ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ వాహనంపై టీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం దాడి చేసిన విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు దాడిని తీవ్రంగా ఖండించారు. నల్గొండ జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు ఈ ఘటనపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మరోసారి తన జోలికి గానీ, తన కుమారుడి జోలికి గానీ వస్తే వదిలి పెట్టనని చంద్రబాబు హెచ్చరించారు. ఖబడ్దార్..జాగ్రత్తగా ఉండండని చంద్రబాబు హెచ్చరించారు.  తన వాహనంపై బాటిళ్ళు, చెప్పులు వేయడంపై లోకేష్ మండిపడ్డారు. తనకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుడి పరిస్తితి ఏమిటని ప్రశ్నించారు. అయితే ఇటువంటి దాడులతో తననుగానీ, టీడీపీని గానీ భయపెట్టలేరని లోకేష్ వ్యాఖ్యానించారు. దాడులకు పాల్పడే వారికి తగిన బుద్ది చెప్పాలని లోకేష్, ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. దాడిపై స్పందించిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీది పూర్తిగా దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని, టీడీపీ తెలంగాణాలో బలంగా ఉందన్న విషయం గ్రహించిన టీఆర్ఎస్ ఇటువంటి దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: