ఆర్. కృష్ణయ్య తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సీఎం అభ్యర్థి. ఈ విషయాన్ని డైరెక్ట్ గా ప్రకటించలేదు కానీ... తెలుగుదేశం అధినేత తెలంగాణకు బీసీలను సీఎంను చేస్తానని అనడం, అదే సమయంలో కృష్ణయ్య టీడీపీలో చేరడం, అయన తరపున వివిధ బీసీ సంఘాల వాళ్లు మాట్లాడటం, బాబు బీసీని సీఎం ను చేస్తానని అంటే బీసీ సంఘాల వాళ్లు కృష్ణయ్యను సీఎం చేయాలని సూచించారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ లో ఆర్. కృష్ణయ్య ప్రస్థానం మొదలైంది. కొంతమంది తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలు కృష్ణయ్యను టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేర్కొనడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినా ఎలాగూ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు కాబట్టి అభ్యర్థి ఎవరైతే ఏముందిలే అని అందరూ సర్దుకుపోయారు. టీటీడీపీ నేతలు అలా సర్దకుపోయినా ఇప్పుడు ఎల్బీ నగర్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ఆర్.కృష్ణయ్యకు చుక్కలు కనిపిస్తున్నాయట. అక్కడ ఆయనకు విజయావకాశాలు అంతగా లేవని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పుత్తాప్రతాప్ రెడ్డి లు పోటీలో ఉన్నారు. పెద్ద ఎత్తున సెటిలర్స్ ఉన్న ఈ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి కూడా విజయం మీద ఆశలు పెట్టుకొన్నట్టు తెలుస్తోంది. తాజాగా షర్మిల ప్రచార సభ కూడా సూపర్ హిట్ కావడంతో పుత్తాకు విజయం మీద ఆశలు పెరిగాయి. ఇక సుధీర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. ఈ మధ్య కొందరు సుధీర్ రెడ్డి వర్గీయులు టీఆర్ఎస్ వైపు వెళ్లిపోయారు. దీంతో ఇక్కడ చతుర్ముఖ పోటీ నెలకొంది. టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య భారీ ఓట్ల చీలిక ఉండటం ఖాయమైంది. ఇక కృష్ణయ్యకు స్థానిక టీడీపీ నేతల నుంచి ఏ మాత్రం సహకారం లేదని తెలుస్తోంది. నామినేషన్ రోజునే కృష్ణయ్య పై దాడికి దిగారు తెలుగు తమ్ముళ్లు. అలాంటి చోట ఆయన గెలవడానికి వారు సహకరించని అప్పుడే స్పష్టమైంది. ఇటువంటి నేపథ్యంలో బీసీ ఉద్యమకారుడిగా ఎంతో పోరాట నేపథ్యం ఉన్న కృష్ణయ్య ఎమ్మెల్యేగా పోటీకి దిగి కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాడని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: