడా వైకాపాకు పట్టులేని కోస్తాంధ్ర ప్రాంతంపైనే ప్రధాన దృష్టి పెట్టారు. పాదయాత్రలో అక్కడే ఆమె ఎక్కువ సమయం కేటాయించింది. చంద్రబాబు కూడా తన ప్రజాగర్జన సభల విషయంలో సీమ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇలా పట్టులేని చోట పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం అంది వచ్చిన ఏ అవకాశాన్ని వారు వదులు కోవడం లేదు. సీమ నాయకులనే టిడిపిలోకి చేర్చుకోవడంలో చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. జేసి బ్రదర్స్ రాకను పరిటాల సునీత వ్యతిరేకించినా కూడా తీసుకోవడానికి కారణం జగన్ ను ఎదుర్కునే సత్తా జేసి బ్రదర్స్ కు ఉండడమే. గెలిచినా, గెలవకున్నా కూడా అక్కడ వైకాపా అభ్యర్థుల విజయానికి బీటలు మాత్రం వేయగలరు. జగన్ కూడా దాడి వీరభద్రరావు వంటి వారిని కూడా తమ వారైన కొణతాల వంటి వారి మాట కాదని మరీ చేర్చుకున్నారు. ఇలా జగన్ కోస్తాంద్రలో వ్యూహాన్ని అమలు చేస్తే, చంద్రబాబు రాయలసీమలో అమలు చేసారు. ఓ వైపు పట్టుపెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే సీమలో జగన్ బలం తగ్గించేందుకు బాబు, ఆంద్రలో బాబు బలం తగ్గించేందుకు జగన్ అన్ని రకాల వ్యూహాలను అమలు చేసుకుంటూ పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: