రాష్ట్రం నేడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున అభివృద్ధి తక్షణ అవసరమని టిడిపి నేత, సినీనటుడు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కొత్త రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ‘కడప జిల్లా రాజంపేటలో మీ సోదరి పురంధ్రీశ్వరి పోటీ చేస్తున్నారు కదా, అక్కడ మీరు ప్రచారం చేస్తారా?’ అని ప్రశ్నించగా, తనకు ఎవరితోనూ ఎటువంటి విభేదాలు లేవని, రాజంపేట ప్రచారం తన రూట్‌మ్యాప్‌లో లేదని అన్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే తప్పకుండా ప్రచారం నిర్వహిస్తానన్నారు. ‘టిడిపి అధికారంలోకి వస్తే మీరు మంత్రి పదవి ఆశిస్తారా?’ అన్న ప్రశ్నకు తాను ఎప్పుడూ పదవులు ఆశించ లేదని, పదవులే తన వద్దకు వచ్చేవని పేర్కొన్నారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లను పార్టీ దూరం చేసిందన్నదానికి సమాధానం చె బుతూ, పార్టీ ఎవరినీ పిలవడం ఉండదని, వారు ప్రచారం చేయాలా? వద్దా? అన్నది వారి వ్యక్తిగత విషయమన్నారు. హరికృష్ణకు సీటు కేటాయించడమన్నది పార్టీ అధిష్ఠానం ఇష్టమని, పార్టీ అధికారంలోకి వస్తే మంచి పదవి కట్టబెట్టవచ్చుకదా! అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయకత్వం ఎంత అవసరమో, దేశంలో భారతీయ జనతాపార్టీ నేత మోడీ నాయకత్వం అంతే అవసరమని తెలిపారు. హిందూపురంలో తన మెజార్టీ గురించి మాట్లాడుతూ తన తండ్రి దివంగత ఎన్టీఆర్, అన్న హరికృష్ణల మాదిరిగానే మంచి మెజార్టీ సాధించడం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తులసివనంలో కలుపు మొక్క లాంటివారన్నారు. జిల్లాలో లిక్కర్ డాన్‌గా ఎదిగారని, ఇసుక మాఫియాలోనూ ఆయన ప్రమేయం ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: