ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరాకు ఎన్నికల వేళ మరో షాక్ తగిలింది. కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిలిచిన దేవేంద్రప్ప బుధవారం అనూహ్య పరిణామాల మధ్య తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో దుర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల బరిలో లేకుండా పోయారు. నామినేషన్ ఉపసంహరణ అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన దేవేంద్రప్ప వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. అంతేగాక ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానని ప్రకటించారు. దేవేంద్రప్ప చర్యతో కాంగ్రెస్ శ్రేణులు అవాక్కయ్యాయి. రఘువీరారెడ్డి ప్రస్తుతం కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన సొంత నియోజకవర్గం మడకశిర ఎస్‌సిలకు రిజర్వు కావడంతో దుర్గం వలస వచ్చి గెలుపొందారు. విభజన నేపధ్యంలో రఘువీరా దుర్గం వీడి ఘువీరా పెనుకొండ నుంచి పోటీ చేస్తున్నారు. ఓటమి భయంతోనే రఘువీరా దుర్గం వీడారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి తరుణంలో దుర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో విమర్శలకు బలం చేకూరినట్టయింది. ఇదిలా ఉండగా తెలుగుదేశం, బిజెపి పొత్తులో భాగంగా కమలనాథులకు జిల్లాలో కేటాయించిన గుంతకల్లు స్థానం నుంచి రెండు పార్టీల అభ్యర్థులు రంగంలో నిలిచారు. ఇక్కడి నుంచి రెండు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆఖరి నిమిషం వరకూ రెండు పార్టీల నేతల మధ్య చర్చలు జరిగినా ఫలితం తేలలేదు. దీంతో ఇక్కడ పొత్తు బెడిసికొట్టింది. రాప్తాడు నియోజకవర్గంలో దివంగత నేత పరిటాల రవీందద్రకు అత్యంత సన్నిహితుడైన రాజ నరేంద్ర స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈయనను పోటీనుంచి తప్పించేందుకు పరిటాల వర్గం ఆఖరి నిమిషం వరకూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: