చంద్రబాబు తెలంగాణకు ఎంతవరకు అనుకూలమో జనాలకు తెలియంది కాదు. ఆయన రెండు కళ్ల సిద్ధాంతంతో, మీడియా సహకారంతో సీమాంధ్రలో జనాలను నమ్మబలికాడు కానీ, తెలంగాణలో కాదు. ఆ సంగతి భాజపా జనాలకు కూడా బాగా తెలిసినట్లుంది. అందుకే చంద్రబాబును హైదరాబాద్ సభకే పరిమితం చేసారు. మోడి హైదరాబాద్ తో సహ మహబూబ్ నగర్, నిజామాబాద్ వంటి చోట్ల ప్రచార బహిరంగసభలు నిర్వహించారు. ముందుగా అనుకున్నట్లు తెలంగాణ అంతటా టిడిపితో బిజేపి పొత్తు పెట్టుకుంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బిజేపి కంటే టిడిపి అభ్యర్థులే ఎక్కువగా పోటీలో ఉన్నారు. అంటే మోడి నిర్వహించే ప్రతి సభలో చంద్రబాబు పాల్గొనాలి. ఆ సభల్లో బిజేపి వారితో పాటు టిడిపి నేతలు పాల్గొనాలి. కాని మోడి సభలు అందుకు భిన్నంగా సాగాయి. ఒక్క హైదరాబాద్ లో మాత్రమే చంద్రబాబు మోడీ సభలో పాల్గొన్నారు. హైదరాబాద్ మినహా తెలంగాణలో మోడి నిర్వహించిన ఏ సభలోను చంద్రబాబు పాల్గొనలేదు. పోని చంద్రబాబు బిజీ కారణంగా పాల్గొనలేదనుకోవచ్చు. కాని టిడిపికి చెందిన ఇతర ప్రధాన నేతలెవరిని కూడా మోడి తన సభల్లో పాల్గొననీయలేదు. అంతే కాదు సభల్లో అంతా బిజేపి జెండాల రెపరెపలే కన్పించాయి. టిడిపి పసుపు రంగు వెతికినా కన్పించని పరిస్థితి. అంతే కాదు మోడికూడా టిడిపి గూర్చి ఎక్కువగా ప్రస్తావించలేదు. హైదరాబాద్ లో టిడిపి, బిజేపి పొత్తును విన్నింగ్ కాంబినేషన్ గా అభివర్ణించిన మోడి వెంటనే జరిగిన సభల్లో ఆ ఊసే ఎత్తలేదు. ఒక్క సభలో మాత్రం చివరగా టిడిపి ఆదిలాబాద్ లోక్ సభ అభ్యర్థి రమేష్ రాథోడ్ ను గెలిపించండి అన్నారు. పవన్ కూడా తన ప్రసంగంలో ఎక్కడ టిడిపి కి మద్దతుగా మాట్లాడలేదు. అసలు టిడిపి పదాన్నే తన నోట రానీయలేదు. అంటే తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చిన పార్టీగా బిజేపికి తెలంగాణలో ప్రజాధరణ ఉంది. చివరి సమయంలో కూడా తెలంగాణను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారన్న భావం తెలంగాణలో ఉంది. ఆయనతో వెలితే మైనస్ అవుతామని బిజేపి భావిస్తోంది అన్నది దీంతో స్పష్టం అవుతోంది అంటున్నారు. అందుకే టిడిపి కూడా తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో బిజేపికే ఎక్కువ సీట్లు ఇచ్చింది అంటున్నారు. హైదరాబాద్ ను అభివృద్ది చేసిన నేతగా, సీమాంద్ర వాసులు ఎక్కువగా ఉండి తెలంగాణ సెంటిమెంట్ అంతగా లేనందున అక్కడ మాత్రం చంద్రబాబుతో సహా సభను నిర్వహించారని రాజకీయ వర్గాల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: