సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విమర్శనాల పదును పెంచుతూ చెలరేగిపోతు న్నారు. ఇప్పటిదాకా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు, ప్రత్యేకించి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య టార్గెట్‌గా తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చిన ఆయన, ఇక తన దాడిని ఏఐసీసీ నాయకత్వంపైనే కేంద్రీకరించనున్నట్టు కనిపిస్తున్న ది. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమా రుడు రాహుల్ గాంధీ పైనే విమర్శలు ఎక్కుపెడు తూ తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వాన్ని ఇరకా టంలో పడవేసే వ్యూహాన్ని కేసీఆర్ అందుకున్నట్టు గత రెండు, మూడు రోజులుగా ఆయన ప్రసంగాలు చూస్తే అనిపిస్తున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోనియా, రాహుల్ విమర్శలపై... తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో టీఆర్‌ఎస్ పాత్ర ఏమీ లేదంటూ సోనియా గాంధీ, కేసీఆర్ నెంబర్ వన్ వెన్నుపోటు దారు అంటూ రాహుల్ గాంధీ గత కొద్ది రోజుల వ్యవధిలో చేసిన విమర్శలు టీఆర్‌ఎస్ నేతలను కాస్త ఇబ్బందుల్లో పడవేశాయి. తెలంగాణ విషయంలో తాము చెప్పిందే చేశామని, జూన్ రెండు నాటికి 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష సాకారం అవుతుందంటూ రాహుల్ సోమవారం పాలమూరులో చేసిన ప్రసంగానికి స్పందన బాగానే రావటంతో ఇక ఉపేక్షిస్తే లాభం లేదన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టు చెబుతున్నారు. తాను కాంగ్రెస్‌తోనే ఉంటానని కేసీఆర్ చెప్పారని, తన నివాసంలో లోపల ఒక మాట మాట్లాడి, బయటకు వచ్చి మాట మార్చారంటూ రాహుల్ గుప్పించిన విమర్శల ఫలితంగా ప్రజల ఆలోచన మారే ప్రమాదం ఉందని, ఈ పరిస్థితిలో నష్ట నివారణ చర్యలు చేపట్టటం ద్వారా మళ్ళీ పరిస్థితిని టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మార్చుకోకపోతే కష్టమవుతుందన్న ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దూకుడు వెనుక వ్యూహం అదే... మంగళవారం వరంగల్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్, ప్రత్యేకించి రాహుల్ గాంధీ విమర్శల పైనే దృష్టి సారించారు. విలీనం చేస్తానని తానేమీ కాగితం రాసి ఇవ్వలేదని, విలీనం చేస్తానని మాట ప్రస్తావనగా 2012లో తాను అన్నపడు తెలంగాణ ఎందుకు ఇవ్వలేదంటూ రాహుల్ బాణాన్ని మళ్ళీ ఆయనపైకే విసిరే ప్రయత్నం చేశారు. తెలంగాణ సాధన విషయంలో టీఆర్‌ఎస్ పాత్ర ఏమీ లేదంటూ కొద్ది రోజుల క్రితం సోనియా గాంధీ కరీంనగర్ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై కూడా కేసీఆర్ వెంటనే స్పందించారు. టీఆర్‌ఎస్ పాత్ర ఏమీ లేదన్నది వాస్తవమే అని, ఒకవేళ ఉండి ఉంటే ఇలాంటి తెలంగాణ వచ్చి ఉండేది కాదని చురకలు అంటించారు. సోనియా, రాహుల్ మాత్రమే కాకుండా కేంద్రమంత్రి జైరాం రమేశ్, పాలమూరు లోక్‌సభ అభ్యర్థి ఎస్.జైపాల్‌రెడ్డి వంటి వారిని కూడా కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారు. జైరాం రమేశ్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి ఇపడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని, సర్పంచ్ పదవికి కూడా ఎన్నికయ్యే స్థాయిలేని జైరాంకు తనను విమర్శించే అర్హత లేదంటూ దుయ్యబట్టారు. ఇక టీఆర్‌ఎస్ చిల్లర దుకాణం అంటూ జైపాల్ చేసిన విమర్శలను కూడా కేసీఆర్ వదలిపెట్టలేదు. చిల్లర దుకాణం అయితే 2004లో పొత్తు కోసం ఎందుకు వెంపర్లాడారంటూ ధ్వజమెత్తారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కేసీఆర్ ఇంకా వెంటాడుతూనే ఉన్నారు. సోమవారం జరిగిన సభల్లో పొన్నాల తనను విమర్శించటం మానుకోవాలని, లేని పక్షంలో నాలుక కోస్తానని తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు. భయం పట్టుకుందా?... కేసీఆర్ తన మాటల దాడిని రోజు రోజుకూ పెంచుతూ పోవటానికి కారణాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో ఈసారి ఎన్నికలు పూర్తి ఏకపక్షంగా, తమకు అనుకూలంగా ఉంటాయని కేసీఆర్ భావించిన మాటవాస్తవం. అందుకే చిట్ట చివరి నిముషం దాకా పొత్తుల విషయంలో మల్లగుల్లాలు పడినప్పటికీ, చివరకు ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. గట్టి పోటీ తప్పదని అంతా అంటున్నప్పటికీ వినకుండా గజ్వేల్ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. మెదక్ లోక్‌సభ స్థానానికీ నిలిచారు. హెలికాప్టర్‌ను మాట్లాడుకుని సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇదంతా ఎన్నికలు ఏకపక్షంగా ఉంటాయన్న ఆలోచననుంచి ఆయన క్రమంగా బయటపడుతున్నారనటానికి సంకేతాలు అని, టీడీపీ, బీజేపీ పొత్తు క్రమంగా తెలంగాణ ప్రాంతంలో బల పడుతుండటం, సోనియా, రాహుల్ సభలకు ఊహించని రీతిలో జనం వస్తుండటం, తెలంగాణ జిల్లాలలో నరేంద్ర మోడీ సుడిగాలి సభల వంటివన్నీ కేసీఆర్ ధీమాను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నాయని, అందుకే ఆయన ఇతర పార్టీ నేతలపై వ్యక్తిగత దూషణలు, విమర్శలకు పాల్పడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: