తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గతంలో చక్కెర ఫ్యాక్టరీని ఎలా అమ్మాడు? అని ప్రశ్నిస్తోంది కల్వకుంట్ల కవిత. కేవలం కవిత మాత్రమే కాదు ఆమె తండ్రి కూడా చంద్రబాబును ఈ విషయంలో తెగ విమర్శించేస్తూ ఉంటాడు. చంద్రబాబు నిజాం షుగర్స్ ను పప్పు బెల్లాలకు అమ్మేశాడని దీని వల్ల అనేక జిల్లాల్లోని చక్కెర రైతులకు తీవ్రమైన అన్యాయం చేశాడని కేసీఆర్ అండ్ కో విమర్శిస్తూ ఉంటుంటి. ఈ ఆరోపణను బలమైన ఆయుధంగా భావిస్తోంది కేసీఆర్ ఫ్యామిలీ. పదే పదే చంద్రబాబును ఈ విషయంలో నిలదీస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే లాజిక్ ప్రకారం చూస్తే ఈ విషయంలో చంద్రబాబును పల్లెత్తు మాట అనడానికి కూడా కేసీఆర్ అండ్ కోకు అర్హత లేదు. ఆ లాజిక్ ఏమిటంటే... రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో విస్తరించి ఉన్న నిజాం షుగర్స్ అను ప్రభుత్వ ఫ్యాక్టరీని బాబు ప్రైవేట్ వ్యక్తులకు గుజిరీ కింద అమ్మి వేసిన సమయంలో కేసీఆర్ తెలుగుదేశం పార్టీలోని ముఖ్యమైన నాయకుడు! ఎన్టీఆర్ ను దించేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకా కేసీఆర్ కూడా చంద్రబాబు వెంటనడిచాడు. బాబును అప్పట్లో తెగ కీర్తించేవాడు కల్వంకుట్ల చంద్రశేఖర్ రావు. చంద్రబాబు నాయుడు నిజాం షుగర్స్ ను అమ్మింది కూడా అప్పడే! మరి ఇప్పుడు నిజాం షుగర్స్ ను నాశనం చేశావు అని చంద్రబాబును కేసీఆర్ విమర్శిస్తున్న సంగతి బాగానే ఉంది కానీ.. అప్పుడు ఏం చేసినట్టు? బాబు విధానాలు అదుర్స్ అని అప్పట్లో తెగ మెచ్చుకొన్నాడు కేసీఆర్. ఇప్పుడేమో కల్వకుంట్ల కవిత కూడా "చక్కెర ఫ్యాక్టరీని ఎందుకు అమ్మావు?' అని చంద్రబాబు ను ప్రశ్నించే స్థాయికి ఎదిగింది. ఈ విషయంలోఆమె ముందు తన తండ్రి వెర్షన్ ను తీసుకోవాల్సి ఉంటుంది. అప్పట్లో బాబు అమ్ముతుంటే చెరకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అడ్డుకోలేకపోయిన తండ్రిని కూడా నిలదీయాల్సి ఉంటుంది కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: