రాజకీయాలకు ఏదీ అతీతం కాదు. ఈ విషయం టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలిసినంతగా ఇతరులకు తెలియదంటే అందులో అతిశయోక్తి ఏమాత్రం లేదు. సీమాంధ్రలో బీజేపీకి ఇచ్చిన స్థానాల్లో స్వయంగా తనే రెబల్స్ ను బరిలోకి దించడం ఇందుకు తాజా ఉదాహరణ. నామినేషన్ల గడువు ముగిసినా.. వారు మాత్రం బరిలోనే ఉండడంతో బీజేపీ అభ్యర్థులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. తెలంగాణలో మోడీతో కలిసి, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు 24 గంటలు గడవకముందే పార్టీ రెబెల్స్ తో కలిసి ఇలా షాక్ ఇవ్వడాన్ని కమలనాధులు డబుల్ గేమ్ గా అభివర్ణిస్తున్నారు. కానీ.. బాబు మార్క్ రాజకీయం అంటే ఇదేనని విశ్లేషకులు అంటున్నారు. బాబు వెన్నుపోటు రాజకీయం చేశారంటూ ప్రతీ సభలోనూ జగన్, షర్మిలా, విజయమ్మ తప్పని సరిగా ప్రస్తావించడం ఆనవాయితీగా మారింది. వీరి విమర్శలకు తగ్గట్టు చంద్రబాబు వ్యవహారశైలి కూడా ఉంటోందన్న వాదన వినిపిస్తోంది. నమ్ముకున్న సీనియర్ నేతలకు ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారని నిన్నటి వరకు సొంత పార్టీ నాయకులే దుమ్మెత్తి పోశారు. ఇప్పుడు మిత్రపక్షం బీజేపీ తరపున సీమాంధ్ర నుంచి పోటీచేసే అభ్యర్ధులు కూడా ఈ విమర్శకు వంతు పాడుతున్నారు. సీమాంధ్రలో బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు కుదిరిన రోజు నుంచి చంద్రబాబు ఏదో ఒక మెలిక పెడ్తున్నారని కమలనాధులు మండిపడుతున్నారు. తెలంగాణ వరకు పొత్తుపై సానుకూలంగా కనిపించిన చంద్రబాబు సీమాంధ్రలో మాత్రం ప్రతి సీటు విషయంలోఆచి, తూచి అడుగేస్తున్నారు. బీజేపీకి కేటాయించిన 15 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఆ పార్టీ బలహీన అభ్యర్ధులను బరిలోకి దింపిందనే నెపంతో సీమాంధ్రలో పొత్తు ఉండదని చంద్రబాబు పెద్ద రాద్ధాంతం చేశారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు వద్దని ఆ ప్రాంత బీజేపీ నేతలు నెత్తి, నోరు బాదుకున్నా.. వినకుండా ఆ పార్టీ హైకమాండ్ సయోధ్యకు సై అంది. తెలంగాణ లో నామినేషన్ల పర్వం పూర్తయిన వెంటనే చంద్రబాబు తన మార్క్ రాజకీయం మొదలుపెట్టారనే ప్రచారం జరుగుతోంది. సీమాంధ్రలో బీజేపీతో నామమాత్రంగా పొత్తు కుదుర్చుకున్న చంద్రబాబు సీట్ల కేటాయింపు విషయంలో చేసిన రచ్చకు ఇచ్చాపురం సీటును వదులుకునేందుకు కమలనాధులు సిద్ధపడ్డారు. బీజేపీకి వేరే గత్యంతరం లేదని గ్రహించిన చంద్రబాబు ఇష్టానుసారం రెబెల్స్ కి బీ ఫాంలు ఇచ్చి, నామినేషన్లు దాఖలుచేయించారు. వీరిలో సంతనూతలపాడు, కడప, గుంతకల్లు నియోజకవర్గాల్లో టీడీపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని వారికి నచ్చజెప్పేందుకు టీడీపీ హైకమాండ్ ఎలాంటి చొరవ చూపలేదు. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి ఈ ముగ్గురు టీడీపీ రెబెల్స్ బరిలోనే ఉన్నారు. వీరి ద్వారా బీజేపీ అభ్యర్ధుల విజయావకాశాలు దెబ్బతింటాయనడంలో సందేహం లేదు. తెలంగాణ ప్రాంతంలో మోడీతో కలిసి, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు 24 గంటలు గడవకముందే పార్టీ రెబెల్స్ తో బీజేపీకి చెక్ పెట్టడాన్ని కమలనాధులు డబుల్ గేమ్ గా అభివర్ణిస్తున్నారు. సొంత కూతుర్నిచ్చి పెళ్లి చేసిన ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన బాబు, తమ పార్టీ అభ్యర్ధులను వెన్నుపోటు పొడవడంలో పెద్ద ఆశ్చర్యం లేదని కమలనాధులు వాపోతున్నారు. కూటమి ధర్మాన్ని మరచి, చంద్రబాబు అనైతికంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఎవ్రీ తింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్ అన్నఇంగ్లీష్ నానుడికి తగ్గట్టు రాజకీయాలకు ఏదీ అతీతం కాదనే నిజాన్ని చంద్రబాబు నిరూపించి చూపించారని విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: