తనది కాకపోతే కాశీ వరకు దేకమన్నాడని సామెత. సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ తీరు కూడా ఇదే. ఆ పార్టీకి సీమాంధ్రలో సీన్ లేదు. ప్రజలు ఆదరించడం లేదు. అసలు ప్రచారానికి వెళ్లినా జనాలు వచ్చే పరిస్థితి లేదు. ఎదురుగా ఖాళీ కుర్చీలు దర్శనం ఇస్తున్నాయి. దాంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అందుకే తమిళనాడులోని జయలలిత, కరుణానాధి బాటలో పయనించాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం విడుదల చేసిన మేనిఫెస్టోలో హామీల వర్షం కురిపించారు. గత ఐదేళ్లుగా విద్యుత్తు చార్జీలు పెంచి.. సర్ చార్జీలు వేసి ప్రజలకు నరకం చూపిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాత్రం.. వచ్చే ఐదేళ్లలోనూ కరెంటు చార్జీలు పెంచబోమని ఘనంగా హామీ ఇచ్చేసింది. వంద యూనిట్లలోపు వాడుకునే వాళ్లకు ఉచిత విద్యుత్తు కూడా ప్రకటించింది. జయలలిత, కరుణానిధి తరహాలో సంక్షేమ హామీలు గుప్పిస్తే తప్ప తమకు నాలుగు ఓట్లు రావని గుర్తించి.. డిష్ కనెక్షన్ తో కలర్ టీవీలు, విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, ఆడపిల్ల పుట్టగానే వంద గజాల స్థలం అంటూ హామీలు గుప్పించింది. స్వయం సహాయక సంఘాలకు రుణాల మాఫీని ప్రకటించింది. ఉద్యోగులకు వయో పరిమితిని 60 ఏళ్లకు పెంచుతామని హామీ ఇచ్చింది. ఆ మేనిఫెస్టోని చూస్తే.. ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆనం రామనారాయణ రెడ్డి గుర్తుకు రాలేదు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పెద్దలకు సలహాదారుడైన కొప్పుల రాజే కనిపించాడు. కాంగ్రెస్ ను ఇప్పటికే సర్వ నాశనం చేసేసిన కొప్పుల రాజు మిగిలిన పని కూడా పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నట్లున్నాడేమో. సీమాంధ్రలో కాంగ్రెస్ అధికారంలోకి కాదు కదా.. కనీసం దాని అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఆ పార్టీ నేతలకు కూడా తెలుసు. అయినా ముందే కాడి పారేయడం రాజకీయ నాయకుల లక్షణం కాదు కదా. చివరి వరకు మన ప్రయత్నం మనం చేయాలని ఏదో వాళ్ల పాట్లు వాళ్లు పడుతున్నారు. ప్రజలకు పార్టీ మీద విశ్వాసం పోయిన తర్వాత సంక్షేమ బాట పట్టారు. ఐదేళ్లలోనే ఎంతో దోచుకున్నారని మళ్లీ అధికారం ఇస్తే ఇంకెంత దోచుకుంటారోనని జగన్ ను ఉద్దేసించి చిరంజీవి వ్యాఖ్యానించారు. అసలు చిరంజీవి మాటకు ఒక విలువ అంటూ ఉందా? ఆయనను అసలు పట్టించుకునేవాళ్లు సీమాంధ్రలో ఉన్నారా?

మరింత సమాచారం తెలుసుకోండి: