పవన్ కల్యాణ్ ప్రసంగంలో పస తగ్గుతోంది. తాను చెప్పదలచుకున్న విషయాలను ఆయన సూటిగా చెప్పలేకపోతున్నారు. ప్రసంగంలో గందరగోళం ఎక్కువగా చోటు చేసుకుంటోంది. ఒక విషయాన్ని చెబుతూనే మధ్యలో దానిని వదిలేసి మరొక విషయంలోకి వెళ్లిపోతున్నారు. ఇందుకు కారణం ఒక్కటే. రాజకీయ అవగాహన కానీ, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై విషయ పరిజ్ఞానం కానీ ఆయనకు తక్కువే. అయితే, జనసేన పార్టీ సభలకు ఆయనకు మరెవరో ప్రసంగాలు రాసి ఇచ్చేవారు. ఒక గంట ప్రసంగం కనక దానిని పది రోజులు ఆయన బట్టీ పట్టేవారు. ఇప్పుడు అలా కాదు.. ఎన్నికల సభల్లో భాగంగా పలుచోట్ల మాట్లాడాల్సి వస్తోంది. ఇప్పుడు కూడా రాసుకుని వస్తున్నారు. కానీ దానిని చక్కగా ప్రెజెంట్ చేయడంలో ఆయన విఫలమవుతున్నారు. ఉదాహరణకు మంగళవారంనాటి నిజామాబాద్ సభనే తీసుకుందాం. ఆ సభలో ఆయన టార్గెట్లు రెండు. ఒకటి కాంగ్రెస్.. రెండోది టీఆర్ఎస్. ఆ రెండు పార్టీలనూ విమర్శించి వాటి తప్పులను ఎత్తి చూపి బీజేపీకి మేలు చేయాలని, మోడీకి ఓటు వేయాలని చెప్పాలనేది ఆయన ఉద్దేశం. ఇందులో భాగంగానే, ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు తనకు పోటీ చేసే అవకాశం ఉన్నా, సత్తా సామర్థ్యం ఉన్నా ఎన్నికల్లో దిగలేదని, పోటీ చేయలేదని, తనకు కుటుంబ రాజకీయాలంటే ఇష్టం లేదని చెప్పారు. రాజకీయాలంటే కొడుకు, కూతురు, మేనల్లుడు కాదంటూ కేసీఆర్ ను పరోక్షంగా విమర్శించారు. అంతే తప్పితే.. నిజామాబాద్ లో కేసీఆర్ తన కూతురు కవితకు టికెట్ ఇచ్చారని, కాంగ్రెస్ తరహాలోనే టీఆర్ఎస్ ది కూడా కుటుంబ పాలనేనని ఆయన నేరుగా విమర్శించలేకపోయారు. నిజామాబాద్ సభలో టీఆర్ఎస్ ను విమర్శించాలని అనుకున్న పవన్ కల్యాణ్.. పరోక్షంగా ఆయనకు మేలు చేశారు. ఒక రకంగా కేసీఆర్ ను పొగిడారని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలంటూ కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీ నేతల కాళ్ల చుట్టూ తిరిగారని, తీరా ఇచ్చిన తర్వాత తన పార్టీని ఆయన విలీనం చేయలేదని చెప్పారు. అంటే, తెలంగాణ కోసం కేసీఆర్ కష్టపడ్డారన్న విషయాన్ని ఇక్కడ పవన్ చెప్పారు. అంతకుముందే కాంగ్రెస్ ను తిట్టిపోసిన పవన్ కల్యాణ్.. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్న కేసీఆర్ ఎందుకు విలీనం చేయలేదని నిలదీశారు. ఇక్కడ ద్వంద్వ ప్రమాణాలు కనిపించాయి. ఒక పక్క కాంగ్రెస్ ను తిట్టిపోస్తున్నారు. మరోపక్క, కేసీఆర్ కు బాధ్యత లేదని, ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయలేదని, ఆయన మాట నిలబెట్టుకోడని విమర్శించారు. కాంగ్రెస్ ను విమర్శించేటప్పుడు ఆయన ఆ పార్టీలో టీఆర్ఎస్ విలీనం అంశాన్ని ఎత్తుకోకుండా ఉండి ఉంటే బాగుండేది. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి టీఆర్ఎస్ ఏయే విమర్శలు చేస్తోందో వాటినే పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. విద్యార్థులు, యువత ఆత్మహత్యలతోనే తెలంగాణ వచ్చిందని, పదేళ్లపాటు తెలంగాణను ఇవ్వకుండా జాప్యం చేసిందంటూ విమర్శలు గుప్పించారు. పరోక్షంగా ఈ విమర్శలన్నీ టీఆర్ఎస్ కు కూడా మేలు జరిగేలాగే ఉన్నాయి. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చాలా మంచి అంశాలు పెట్టారంటూ పదే పదే పవన్ పొగిడారు. వాస్తవానికి, కేసీఆర్ ను విమర్శించడానికి ఆయన మేనిఫెస్టోను ప్రస్తావించారు. మేని ఫెస్టోల్లోని అంశాలను అమలు చేయాలంటే కేంద్రంలోని ప్రభుత్వం అవసరమని, ఆ ప్రభుత్వానికి అండగా ఉండాలని, కానీ కేసీఆర్ మోడీ లేడు గీడీ లేడని విమర్శిస్తున్నారని, ఇక ఆయనకు నిధులు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి గత రెండు రోజులుగా బీజేపీ కింది స్థాయి నాయకులు చేస్తున్న ఈ విమర్శలనే పవన్ కూడా చేశారు. అయితే, ఇక్కడ అపరిపక్వత కనిపిస్తోంది. జయలలిత, మమతా బెనర్జీ, నితీశ్ కుమార్, నవీన్ పట్నాయక్ తదితర నేతలు కూడా కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. అంతెంతుకు, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వస్తే ఆయన కూడా కాంగ్రెస్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు. అంతమాత్రాన, కేంద్రంలోని ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు నిలిపేయదు కదా? ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్నికల ముందు పరిస్థితి వేరు.. ఎన్నికల తర్వాత పరిస్థితి వేరు. ఎన్నికల ముందు శత్రువులు తర్వాత మిత్రులు అవుతారు. అది రాజకీయాల్లో సర్వసాధారణం. కేసీఆర్ ను విమర్శించడానికి ఇంకా చాలా అంశాలు ఉన్నా.. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయలేదని.. మోడీని తిడుతున్నాడని ఇక నిధులు ఎలా వస్తాయని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఈ రెండు అంశాలూ రాజకీయాల్లో ఆయన అపరిపక్వతకు నిదర్శనం. పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తులు తమ ప్రసంగాన్ని మొదలుపెట్టి ఒక దశలో దానిని తారస్థాయికి తీసుకెళతారు. గతంలో ఆయన చేసింది కూడా అదే. కానీ, ఈసారి అది శ్రుతి తప్పింది. ఉదాహరణకు, శ్రవణ్ ఉదంతాన్ని చూసుకుందాం. ‘‘ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు శ్రవణ్ కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చాం. అప్పట్లో ఆయనకు టికెట్ ఇవ్వడానికి ఆయన కులం చూడలేదు. పార్టీలో ఆయన ఎంత కష్టపడ్డాడు అనే చూశాం. కానీ, శ్రవణ్ కులం కారణంగా కేసీఆర్ టికెట్ నిరాకరించారు. నీ కంసాలి కులానికి పట్టుమని పది ఓట్లు లేవని, ఇక నీకు టికెట్ ఎందుకని అడిగారట. ఇది వింటే చాలా బాధేసింది’’ అని పవన్ అన్నారు. వాస్తవానికి, ఈ అంశాలన్నీ పత్రికల్లో వచ్చేశాయి. చాలామందికి ఈ విషయాలు తెలుసు. తెలిసిన విషయాలు మళ్లీ మళ్లీ చెబితే బోర్ కొడుతుంది. కానీ, ఇక్కడ కేసీఆర్ ను విమర్శించాలనుకున్న పవన్ కల్యాణ్.. కేసీఆర్ ఏ కులానికి ఎన్ని టికెట్లు ఇచ్చారని ప్రస్తవించి ఉండాల్సింది. తెలంగాణలో వెలమ కులం ఓట్లు ఎన్ని ఉన్నాయి? వాళ్లకు ఎన్ని టికెట్లు ఇచ్చారు? తెలంగాణలో రెడ్ల శాతం ఎంత? నాలుగైదు శాతం ఉన్న రెడ్లకు అత్యధిక టికెట్లు ఎందుకు ఇచ్చారు? తెలంగాణలో బీసీ 85 శాతం అయితే 15 శాతం టికెట్లు కూడా ఎందుకు ఇవ్వలేదు? కులమే ప్రాతిపదిక అయితే బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలి కదా.. కులంతోపాటు ధనం కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే శ్రవణ్ లాంటి వ్యక్తులకు టికెట్లు రావడం లేదు. ఆ పార్టీలో పని చేసిన వారికి గుర్తింపు ఉండదు అంటూ భావోద్వేగంతో ప్రసంగించి ఉంటే పవన్ కల్యాణ్ ప్రసంగం బాగుండేది. కానీ, ఈరోజు ఆయన ప్రసంగంలో ఒక దిశ, దశ కొరవడింది. మొత్తానికి, పవన్ కల్యాణ్ కారణంగా ఒకటి మాత్రం పక్కాగా జరుగుతోంది. అదేమిటంటే.. ఇక్కడ తెలంగాణలోనూ అక్కడ సీమాంధ్రలోనూ రెండుచోట్లా కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన దెబ్బ తగులుతోంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీయే తన గొయ్యిని తాను తవ్వుకుందనుకోండి. కానీ, ఆ బొందను మరింత లోతు చేయడానికి, కాంగ్రెస్ ను పూర్తిగా సమాధి చేయడానికి పవన్ కల్యాణ్ ఒక ఆయుధంగా ఉపయోగపడుతున్నాడు. పవన్ ప్రసంగంతో లబ్ధి అంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: