గ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో టైటానియం ఖనిజం తవ్వకాలకు అనుమతించడానికి 1.85 కోట్ల డాలర్లను ముడుపులు చెల్లించిన అంతర్జాతీయ కుట్రతో సంబంధమున్నట్లు అమెరికా కోర్టు అభియోగాలు నమోదు చేసిన నేపథ్యంలో కెవిపి రామచంద్రరావును ‘సూత్రప్రాయంగా అరెస్టు’ చేయాలని కోరుతూ అమెరికా భారత ప్రభుత్వాన్ని ఒక లేఖ రాసింది. ఇంటర్ పోల్ ద్వారా అమెరికాకు చెందిన నేషనల్ క్రైమ్ బ్యూరో ఈ లేఖ పంపింది. దౌత్య యంత్రాంగం ద్వారా భారతదేశానికి అన్ని పత్రాలను అందచేసేవరకు కెవిపిని సూత్రప్రాయంగా అరెస్టు చేసి ఉంచాలని అమెరికా అధికారులు ఆ లేఖలో కోరారని అధికార వర్గాలు తెలిపాయి. కెవిపిపై చర్య తీసుకోవాలని కోరుతూ సిబిఐ ఆ లేఖను ఆంధ్రప్రదేశ్ పోలీసులకు పంపించినట్లు వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లోని టైటానియం ఖనిజ నిక్షేపాల తవ్వకాలకు అనుమతి కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులకు 1.85 కోట్ల డాలర్ల ముడుపుల చెల్లింపులకు సంబంధించిన ఈ అంతర్జాతీయ కుంభకోణంతో ప్రమేయమున్నట్లు అమెరికా కోర్టులో అభియోగాలు ఎదుర్కొంటున్న కెవిపి రామచంద్రరావుపై ‘రెడ్ కార్నర్ నోటీసు’ను జారీచేయవలసిందిగా ఇంటర్ పోల్‌ను ఇదివరకే కోరినట్లు అమెరికా అధికారులు సిబిఐకి తమ లేఖలో తెలిపారు. 2013 జూన్‌లో ఎఫ్‌బిఐ అమెరికా ఫెడరల్ కోర్టుకు సమర్పించిన తన దర్యాప్తు నివేదికను ఈ నెల 3వ తేదీన చికాగో కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అప్పటి ప్రభుత్వ సలహాదారు అయిన 65 సంవత్సరాల కెవిపి రామచంద్రరావుతోపాటు మరో ఐదుగురు వ్యక్తులపై అభియోగాలు నమోదయ్యాయి. కెవిపిని సంప్రదించడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఇతరులు: హంగేరి వ్యాపారి ఆండ్రాస్ నాప్(75), ఉక్రెయిన్ దేశస్థుడు సురేన్ గెవోర్గియాన్(40), అమెరికాలో శాశ్వత నివాసి, భారతీయ సంతతికి చెందిన గజేంద్ర లాల్(50), శ్రీలంకకు చెందిన పెరియసామి సుందరలింగం(60). మరో నిందితుడు ఉక్రెయిన్ జాతీయుడైన 48 ఏళ్ల డిమిట్రి ఫిర్తాష్‌ను మార్చి 12న వియన్నాలో అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: