ఎంతో ఆర్భాటంగా పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ ఇంక పూర్తిగా పల్లకీ మోయడానికే పరిమితమైపోయింది. కేవలం మోడీ, చంద్రబాబులను గద్దెనెక్కించడానికి ఓ ప్రణాళిక ప్రకారం పవన్ హడావుడి చేసి, ఆఖరికి ప్రచారానికి పరిమితమైనట్లు కనిపిస్తోంది. ముందుగానే మద్దతు అంటే బాగుండదు కనుక, పార్టీ పెడుతున్నట్లు బిల్డఫ్ ఇచ్చి, పోటీకి సై అన్నట్లు కాలు దువ్వి, ఆఖరికి ఇప్పుడు కాదు, తరువాత చూద్దాం అని ప్రచారం మాత్రం నిర్వహిస్తానంటున్నారు. దీన్ని బట్టి చూస్తే పవన మద్దతు కోసం భారీ మొత్తాలు చేతులు మారాయన్న ఆరోపణలు నిజమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. జనసేన పార్టీ ఫైనాన్షియర్ పొట్లూరి వరప్రసాద్ కూడా ఆఖరికి పోటీకి దిగలేదు. అసలు జనసేన రెండు సభలకు, దాని హడావుడికి ఖర్చు ఆయన ఖాతాలోనిదే అని అందరికీ తెలిసిందే. పాపం ఆయనకు టికెట్ ఇమ్మని కోరినా చంద్రబాబు నో అన్నారు. అక్కడితో పవన్ స్థాయి తేలిపొయింది. పోనీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాఅన్నా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. జెపికి మద్దతు ఇచ్చి, ఇటు పివిపి కి మద్దతు ఇస్తే, పవన్ స్టయిల్ అర్థం కాక జనం జుట్టు పీక్కుంటారు. బిజెపి అంటారు..టీడీపీ అంటారు..మళ్లీ లోక్ సత్తా అంటారు. ఇప్పుడు ఇండిపెండెంట్ అంటారు అని జనం గోల పెట్టేవారు. మరి ఇంక మిగిలింది ప్రచార పర్వం. కర్ణాటకలో ఒకటి రెండు రోజుల ప్రచారం ముగిసింది. ఇక్కడకు వచ్చేసారు. మోడీ సభల్లో పాల్గొంటారని అంటున్నారు. అది బహుశా కరెక్టేకావచ్చు. అంతకు మించి పవన్ ప్రచారం చేసే సీన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే పవన్ ప్రచారానికి వస్తే, భారీ ఖర్చు వుంటుంది. కనీసం అతగాడి కోసం కొంతమంది అయినా బాడీగార్డ్ ల జీతభత్యాలు భరించాలి. ఇప్పుడు ఇది భరించేది పివిపి కాదు ఎవరు పిలిస్తే వారు. కానీ అలా అని పవన్ అందరు టీడీపీ, భాజపా వారి కోసం తిరిగేస్తారని అనుకోవడానికి లేదు. ఆయనకు వారి ఫేస్ నచ్చాలి. అప్పుడే ఊ అంటారు. ఇప్పటి దాకా ఎవరికీ ఊ అనలేదు. మరి ఎప్పుడు అంటారో తెలియదు. ఇదిలా వుంటే పివిపి విషయంలో పవన్ కాస్త అలిగాడని, అప్పుడే మోడీరంగంలోకి దిగారని, పవన్ కు ఏదో డైరెక్షన్ చేసారని దీంతో పొట్లూరి విషయంలో, పోటీ విషయంలో పవన్ సైడ్ అయ్యారని సమాచారం. సరే పవన్ ఎందుకు సైడ్ అయ్యారనే దానిని పక్కన బెడితే ఆయన మాత్రం పొట్లూరికి దూరమైనట్లే అనుకోవాలి. . దీంతో జనసేనను నడిపించడానికి పవన్ ఉన్నా కూడా దానిని భరించేందుకు ఎవరు లేరు. ఎలాంటి అధికారంలేకుండా,నిర్ణయాలు పదేపదే మార్చుకుంటున్న పవన్ కు ఇప్పుడు పార్టీ నడిపేందుకు మరో నిర్మాత దొరకడం కష్టం. ఇంత కష్టపడి, ఖర్చుపెట్టుకున్న పొట్లూరికి హ్యాండిచ్చాకా ఆ సాహసం మరొకరు చేస్తారా అన్నది అసలు ప్రశ్న. అంటే ఇక జనసేన రాజకీయ సినిమాకు నిర్మాత లేనట్టే. అంటే సినిమా షూటింగ్ దశలోనే ఆగిపోయినట్టే. అందుకే అది పూర్తి కాదు, రిలీజ్ కాదు కేవలం పబ్లిసిటీ మాత్రం జరుగుతూ వుంటుంది. అది మిగిలిన వారికి పనికివస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: