టీఆర్ఎస్ వసూళ్ల పార్టీ అట. బ్లాక్ మెయిల్ పార్టీ అట. రెచ్చగొట్టే పార్టీ అట. ఎప్పుడూ కొత్త కొత్త వివాదాలు సృష్టిస్తూ ఉంటుందట. ఇవన్నీ ఎవరి మాటలో తెలుసా? రాష్ట్ర విభజన ప్రక్రియలో చొక్కాలు, లాగూలూ చింపుకుని మరీ రాత్రింబగళ్లు పని చేసిన కేంద్ర మంత్రి జైరాం రమేశ్ పలుకులు. ఆయనకు ఇప్పుడే తెల్లారింది. ఇప్పుడు ఆయనకు ప్రాప్తకాలజ్తత వచ్చింది. ఎన్నికలు వచ్చిన తర్వాత.. తమ కాళ్ల కిందకు నీళ్లు వచ్చిన తర్వాత ఆయనకు హీట్ ఎక్కింది. అవే మాటలను సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు చెవినిల్లు కట్టుకుని చెప్పినా ఆయన కానీ ఆయన పార్టీ కానీ తలకు ఎక్కించుకుంటే కదా? టీఆర్ఎస్ గురించి జైరాం కొత్తగా ఇప్పుడు చెప్పేదేం లేదు. ఆయన చెప్పినవన్నీ దాని లక్షణాలే. టీఆర్ఎస్ రాజ్యాంగంలోని పీఠికలో ఉన్న నియమాలే. టీఆర్ఎస్ వసూళ్ల పార్టీ అని.. ఆంధ్రా కంపెనీల నుంచి బలవంతంగా కోట్లకు కోట్లు వసూళ్లు చేసి వాటికి వ్యతిరేకంగానే గళం ఎత్తుతుందని కావూరి సాంబశివరావు వంటి సీమాంధ్ర నాయకులు కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలకు చెప్పారు. టఆర్ఎస్ బ్లాక్ మెయిల్ చేస్తుంటుందని.. తెలంగాణకు మీరు అనుకూలమో ప్రతికూలమో చెప్పాలంటూ రాజకీయ పార్టీలను బ్లాక్ మెయిల్ చేసి తన పబ్బం గడుపుకుంటుందని, టీఆర్ఎస్ ఒక్కటే తెలంగాణలో ఉందని, మిగిలిన పార్టీలు సీమాంధ్రలోనూ ఉన్నాయి కనక వాటికి ఇబ్బంది వస్తందని అధిష్ఠానానికి వివరించారు. టీఆర్ఎస్ రెచ్చగొట్టే పార్టీ అని, తెలంగాణవాదం పేరిట ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలని చూస్తుందని, అందుకే ఉప ఎన్నికల్లో తప్ప సాధారణ ఎన్నికల్లో దానికి ఎప్పుడూ సీట్లు రాలేదని చెవినిల్లు కట్టుకుని చెప్పారు. అయినా జైరాం కానీ ఇతర కాంగ్రెస్ పెద్దలు కానీ వినిపించుకోలేదు. తెలంగాణను ఇచ్చేసినా టీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కాదని.. పొత్తు కూడా పెట్టుకోదని పైగా కాంగ్రెస్ పైనే విమర్శలు గుప్పిస్తుందని సబ్బం హరి, కావూరి వంటి ఎంతోమంది నేతలు ఎన్నోసార్లు చెప్పారు. కానీ, అప్పట్లో వినిపించుకోని కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు బుద్ధి వచ్చిందట. టీఆర్ఎస్ అసలు స్వరూపం తెలిసి నివ్వెరపోతున్నారట. అందుకే, టీఆర్ఎస్ గెలిస్తే బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తుందని, కొత్త కొత్త వివాదాలు సృష్టిస్తుందంటూ జైరాం చేసిన వ్యాఖ్యలను చూసి సీమాంధ్ర నేతలు పిచ్చెక్కినట్లు నవ్వుకుంటున్నారట. జైరాంకే బుద్ధొచ్చిందా? మొత్తం కాంగ్రెస్ పార్టీకే బుద్ధొచ్చిందా? అని ప్రశ్నిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: