ఒకప్పుడు రాజకీయ నాయకులు అంటే నీతి నిబద్దతో, క్రమశిక్షణతో ఎప్పటికి ఒకే పార్టీలో ఉంటూ, ప్రజలకు సేవ చేసేవారు. కాని ఇప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రాత్రికి రాత్రే గోడ దూకేస్తూ పార్టీలు మార్చేస్తున్నారు. ప్రస్తుత నాయకుల్లో నీతి అనేది మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఇక అధికారమే పరమావదిగా రాజకీయాల్లోకి వచ్చిన వారు ఏ పార్టీ పదవి ఇస్తానంటే ఆ పార్టీలోకి వెళ్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈ జంపింగ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఒక పార్టీలో సీటు దొరకుంటే మరో పార్టీలోకి. ఆ పార్టీలో కూడా సీటు దక్కకుంటే ఇంకో పార్టీలోకి. ఇలా కొన్ని రోజుల వ్యవదిలోనే పార్టీలు మారుతూ తమకు పదవే ముఖ్యం అని చెప్పకనే చెబుతుంటారు. ఇలా పార్టీలు మారిన వారిన వారి గురించి ప్రజలు పట్టించుకోకుండా వారికి ఓట్లు వేయడమే ఇలా జంపింగ్‌లకు కారణం అవుతోంది. ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి వెళ్లిన వారికి వెంటనే సీట్లు దక్కుతాయి. సదరు పార్టీలోకి వెళ్లక ముందే సీటును ఖరారు చేసుకుంటారు. తాజాగా రఘురామ కృష్ణం రాజు కొన్ని రోజుల వ్యవధిలోనే మూడు పార్టీలు మారి ప్రస్తుత నాయకుల తీరును కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఈయన మొదట వైకాపాలో ఉన్నాడు. ఆ సమయంలో జగన్‌ కటాక్షం పొందేందుకు సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ కాల్‌లీస్ట్‌ను సంపాదించాడు. అప్పట్లో ఈయన పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే ఏం జరిగిందో ఏమో కాని వైకాపా నుండి ఈయన బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఇటీవలే బీజేపీలో చేరాడు. ఈయన అడిగిన నరసాపురం స్థానంను బీజేపీ ఇవ్వలేదు. దాంతో వెంటనే ఈయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో భేటీ అయి, పార్టీ కండువ కప్పుకుని ఆ వెంటనే నరసాపురం లోక్‌ సభ స్థానంకు నామినేషన్‌ కూడా వేశాడు. ఈయన స్పీడును చూసి మరి కొంత మంది నాయకులు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. దీన్నే అంటారు అవకాశవాద రాజకీయం అని. ఇది పోయే వరకు నాయకులు ప్రజలకు సేవ చేస్తారు అని ఎదురు చూడటం వృదా ప్రయాసే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: