తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు ఓ పార్టీకీ ఓ సీటుకూ కాకుండా పోయారు. ఇతర పార్టీల్లో మనుగడ సాగిద్దామనే ప్రయత్నాలకు కూడా విఘాతం ఏర్పడింది. విభజనపై వ్యతిరేకతతో కాంగ్రెసును వీడిన దగ్గుబాటి దంపతులు ఇప్పుడు రాజకీయాల్లో గడ్డు సమస్యను ఎదుర్కుంటున్నారు. విశాఖపట్నం లోకసభ సీటును ఆశించి బిజెపిలో చేరిన దగ్గుబాటి పురంధేశ్వరి కడప జిల్లాలోని రాజంపేట లోకసభ స్థానంలో పోటీ చేయాల్సి వస్తోంది. రాజంపేట సీటులో విజయం సాధించడం ఆమెకు ఆషామాషీ ఏమీ కాదు. కాంగ్రెసుకు రాజీనామా చేసినప్పుడే తాను ఎన్నికలకు దూరంగా ఉంటానని చెప్పారు. కాగా రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన నందమూరి హరికృష్ణ పరిస్థితి ఎటూ కాకుండా పోయేట్లుంది. కృష్ణా జిల్లాలోని పెనమలూరు లేదా నూజివీడు శాసనసభా స్థానాల నుంచి పోటీ చేయాలని భావించారు. చివరి వరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆయనను ఆశపెట్టారు. కానీ చివరి నిమిషంలో హరికృష్ణకు చేయి ఇచ్చారు. దీంతో హరికృష్ణ తీవ్ర నిరాశకు గురయ్యారు. దానికితోడు, తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు దూరం పెట్టారు. ఓవైపు తనకు నచ్చని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చెట్టుకొకరు పుట్టకొకరు అయితే మరోవైపు తనతో పాటు నడుస్తున్న తన వియ్యంకుడు, ఎన్టీ రామారావు కుమారుడు బాలకృష్ణకు హిందూపురం శాసనసభా టికెట్ ఇచ్చారు. అది కూడా చంద్రబాబుతో తీవ్రంగా అంతర్గత పోరాటం చేసి బాలయ్య ఆ సీటును దక్కించుకున్నట్లు చెబుతున్నారు. తన కుమారుడు నారా లోకేష్‌ను చంద్రబాబు నాయుడు ఎన్నికల బరిలోకి దింపలేదు. కానీ, ఆయనకు తన వారసత్వాన్ని అందించడానికి మాత్రం సన్నద్ధమైనట్లు అర్థమవుతోంది. అంతే కాదు ఈ సార్వత్రిక ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా దూరంగానే ఉన్నారు. గతంలో విజయనగరంలో ఆయన చేసిన ప్రచారానికి చాలా స్పందన లభించగా ఈ సారి ఆ ఊసే లేదు.    

మరింత సమాచారం తెలుసుకోండి: