ఎన్నడూ లేనంతగా దిగజారిపోయిన రాజకీయాలను చూసి సిగ్గేస్తోంది. గతంలో పార్టీ మారడం అంటే కాస్త కాకుంటే కాస్తయినా తటపటాయింపు వుండేది. కానీ ఈ సారి సార్వత్రిక ఎన్నికల వేళకు అది గాలికిపోయింది. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందుగానే ఈ పార్టీ నుంచి ఆ పార్టీ లోకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. ఇవెంత భయంకరంగా అంటే, వరద గేట్లు తెరుచుకుంటే ప్రవహించే నీటి మాదిరిగానే. సరే ఎవరి అవకాశ వాదం వారిది, ఎవరి అధికార లాలస వారిది. కానీ చేర్చుకునే పార్టీల సంగతేమిటి? ఓ నిబద్ధత అనేది వుండొద్దా. అదీ లేదు చేర్చుకున్నాయి. ఇలా చేరిన వారంతా కొత్త గూటి పలుకులు పలకడం వింటుంటే జుగుప్సగా వుంది. నిన్నటి దాకా కేంద్రంలో అధికారం వెలగబెట్టి, తన వారనుకునేవారికి పనులు చేసిపెట్టి, రాహుల్, సోనియా భజన చేసిన పురంధ్రీశ్వరి నిస్సిగ్గుగా మోడీ భజన అందుకున్నారు. వైఎస్ సన్నిహిత స్నేహాన్ని చవిచూసిన వాడు శతృచర్ల విజయరామ రాజు, గతంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా లక్ష్మీపార్వతితో కలిసి పనిచేసినవాడు. ఇప్పుడు తెలగుదేశంలోకి చేరారు. జెసి దివాకర రెడ్డి సంగతే వేరు. అనంతపురం ప్రాంతంలో తన దైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నానా ఇబ్బందులు పెట్టాడని ప్రతీతి. మరి అలాంటి వ్యక్తి సామ్రాజ్యం అంతా ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చి చేరింది. ఇలా ఒకరేమిటి నిన్నటి దాకా కత్తులు దూసుకున్నవారు, మాటల తూటాలు విసురుకున్నవారు ఇలా పార్టీలకు పార్టీలు మారేసారు. సరే బాగానే వుంది. టికెట్ ల పంపకం ప్రారంభమైంది. అందినవారికి అందాయి. లేని వారికి లేదు. అంతే మళ్లీ జంప్ జిలానీ మంత్రం పఠించడం మొదలైపోయింది. కొత్త పార్టీ గుమ్మం తొక్కి పట్టుమని పది వారాలు కూడా కాలేదన్న వాస్తవాన్ని విస్మరించి, ఎవరు టికెట్ ఇస్తారా అన్నది చూడడమే లక్ష్యమైపోయింది. ఇక్కడ కొన్ని వాస్తవాలు తొంగి చూస్తున్నాయి.ఒకటి. వీరందరికీ ఈ ఎన్నికల్లో ఎలాగోలా పోటీ పడాలన్నది కీలక లక్ష్యం. రెండు. ఏ పార్టీ టికెట్ లేకుండా పోటీకి దిగలేని మహా గొప్పవాళ్లు వీరంతా.మూడు. పార్టీ ఏదైనా టికెట్ వస్తే చాలు, తమ కున్న డబ్బు తో గెలిచేయచ్చన్న ధీమా వీరి సొంతం. ఇలా ఎందుకు అనాల్సి వస్తోందంటే. పార్టీ ఏది, దానికి తమ నియోజకవర్గంలో వున్న పలుకుబడి ఏ మేరకు అన్నిది చూడడం లేదు. ముందుగా మాంచి అవకాశం వున్న పార్టీ చూస్తున్నారు. కుదరకుంటే మరో పార్టీ, ఎక్కడ ఖాళీ వుందా అన్నదే లక్ష్యం,. ఇంకా చిత్రమేమిటంటే, అసలు తమ తమ స్థానాలతో సంబంధం లేదు. ఎక్కడో అక్కడ టికెట్ ఇస్తే చాలు. పురంధ్రీశ్వరి రాజంపేటకు పోయారు. కోడెల సత్తెనపల్లికి వచ్చారు. ఇవి చాలా చిన్న ఉదాహరణలు. అభ్యర్థులంతా ముందుగా సీటు ఇస్తారా అని అడిగినతరువాతే పార్టీలోకి వస్తున్నారు. రాదంటే అటు పోవడం లేదు. కాంగ్రెస్ ను వదలాలనుకున్న నేతలంతా ముందు వైకాపాను సంప్రదించి, అక్కడ నో వేకెన్సీ అన్నాక దేశంలోకి వచ్చారు. జెసి దివాకర రెడ్డి వైకాపా తలుపు కొట్టి, కొటి విసిగి అప్పుడు దేశంలోకి వచ్చారు. ఇలాంటి వాళ్ల జాబితా చాలా పోడవైనదే. ఇంక రఘురామ కృష్ణం రాజు లాంటి వాళ్లు పార్టీ మారిన తరువాత అక్కడ టికెట్ రాకుంటే, పక్క పార్టీని అడగకుండానే ముందుగా ఎందుకయినా మంచిదని ఆ పార్టీ పేరిట కూడా నామినేషన్ వేసారు. అక్కడే అర్థం అవుతోంది ఒక నిబద్ధత సిద్ధాంతం అనేవి కాదు, టికెట్, పోటీ ఇదే అవసరం అని.ఇప్పుడు ఈ చివరి నిమషంలో కూడా విపరీతమైన జంపింగ్ జపాంగ్ లు కనిపిస్తున్నారంటే, ఏమనుకోవాలి? కార్యకర్తలకు పార్టీని నమ్ముకున్న వారికి పెద్ద పీట వేసాం అని చెబుతుంటాయి పార్టీలు. కానీ ఆఖరికి చేసేది, పక్క పార్టీ నుంచి వచ్చినవారికి పెద్ద పీట వేసి, వీరిని బుజ్జగించడం. మరిపార్టీలే ఇలా చేస్తే, నాయకులు జంప్ అనక ఏమంటారు. ఇలాంటి వారినా మనం ఎన్నుకోవాలి? ఇలాంటి వారినా మనం నమ్ముకోవాలి. హతవిధీ..ఏ తీరాలకీ రాజకీయాలు?

మరింత సమాచారం తెలుసుకోండి: