తలదన్నేవాడు ఒకడుంటే, తాడి తన్నేవాడు మరొకడుంటాడని సామెత. భాజపా, తేదేపా రెండూ అలాంటివే. రెండిటికీ ఒకరి అవసరం మరొకరికి వుంది. ఒకరు లేకుండా మరొకరు వుండలేరు. కానీ ఎక్కడలేని భేషజాలు, బెట్లు. భాజపాకు తప్పని సరై 15 అసెంబ్లీ అయదు ఎంపీ సీట్లు విదిల్చాడు బాబు. వాళ్లకి అదే ఎక్కువ అని వారికి తెలుసు. కానీ తమతో పొత్తు బాబుకు ప్రాణావసరం అని భాజాపాకు తెలుసు. అందుకనే తమకు కనీసం పాతిక ఎమ్మెల్యే సీట్లు కావాలి సీమాంధ్రలో అని డిమాండ్ చేసింది. కానీ బాబు నయాన, భయాన ఒప్పించి, పదిహేను సీట్లకు తగ్గించాడు. దంపిన దానికి బొక్కిందే కూలి అని భాజపా ఊరుకుంది. అయితే బాబుకు లేని పోని తలకాయనొప్పులు వచ్చి పడ్డాయి. ఆ పదిహేను కూడా తనకే కావాలన్న ఆరాటం పట్టుకుంది. కానీ ఎలా అది కుదిరే పని కాదు. అందుకే తరువాత ఎమ్మెల్సీలు ఇచ్చి బాకీ తీరుస్తా, ప్రస్తుతానికి ఎమ్మెల్యేలు ఇవ్వండి అంటూ అప్పు తీసుకున్నాడు రెండు స్థానాలు. తరవాత ఇస్తామా ఇవ్వమా, దానికి ఎన్ని వంకలు పెట్టి తప్పించుకోవచ్చు అన్నదానికి సవాలక్ష అయిడియాలు బాబు దగ్గర వుండనే వున్నాయి. భాజపాకు ఇవ్వక తప్పదు. కార్యకర్తలకు నచ్చ చెప్పుకోవడానికే ఈ అప్పు, తీర్చివేత వ్యవహారం. సరే అది అయిపోయింది. కానీ తెలుగుదేశానికి ఇంకా మరో రెండు మూడు స్థానాలు అవసరం పడ్డాయి. అందులో నరసరావు పేట ఒకటి. కానీ భాజపా ఇస్తుందా? అందుకే బాబు సన్నాయి నొక్కులు ప్రారంభించారు. అవి అలా పెరిగి పెరిగిన తరవాత, నామినేషన్లు ఒక్క రోజు గడువు వుందనగా, తెలివిగా పోత్తు కటీఫ్ అన్నారు. అంటే భాజపా ఎక్కడా కేండిడేట్లను పెట్టలేదు. తెదేపా సభ్యులు రెడీగా వున్నారు. అని అలోచన చేసారు. అది నిజమే కూడా. భాజపా అప్పటికప్పుడు అభ్యర్ధులను తేగలిగిన స్థితిలో లేదన్నది వాస్తవం. ఇలాంటి సమయంలో భాజపాలో తీవ్ర నిరసన ప్రారంభమైంది. పైగా అది వెళ్లి వెళ్లి భాజపా జాతీయ నాయకులను నిలదీసే స్థితికి చేరింది. ఇలాంటి సమయంలో భాజపా చాలా తెలివిగా ప్రవర్తించింది. బాబుకు ఇష్టం లేని పురంధ్రీశ్వరిని విజయవాడకు మారుస్తున్నట్లు ప్రకటించింది, అలాగే హరికృష్ణను పార్టీలోకి లాగుతున్నట్లు ఫీలర్లు వదిలింది. అన్ని స్థానాల పోటీ సంగతి ఎలా వున్నా, ఈ రెండూ బాబుకు ఝలక్ ఇచ్చాయి. తెలుగుదేశం స్థాపకుడు ఎన్టీఆర్ తనయ, తనయుడు భాజపాలోకి వళ్తే తెలుగుదేశణ పార్టీ పరువు ఏం గాను? తండ్రి పార్టీలో పిల్లలకు బాబు స్థానం లేకుండా చేసాడన్న వాదన ప్రారారంభమవుతుంది. దాంతో బాబు మెట్టుదిగక తప్పలేదు. అయినా బెట్టు బెట్టే కాబట్టి, ఇచ్చాపురం లాక్కుని, నరసరావుపేట స్థానంలో కేండిడేట్ ను మార్పించి తనదే పైచేయి అనిపించుకున్నాడు. అంతవరకు బాగానే వుంది. కానీ మిగిలిన 13 ఎమ్మెల్యే సీట్ల సంగతేమిటి? అక్కడ బలమైన అభ్యర్థులు భాజపాకువున్నారా? లేకుంటే 13 సీట్లు హారతి పళ్లెంలో పెట్టి,వైకాపాకు ఇచ్చినట్లే కధా? కొసమెరపు ఏమిటంటే, భాజపా బాబుకు ఝలక్ ఇవ్వడం వరకు బాగానే వుంది. బాబు మరో సీటు లాక్కోవడం వరకు ఓకె. కానీ ఈ చదరంగంలో పాపం, ఎన్టీఆర్ బిడ్డ, కొడుకు పావులైపోయారు. అదే విచారకరం.

మరింత సమాచారం తెలుసుకోండి: