ఓ పక్క సర్వేలు..అంచనాలు. మరోపక్క మీడియా వెన్నుదన్ను..ఇంకో పక్క పొలోమంటూ వలస వచ్చిన నేతలు.. మరోపక్క బిసి నాయకుడే పార్టీలోకి వచ్చిన వైనం. ఇన్ని వుండి, ఇక విజయం తమదే, అధికారం తమదే అనుకున్నంత రేంజ్ లో హడావుడి చేస్తున్న తెలగుదేశం నాయకుడు చంద్రబాబు కూడ భయమేస్తోందా? విజయం అందుతుందా అందదా అని భయపడ్డారా? అందుకే, అంత పెద్ద నేత రాజకీయాల్లో ఓనమాలు కూడా దిద్దుతున్న పవన్ కళ్యాణ్ ఇంటికి పనిగట్టుకు వెళ్లారా?. ఏ సర్వే చూసినా టిడిపిదే విజయం అని చెబుతున్నప్పుడు చంద్రబాబు ఇలా పవన్ కోసం దిగివచ్చి ఆయనే స్వయంగా ఇంటికి వెళ్లడం ఏమిటి. చంద్రబాబు మదిలో ఏదో మూల తన విజయంపై బెంగ ఉండబట్టే, పవన్ ప్రచారం కోసం అంగలార్చుతున్నారన్నది స్పష్టమైపోతోంది. ఓవైపు బాలకృష్ణ లాంటి లెజండ్ ఉన్నారు, ప్రచారంలో దూసుకుపోతున్నారు. అంతే కాదు ప్రచారానికి రమ్మని ఎవరిని పిలవనక్కర్లేదు అని బాహాటంగా బాలయ్య చెప్పారు. మరో వైపు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ప్రచారానికి దిగడానికి రెడీగా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఆయనను మాత్రం చంద్రబాబు పిలవడం లేదు. కాని పవన్ కోసం మాత్రం తనే స్వయంగా ఎందుకు దిగివచ్చారన్నది రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతకు ముందు మోడీ సభల సంధర్బంగా పవన్ చంద్రబాబును ఏమాత్రం పట్టించుకోలేదు. హైదరాబాద్ సభలో వేదికపై తన పక్కన కూర్చోవాలని చెప్పినా పవన్ పట్టించుకోలేదు. తర్వాత సభల్లో కూడా పవన్ టిడిపి మాటనే తన నోట ఎత్తుకోలేదు. అయినా సరే చంద్రబాబే పవన్ వద్దకు వెళ్లారంటే చంద్రబాబుకు భయం పట్టుకున్నదన్నది నిజం. పొట్లూరికి టికెట్ అడిగిన మాట నిజమే అని పవన్ బహిరంగంగానే పేర్కొన్నారు. ఇవ్వకపోవడంతో చంద్రబాబుపై ఆగ్రహం కలిగిందని, పొట్లూరి తనకు దూరం కావడానికి చంద్రబాబే కారణమని పవన్ తన సన్నిహితుల వద్ద వాఖ్యానించినట్టు సమాచారం. అందుకే పవన్ ను మచ్చిక చేసుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారని అనుకోవాలి. కీలకంగా తెలంగాణలో విజయం కోసం పవన్ ను వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో విజయం అంటే భాజపాకు కూడా పనికొస్తుందని కనుక, పవన్ సై అన్నారని వినికిడి. మరి సీమాంధ్ర వ్యవహారం ఏమిటి? జూనియర్ ఇంటిలో మనిషి. ఫోన్ చేసి పిలిస్తే ప్రచారానికి వస్తారు. కానీ అలా కాకుండా పవన్ వెంట పడడం ఏమిటి? అంటే జూనియర్ కంటే పవన్ కు ఇమేజి ఎక్కువగా ఉందా. లేక జూనియర్ ను పూర్తిగా పక్కన బెట్టేందుకు పవన్ ను దగ్గర తీయాలని చూస్తున్నారా ?. మొత్తానికి గెలుపు నాదే, నన్ను గెలిపించడం సీమాంద్రలో ప్రజలకే అవసరం అని చెప్పుకుంటున్న చంద్రబాబు మాటలు మాత్రం ఈ చర్యతో తుస్సు మన్నాయి. పైకి బీరాలు పలుకుతున్నారే తప్ప సీమాంద్రలో టిడిపికి అంత లేదు అని చంద్రబాబే ఈ చర్యతో నిరూపించుకున్నట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: