రాజకీయంగా చైతన్యవంతమైన కృష్ణా జిల్లాలో ముందెన్నడూ లేని రీతిలో ప్రస్తుత ఎన్నికల్లో రాజకీయాలు రంగులు మారుతున్నాయి. సిద్ధాంతాలు, వ్యక్తిత్వాలను పక్కనబెట్టి కేవలం సీటు కోసమే పలువురు రాత్రికి రాత్రే పార్టీలు ఫిరాయించిన తీరు ప్రజల్ని ఆశ్చర్యపరుస్తోంది. తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు పురిటిగడ్డ కృష్ణా జిల్లాలో ప్రస్తుతం పార్టీ అష్టకష్టాలు ఎదుర్కొంటోంది. జిల్లాలో 16 శాసనసభ స్థానాలు ఉండగా తిరువూరు, నందిగామ, పామర్రు నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వు అయ్యాయి. అభ్యర్థుల ఎంపికలో వైకాపా అగ్రస్థానంలో నిలిచింది. ఆ పార్టీకి ఎక్కడా తిరుగుబాట్లు, సమస్యలు ఎదురుకాలేదు. కొన్ని మాసాల క్రితమే ఇన్‌చార్జ్‌లుగా నియమితులైన వారికే ఆయా నియోజకవర్గాల్లో సీట్లు కేటాయించటం పార్టీకి కలిసొచ్చింది. ఇక తెలుగుదేశం - బిజెపి పొత్తు నామినేషన్ల ఘట్టంలో మలుపులు తిరిగి నేతలకు శిరోభారంగా మారింది. ఈ కూటమి ఐదు నియోజకవర్గాల్లో వలసవాదులను అదీ ఆఖరి క్షణంలో దరిచేర్చుకుని మరీ టిక్కెట్లు ఇచ్చేసింది. దాంతో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు అలకపాన్పు ఎక్కారు. కాంగ్రెస్ పార్టీలో మమేకమైన మండలి కుటుంబానికి చెందిన బుద్ధప్రసాద్‌కు అవనిగడ్డ తెదేపా సీటు లభించింది. బుద్ధప్రసాద్ అక్కడ కాంగ్రెస్ తరపున నాలుగుసార్లు పోటీ చేసి రెండుసార్లు గెలిచారు. ఇదే సమయంలో అంబటి బ్రాహ్మణయ్య, సింహాద్రి సత్యనారాయణరావు వర్గాలతో వైరం కూడా లేకపోలేదు. బుద్ధప్రసాద్‌కు సీటు కోసం చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే అంబటి హరిప్రసాద్‌ను పక్కనపెట్టారు. గన్నవరం కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు ఆఖరి క్షణంలో నూజివీడు తెదేపా సీటు లభించింది. గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) వైకాపాలోకి వెళ్లటంతో గత ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున పోటీచేసిన రావి వెంకటేశ్వరరావును దరిచేర్చుకుని సీటిచ్చారు. ఇక బిజెపి నేతలు పొత్తుల్లో తమకు లభించిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ను అర్ధరాత్రి వేళ పార్టీలో చేర్చుకొని తెల్లవారేసరికి నామినేషన్ దాఖలు చేయించారు. దాంతో తెదేపాలో, బిజెపిలోనూ తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. కైకలూరులో కూడా గత ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున పోటీచేసిన కామినేని శ్రీనివాసరావును హడావుడిగా పార్టీలో చేర్చుకుని సీటిచ్చారు. తెదేపాకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ రెబల్‌గా నామినేషన్ దాఖలు చేశారు. నూజివీడు సీటు కోసం ఆఖరి క్షణం వరకు ఎదురుచూసిన మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్, తెలుగుదేశం జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు నాయకత్వంపై అలిగి కూర్చున్నారు. దీని ప్రభావం మచిలీపట్నంలో పొడచూపనుంది. గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావును కాదని వివాదాస్పదుడైన వల్లభనేని వంశీమోహన్‌కు సీటివ్వడంపై దాసరి వర్గం గుర్రుగా ఉంది. మరోవైపు ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ ఆఖరి క్షణం వరకు జిల్లా నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. ఇందుకోసం పెనమలూరు, విజయవాడ తూర్పు సీట్ల కేటాయింపులో అంతులేని జాప్యం జరిగింది. దీనివల్ల కూడా పార్టీ ఎంతోకొంత మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఎన్టీఆర్ తనయ పురంధ్రీశ్వరి పొత్తులో భాగంగా విజయవాడ పార్లమెంట్‌కు బిజెపి తరపున పోటీకి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ పరిస్థితులన్నీ తెలుగుదేశంలో ముందెన్నడూ లేనివిధంగా గందరగోళ పరిస్థితుల్ని సృష్టించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: