ప్రత్యేక రాష్ట్ర ప్రకటనతో తెలంగాణలో ఎదురుండదని భావించిన కాంగ్రెస్ పార్టీకి తాజా పరిస్థితులు మింగుడుపడటంలేదు. అనుకున్నదొక్కటీ.. అయినది ఒక్కటి అన్నట్టు పరిస్థితి తయారవడంతో, సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాలనే యోచనలో పడింది. ఎలాగైనా తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పావులుకదుపుతోంది. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తుండటంతో రాజకీయ పార్టీల్లో గుబులు మొదలైంది. ప్రచారంలో దూసుకెళ్తున్న పార్టీల నేతలు ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా టీ కాంగ్రెస్ కు పక్కలో బల్లెంలా తయారైన టీఆర్ఎస్ జోరుపెంచడంతో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంలో ఆందోళన మొదలైంది. తెలంగాణ ఇచ్చింది మేమేనని ప్రచారం చేసుకుంటున్నా.. టీఆర్ఎస్ జిమ్మిక్కులతో తెలంగాణలో సర్కారు ఏర్పాటుకు మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోతే పరిస్థితి ఏమిటి అన్న కలవరం ఆ పార్టీలో మొదలైంది. వచ్చే ఎన్నికల్లో పూర్తి మెజార్టీకాకపోయినా అతి పెద్ద సంఖ్యా బలం ఉన్న పార్టీగా అవతరిస్తుందన్న ఆశతో ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, తమతో భాగస్వామ్యమై దిగుతున్న పార్టీ అభ్యర్థుల గెలుపు అవకాశాలు ఏమేర ఉన్నాయన్న దానిపై ఒక అంచనాకు కాంగ్రెస్‌ అధినాయకత్వం వచ్చినట్టు తెలుస్తోంది. ఫలితాల అనంతరం సర్కారు ఏర్పాటుకు పార్టీకి పూర్తి మెజార్టీ వస్తే సరి లేకుంటే, తమకు భాగస్వామ్యంగా వచ్చి సర్కారు ఏర్పాటుకు ఏ పార్టీ సహకరించగలదన్న దానిపై అధినేతలు ఆరాతీస్తున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో టిఆర్‌ఎస్‌ తమ పార్టీలో విలీనం అయితే ఎదురే ఉండదని భావించిన అధిష్టానానికి కేసీఆర్ షాకిచ్చారు. టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ విలీనా నికే కాదు పొత్తు కూడా నై అనడంతో కంగుతిన్న కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌, ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టింది. సామాజిక తెలంగాణ నినాదం ఎంచుకొంది. అయితే, తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్‌ అన్న వాదాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో స్థానికంగా తమ పార్టీ నాయకత్వం విఫలమైందనే భావన ఆ పార్టీ హైకమాండ్‌ లో ఉంది. పైకి సర్కారు ఏర్పాటు చేసేది తామేనని చెప్పినా.. మ్యాజిక్‌ ఫింగర్‌కు చేరుకొంటామా అన్న ఆందోళన ఆ పార్టీ నాయకత్వంలో నెలకొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమతో కలిసొచ్చే పార్టీలకు మద్దతిచ్చిన కాంగ్రెస్ ఆ పార్టీ అభ్యర్థుల విజయ అవకాశాలుపైనా అంచనాలు వేసుకుంటోంది. మిత్రపక్షాలైన సీపీఐ, ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో ఓటర్ నాడిని తెలుసుకునే పనిలో పడింది కాంగ్రెస్. ఎన్నికల అనంతరం ఫలితాలు వెలువడ్డాక సర్కారు ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ వస్తే సరి లేకపోతే వెనువెంటనే సర్కారు ఏర్పాటుకు అవకాశం ఉండేలా ఇతర భాగస్వామ్య పక్షాలను ఇప్పటినుంచే తయారు చేసుకోవాలని కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తోంది.ఏ పార్టీ మద్దతు లేకుండానే తెలంగాణలో అధికారంలోకి వస్తామని భావించిన టీ కాంగ్ నేతలకు కేసీఆర్ షాక్ తో ఇప్పుడే భవిష్యత్ కనిపిస్తోంది. దాంతో రాజకీయ వ్యూహాలపై ఇప్పటినుంచే కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం.

మరింత సమాచారం తెలుసుకోండి: