టీడీపీ, బీజేపీ చర్చలు సఫలమయ్యాయట. సీమాంధ్రలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందట. ఓ రెండు ఎంపీ స్థానాలు టీడీపీకి ఇచ్చి ఐదు అసెంబ్లీ స్థానాలు టీడీపీ బీజేపీ నుంచి తీసుకునేలా ఒప్పందం కుదిరిందట. ఈ రెండు పార్టీల పొత్తులకు సంబంధించి గత రెండు రోజులుగా కొనసాగిన హైడ్రామా మొత్తం చూస్తే ఒకటే అనిపిస్తోంది. బీజేపీ నుంచి మరో నాలుగు అసెంబ్లీ సీట్లు తీసుకోవడానికి టీడీపీ ఎంతటి దారుణానికి అయినా దిగజారుతుందని. ఎంతటి దారుణ విమర్శలు చేయడానికైనా.. ఎంత అడ్డగోలు ప్రచారానికి అయినా వెనకాడదని. సీమాంధ్రలో టీడీపీ, బీజేపీ పొత్తు మంచిది కాదని ఎంతమంది చెప్పినా చంద్రబాబు అండ్ కో వినలేదు. బీజేపీని బతిమలాడి మరీ పొత్తుకు ఒప్పించారు. ఇందుకు మీడియా పెద్దలతో చెప్పించారు. ప్రచారంలో బీజీగా ఉన్న మోదీని విసిగించారు. సరే.. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే సీమాంధ్రలోనూ తెలంగాణలోనూ లాభం కలుగుతుందని పొత్తుకు సిద్ధపడ్డారని భావించవచ్చు. అయితే, బీజేపీకి నాలుగు లోక్ సభ, 14 అసెంబ్లీ సీట్లను సీమాంధ్రలో ఇచ్చేవారు. వాటిలోనూ.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహించే రాజమండ్రి అర్బన్, కోడెల శివప్రసాదరావు బరి అయిన నరసరావుపేట, సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి పోటీ చేస్తానంటున్న నెల్లూరు రూరల్ తదితర సీట్లు వాటిలో ఉన్నాయి. టీడీపీకి బలమైన సీట్లను బీజేపీ ఇచ్చేసేటప్పుడు అయినా టీడీపీ నేతలు ఆలోచించి ఉండాల్సింది. సీమాంధ్రలో బలం లేని బీజేపీకి 14 అసెంబ్లీ సీట్లు ఇచ్చేటప్పుడు అయినా ఆలోచించి ఉండాల్సింది. నిజానికి, రాష్ట్ర విభజన అనంతర పరిణామాల్లో సీమాంధ్రలో బీజేపీని ఛీకొడుతున్నారని సాధారణ ప్రజలకు కూడా తెలుసు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే నష్టమేనని కూడా తెలుసు. అయినా, సీమాంధ్రలో పొత్తు పెట్టుకుంటేనే తెలంగాణలోనూ పొత్తు పెట్టుకుంటామని చెప్పడంతో సరే అన్నారు. సీమాంధ్రలోనూ పొత్తు పెట్టుకున్నారు. అప్పటి పొత్తు చర్చల సందర్భంగానే.. టీడీపీకి బలమైన సీట్లను పొత్తులో భాగంగా బీజేపీ తీసుకుంటోందని, అక్కడ బలహీనమైన అభ్యర్థులను పెడుతున్నారని కథనాలు వచ్చాయి. ఏపీ హెరాల్డ్ కూడా ఇదే విషయాన్ని తన సంపాదకీయంలో స్పష్టం చేసింది. పొత్తు చర్చల్లో ఆర్ఎస్ఎస్ నేతలు కీలక పాత్ర పోషిస్తున్నారని వివరించింది. టీడీపీ, బీజేపీ పొ్త్తుతో వైసీపీకే లాభమని, టీడీపీకి నష్టమేనని కూడా తేల్చి చెప్పింది. కానీ, నామినేషన్లకు ఇక ఒక్క రోజు ఉందనగా టీడీపీ నేతలు మేల్కొన్నారు. టీడీపీకి బలమైన స్థానాల్లో బీజేపీ బలహీనమైన అభ్యర్థులను నిలపడం ద్వారా వైసీపీకే ప్రయోజనమని, ఆ పార్టీ 15 సీట్లతో ఎన్నికలను ప్రారంభిస్తోందని గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు బీజేపీపై అత్యంత దారుణమైన నిందలు వేస్తున్నారు. మోదీకి అత్యంత సన్నిహితుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన గౌతమ్ అదానీ నేరుగా వచ్చి వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యాడట. బీజేపీ, టీడీపీ పొ్త్తు పెట్టుకోవాలని జగన్ సూచించాడట. పొత్తులో భాగంగా తీసుకున్న సీట్లలో బలహీన మైన అభ్యర్థులను పెట్టాలని ఆదేశించాడట. జగన్ ఆదేశాలకు తల ఊపిన అదానీ.. జగన్ కు పార్టీ ఫండ్ కూడా ఇచ్చి జీ హుజూర్ అని వెళ్లిపోయాడట. ఆ తర్వాత మొత్తం కథ జగన్ చెప్పినట్లే నడిచిందట. చంద్రబాబు అండ్ కో గోబెల్స్ ప్రచారం చేస్తారని తరచూ చెబుతూ ఉంటారు. కానీ, వారి గోబెల్స్ ప్రచారానికి ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి ఉంటుందా? ఒకవేళ, వైసీపీకి మేలు చేయడానికి టీడీపీ చేత్తో టీడీపీ కంటినే పొడి చేయడానికి బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే చరిత్రలో అంతకుమించిన రాజకీయ కుట్ర మరొకటి ఉండదు. ఆ విషయం తెలిసిన వెంటనే బీజేపీతో చంద్రబాబు కటీఫ్ చెప్పేసి ఉండాలి. ఇంతటి దారుణమైన రాజకీయ వెన్నుపోటుకు పాల్పడ్డారని బహిరంగంగా విమర్శించి బీజేపీని ఛీకొట్టాలి. ఎన్నికల సమయంలో బీజేపీకి ఇంతకు మించిన పరాభవం ఉండదు. అందులోనూ చంద్రబాబుకు జాతీయ స్థాయిలో మాంచి పలుకుబడి ఉంది. చంద్రబాబు ఒక్క మాట చెబితే జాతీయ మీడియా పది మాటలుగా ప్రచారం చేస్తుంది. కానీ, చంద్రబాబు కటీఫ్ చెప్పలేదు. జగన్, అదానీలతో కుమ్మక్కు అయిందని ఆరోపించిన బీజేపీతో పొత్తుకు మళ్లీ సిద్ధమయ్యారు. అంటే, అదానీకి, జగన్ కు , బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని అర్థమేగా. బీజేపీని బ్లాక్ మెయిల్ చేయడానికి ఆ పార్టీపై దారుణ గోబెల్స్ ప్రచారానికి పాల్పడిందని అర్థమేగా. టీడీపీని దెబ్బ తీయడానికి అసెంబ్లీ స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులను నిలబెడితే మళ్లీ పొత్తుకు ఎందుకు సిద్ధమైనట్లు? బీజేపీకి ఇచ్చిన లోక్ సభ స్థానాల కారణంగా వాటి పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ ఓడిపోయే పరిస్థితి ఉంటే బీజేపీకి మరో రెండు ఎంపీ స్థానాలను ఎందుకు అదనంగా ఇచ్చినట్లు? అసలు జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న బీజేపీతో పొ్త్తును ఎందుకు కొనసాగిస్తున్నట్లు? ఎందుకంటే, టీడీపీకి రెండు మూడు కీలకమైన సీట్లను బీజేపీకి ఇచ్చేసింది. వాటిని తిరిగి తీసుకోవాలి. మామూలుగా అడిగితే బీజేపీ ఇవ్వడం లేదు. అందుకని బీజేపీని బ్లాక్ మెయిల్ చేయాలని నిర్ణయించింది. బ్లాక్ మెయిల్ చేస్తే నీతో పొత్తు వద్దు ఫో అని బీజేపీ అంటుంది. అందుకే అదానీ, జగన్ భేటీ అని.. రాజకీయ కుట్ర అని కథలు అల్లింది. వాస్తవానికి, ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన వందమంది పారిశ్రామికవేత్తల్లో అదానీ ఒకరు. కాస్త అటూ ఇటుగా అంబానీతో సమానమైనవాడు. అటువంటి అదానీ జగన్ దగ్గరకు వచ్చాడట. వైసీపీ గెలిస్తే ఆ తర్వాత వచ్చే రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పటి నుంచే రాజకీయ కుట్రకు పాల్పడ్డాడట. పారిశ్రామికవేత్తలు రాజకీయ కుట్రలకు పాల్పడరు. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్లకు నాలుగు రూపాయలు పడేస్తారు. రూపాయలకు రాజకీయ నాయకులు కుక్కల్లా వాళ్ల వెంటపడతారు. ఇది అందరికీ తెలిసిన నిజం. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అయినా, జగన్, ఆర్ఎస్ఎస్ ఒప్పందం కుదుర్చుకున్నాయని, టీడీపీని దెబ్బకొట్టడానికి ప్రయత్నించాయని కథలు అల్లి అందులోకి జగన్ ను, అదానీని, మోదీని ఇలా అందరినీ తీసుకొచ్చేసింది. ఒకవేళ బీజేపీ, వైసీపీ కుమ్మక్కు అయితే టీడీపీ మళ్లీ బీజేపీతోనే పొత్తుకు ఎందుకు ముందుకు వెళుతోంది? కటీఫ్ చెప్పేయొచ్చుగా?

మరింత సమాచారం తెలుసుకోండి: