బీజేపీ, కార్పేరేట్ మీడియా దేశమంతా మోడీ ప్రభంజనం వీస్తోందని చెపుతున్నాయి. కొన్ని సర్వేలైతే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి 230కిపైగా స్థానాలు గెలుచుకుంటుందని ప్రకటించింది. అయితే మోడీ ప్రభంజనం గురించి వినిపిస్తున్న ఈ ప్రచారంలో నిజమెంత? అనే సందేహం వస్తోంది. కాంగ్రెస్, వామపక్షాలు, ఎస్పీ లాంటి పార్టీలైతే ఇదంతా మీడియా ప్రచారమని తేల్చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఆరవింద్ కేజ్రీవాల్ అయితే ఏకంగా మీడియా మోడీకి అమ్ముడు పోయిందని విమర్శించారు. నరేంద్రమోడీని పైనుంచి దిగివచ్చిన పరమాత్ముడిలా చూడ్డం పట్ల ఆర్.ఎస్.ఎస్ కూడా చాలా అసంతృప్తితో ఉంది. ఇక మోడీ ప్రభంజనం గురించి దిక్కులు అదిరిపోయేట్టు అరుస్తున్న విశ్లేషకులు.. బీజేపీకి అన్నేసి సీట్లు ఎక్కడి నుంచి వస్తాయనుకుంటున్నారో చెప్పలేక పోతున్నారు. 2004లో కూడా బిజెపి ప్రభంజనం ఉందనీ ఆ పార్టీకి 300కి పైగా సీట్లు వస్తాయనీ చాలా మంది జోస్యం చెప్పారు. తీరా గెలిచింది 135 సీట్లే. మిత్రపక్షాలతో కలిసి 185. బిజెపీకి బ్రహ్మాండమైన మద్దతు ఉందని అరుస్తున్న వారంతా ఈసారి ఆ పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 272 స్థానాలు గెలుస్తుందని ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే ఎలా అన్నదే ప్రశ్న. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో సుమారు 300 స్థానాల్లో బిజెపికి దాదాపు బలం లేదనే చెప్పాలి. 2009లో కాంగ్రెస్ 440, బిజెపి 433 స్థానాల్లో పోటీ చేశాయి. వీటిలో 350 చోట్ల కాంగ్రెస్‌కు ఒకటి లేదా రెండవ స్థానం లభించగా బిజెపికి కేవలం 226 చోట్ల మాత్రమే ఒకటి లేదా రెండో స్థానం లభించింది - అంటే 100 సీట్లు తేడా! అందరూ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలుపు గురించి మాట్లాడుతున్నారు. 2009 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, గుజరాత్ రాష్ట్రాల్లో గెలిచింది. ఆ గెలుపు దేశవ్యాప్తంగా ప్రభంజనంగా మారలేదు. అంతేకాదు, అసెంబ్లీలోనూ, సార్వత్రిక ఎన్నికల్లోనో ఓటింగ్ సరళి వేరు వేరుగా ఉంటుంది. అది ఎలాగో రాష్ట్రాల వారీగా విశ్లేషిద్దాం.గత పదేళ్ళలో బిజెపి ఉత్తరప్రదేశ్లో పది సీట్ల కన్నా ఎక్కువ గెలవలేదు. వారి కరడుగట్టిన హిందుత్వ వాదన తమకు పనికిరాదని అక్కడి ప్రజలు స్పష్టం చేశారు. ఇక బీహార్లో ఆ పార్టీకి అసలు ఉనికే లేదు. పోయిన సారి ఇక్కడ జెడి(యు) మాత్రమే తన సత్తా చాటుకుంది. ఇప్పుడు నితీష్ కుమార్ మద్దతు ఉపసంహరించుకోవడంతో బిజెపి పరిస్థితి మళ్ళీ అగమ్యగోచరంగా మారింది. రామ్ విలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జన శక్తి పార్టీతో జట్టుకట్టినా బీజేపీ లక్ మారుతుందనే గ్యారెంటీ ఏమీ లేదు. బీహార్ ముస్లింలు ఈ సారి వ్యూహాత్మకంగా బీజేపీ అభ్యర్ధులను ఓడించేలా ఓటేయబోవడం కూడా ఆ పార్టీని భయపెడుతోంది. పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో బిజెపి పరిస్థితి సున్నా. 2009లో పశ్చిమ బెంగాల్లోని 42 స్థానాల్లో బీజేపి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇరవై ఒక్క సీట్లున్న ఒడిశాలో కూడా ఒక్క సీటూ లేదు. ఆంధ్రప్రదేశ్లో 42 సీట్లలో ఒక్కటీ గెలవలేదు. తమిళనాడు, కేరళలోనూ ఇదే పరిస్థితి. యడ్యూరప్ప పుణ్యమాని ఒక్క కర్నాటకలో మాత్రమే 18 స్థానాలు గెలుచుకోగలిగింది. తమిళనాడులో ఆరు పార్టీలతో, ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీతో కుదిరిన ఎన్నికల పొత్తులు.. దక్షిణాదిలో ఈ సారి తమ లక్ మారుస్తాయని బీజేపి కొండంత ఆశలు పెట్టుకుంది. హర్యానా, జమ్మూకాశ్మీర్లో కూడా బీజేపీ పరిస్థితి అంతంత మాత్రమే. బిజెపికి ఏమైనా వస్తేగిస్తే ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల నుంచి రావాలి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సరళికి ఏ మాత్రం తేడాగా ఓటింగు జరిగినా పార్టీ పరిస్థితి గల్లంతే! 2009లో సుమారు 140 స్థానాల్లో కాంగ్రెస్, బిజెపిల మధ్య ముఖాముఖి పోటీ జరిగింది. ఇందులో కాంగ్రెస్‌కు, బిజెపి కన్నా 26 స్థానాలు ఎక్కువ వచ్చాయి. మిగతా స్థానాలన్నిటిలో పోటీ ప్రధానంగా కాంగ్రెస్ - ప్రాంతీయ పార్టీల మధ్యనే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోటల్లా బిజెపి గెలుపు అవకాశాలు శూన్యమనే చెప్పాలి. 2009లో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని అన్నారు. 2004లో 138, 2009లో 116 సీట్లు మాత్రమే పొందిన బిజెపి ఇప్పుడు ఒక్కసారిగా 272 సీట్లు ఎలా గెలుస్తుంది..? న్యాయబద్ధమైన విశ్లేషణ ఏమీ లేకుండా ఎవరికి ఇష్టమొచ్చినట్టు వారు బీజేపీ కూటమి మెజారిటీ సీట్లు గెలచుకోవడం ఖాయమంటున్నారు. మీడియా కూడా, బీజేపీ గెలుపును ముందే ఊహించుకుని,' ఆ పక్షానికి ' వత్తాసు పలుకుతూ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తోంది. రానున్న తరాల కోసమైనా మీడియా మంచి ప్రవర్తన నేర్చుకోవాలన్న సంగతిని మనం గుర్తుంచుకోవాలి. సర్వేలన్నీ ప్రతికూలంగా ఉండడంతో కాంగ్రెస్ పెద్దల్లోనూ ఒక రకమైన నిస్పృహ కనిపిస్తోంది. పైకి మేక పోతు గాంభీర్యం ప్రదర్శించినా.. సర్వేల ఫలితాలు ఎక్కడ నిజమవుతాయోనని కాంగ్రెస్ పెద్దలు భయపడి పోతున్నారు. 2004, 2009 ఎన్నికల్లోనూ బీజేపీ ఇలానే అత్యుత్సాహానికి పోయి భంగపడింది. మన్మోహన్ సింగ్ బలహీన ప్రధాని అంటూ అద్వానీ ఎన్ని విమర్శలు చేసినా.. ఓటర్లు పట్టించుకోలేదు. దేశానికి తిరుగులేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానన్న అద్వానీ హామీలను కూడా ఓటర్లు నమ్మలేదు. దేశంలో ఇప్పుడూ అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. 2004లో భారత్ వెలిగిపోతోంది అన్న ప్రచారం కూడా బెడిసి కొట్టింది. ప్రజలంతా చిన్నపిల్లల్లా, చేతిలో ఉన్న మంత్ర దండం తిప్పితే అధికారం చేజిక్కించుకోవచ్చన్న కోరిక తీరుతుందనుకున్నారు బీజేపీ నేతలు అప్పట్లో. ఆ ఎదురు దెబ్బల నుంచి బీజేపీ ఇపుడు కొద్దిగా గుణ పాటం నేర్చుకున్నట్టే కనిపిస్తోంది. యూపీఏ ప్రభుత్వ అవినీతి కుంభకోణాలు, అసమర్ధ పాలననే అస్త్రాలుగా చేసుకుని ప్రచారం చేస్తున్నారు. గతంలో రామజన్మభూమి అంశాన్ని తలకెత్తుకుని బలపడిన బీజేపీ ఇపుడు దానిపై కూడా మాట మార్చింది. లౌకిక పార్టీలకు చేరువయ్యేందుకు ఇపుడు.. రాజ్యాంగానికి లోబడే అయోధ్యలో రామజన్మ భూమి అంటోంది. ఒకప్పుడు రామమందిరం తప్ప ససేమిరా అన్న మోడీ ఇపుడు.. రామమందిరం కంటే మరుగుదొడ్లు ముఖ్యమంటున్నారు. కేజ్రీవాల్ 'నేను ఆమ్ ఆద్మీ' అంటుంటే, మోడీ మాత్రం నేను అభివృద్ధి నాయకుడ్ని అంటున్నాడు. వీటికి తోడు మోడీ సామాజిక నేపధ్యం కూడా ఇపుడు ఎన్నికల ప్రచారంలో ఒక అస్త్రంగా మారింది. వేషాలు వేయడం అందరికీ అలవాటై పోయింది. జనాలను ఆకర్షించడానికి ఏదో ఒక అవతారం ఎత్తాలి. ఆశపడ్డంలో తప్పులేదు; కానీ నిస్పృహతో కూడిన చర్యలు మంచిది కాదు. డబ్బు సంచుల్ని, బాలట్ పెట్టెలు ఓడిస్తాయని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: