వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌ ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. ఈ అఫిడవిట్‌లో ఆయన తప్పుడు వివరాలను సమర్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనకు, తన భార్య (భారతి) కు కూడా ఎలాంటి సొంత వాహనాలు లేవని నామినేషన్‌ సందర్భంగా ఈసీకి జగన్‌ అఫిడవిట్‌ సమర్పించిన విషయం తెలిసిందే. అయితే, జగన్‌కు రెండు కార్లు ఉన్నట్లు ఆర్టీయే రికార్డులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్‌ పేరుతో ఒక స్కార్పియో (ఏపీ09బీవీ1229) నంబరుతో 28-08-2009లో రిజిస్ట్రేషన్‌ అయినట్లు సమాచారం. అలాగే ఆయన పేరిట మరో బీఎండబ్ల్యు కారు ఉందనీ, దాని నంబరు (ఏపీ09బీఎన్‌2345)తో రిజిస్ట్రేషన్‌ అయినట్లు సమాచారం. రెండు వాహనాల రిజిస్ట్రేషన్‌ జగన్‌ పేరు మీదే ఉన్నట్లు ఆర్టీయే రికార్డులు సూచిస్తున్నాయి. జగన్‌ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని గతంలోనే టిడిపి సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో తప్పుడు సమాచారం ఇచ్చిన జగన్‌పై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేసింది. ఇదిలా ఉండగా, మూడు రోజుల క్రితం కడప జిల్లా పులివెందులలో అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన జగన్‌ తన ఆస్తుల విలువ రూ. 416 కోట్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌కు దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అందులో తనకు తన భార్యకు ఎలాంటి వాహనాలు లేవని కూడా ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.  జగన్‌ పేరుతో ఆర్టీయే కార్యాలయంలో రెండు కార్లు రిజిస్ట్రేషన్‌ అయినట్లు ఉన్న విషయాన్ని ఎన్నికల అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ రెండు వాహనాలను జగన్‌ వాడుతున్నారని సైతం వారు నిర్ధారించుకున్నారనీ, ఈ విషయంపై పరిశీలన జరుపుతు న్నట్లు తెలుస్తోంది. కాగా, జగన్‌ తనకు కార్లు లేవని ఎన్నికల కమిషన్‌కు తప్పుడు అఫిడవిట్‌ను సమర్పించిన విషయంపై ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేస్తామనీ టిడిపి సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: