కోదండరామ్ కు మళ్లీ మూడొచ్చింది. ఎన్నికలు రాగానే తెలంగాణ రాష్ట్ర సమితికి ఎలా మేలు చేయాలా అన్న ఆలోచన వచ్చింది. దాంతోనే తెలంగాణ ప్రజలు విజ్ఞత ప్రదర్శించాలని, టీడీపీ, వైసీపీలకు ఓటు వేయొద్దని పిలుపునిచ్చాడు. జేఏసీ లో అన్ని పార్టీలకూ భాగస్వామ్యం ఉన్నా.. టీఆర్ఎస్ తరఫున కోదండరామ్ వకాల్తా పుచ్చుకోవడం ఇప్పుడే కొత్త కాదు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పిలుపులు ఇవ్వడమూ కొత్త కాదు. వాస్తవానికి ఎన్నికలు దగ్గర పడిన సమయంలో తెలంగాణ జేఏసీని విలేకరులు నిర్దిష్టంగా అడిగారు మీరు ఎవరికి మద్దతు ఇస్తారని. అప్పుడు నోరు విప్పని కోదండరాం కొద్ది రోజుల్లోనే జేఏసీ భేటీ అయి నిర్ణయం తీసుకుంటుందని చెప్పాడు. జేఏసీ ఇంకా భేటీ కాలేదు. నిర్ణయం తీసుకోలేదు. మధ్యలో జేఏసీ తరఫున నిలబడిన అభ్యర్థులకు తప్ప ఎవరికీ మద్దతు ఇచ్చేది లేదని కూడా చెప్పాడు. అయితే, ఇప్పుడు మాత్రం టీడీపీ, వైసీపీలకు ఓటు వేయొద్దని స్పష్టంగా పిలుపునిచ్చారు. వైసీపీకి ఓటు వేయొద్దని చెప్పడంలో అర్థం ఉంది. కానీ, మరి టీడీపీ చేసిన తప్పు ఏమిటో? తెలంగాణకు అనుకూలంగా అందరికంటే ముందే లేఖ ఇవ్వడం తప్పా? టీఆర్ఎస్, తెలంగాణ జేఏసీ ఒత్తిడి చేసినప్పుడల్లా ఒకటి మూడు సార్లు కేంద్రానికి లేఖలు పంపడం తప్పా? తెలంగాణకు అనుకూలమని ప్రకటించడం తప్పా? జేఏసీ తరఫున ఉద్యమాల్లో పాల్గొనడం తప్పా? ఈ ప్రశ్నలే అడిగితే చంద్రబాబు చివర్లో తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నించాడని టీఆర్ఎస్ నేతలు మరీ ముఖ్యంగా కేసీఆర్ వల్లె వేసిన పలుకులనే చిలకలా కోదండరాం కూడా చెబుతాడు. అయితే, కాంగ్రెస్ పార్టీ అడ్డోగోలుగా విభజిస్తుంటే నోరు మూసుకుని కూర్చోవాలా? టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ జేఏసీలకు సీమాంధ్రతో ఎటువంటి పని లేదు. కానీ, రాజకీయ పార్టీలకు అలా కాదు కదా. తెలంగాణ కోసం సీమాంధ్రలో పార్టీని సర్వ నాశనం చేసేసుకోవడమే కోదండరామ్ కు కావాలా? అసలు ఉద్యమం అయిపోయిన తర్వాత ఎంచక్కా ఉద్యోగం చేసుకోక ఆ పార్టీకి ఓటు వేయండి.. ఈ పార్టీకి ఓటు వేయకండి అంటూ కోదండరామ్ పిలుపులు ఇవ్వడమేమిటంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దీనికి తెలంగాణ వాదులు ఏం జవాబు చెబుతారో?

మరింత సమాచారం తెలుసుకోండి: