పవన్ కల్యాణ్, ఎలియాస్ పీకే, మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయిపోయారు. హైదరాబాదులో జరిగిన మోడీ బహిరంగ సభకు హాజరై 'నమో-నారా'యణ మంత్రం జపిస్తూ, భాజపా-తెదేపా కూటమిని ఎండార్స్ చేశాడు. మొన్నామధ్యన ఓ పార్టీ పెట్టేసి, దానికి 'జనసేన' అని పేరెట్టేసి, "ప్రశ్నించడానికి వస్తోంది" అని మళ్ళీ దానికి క్యాప్షనెట్టేసి ...., ఓ యాభై నుండీ వంద చోట్ల పోటీ చేస్తానని ప్రకటించేసి, ఆనక 'థూచ్'... నేను పోటీకి దిగితే వోట్లు చీలిపోయి గెలిచే పార్టీ ఇబ్బందుల్లో పడిపోతుందని,... కేవలం కూటమిలో చేరి ప్రచారం మాత్రం చేసి పెడతానని, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీలు గెలిచి అధికారంలోకి రావాలని,.... రాష్ట్రాన్ని సరిగ్గా చీల్చలేదు కాబట్టి కాంగ్రేస్ పార్టీని దేశం నుండీ, లక్షల కోట్లు తినేశాడు కాబట్టి జగన్ పార్టీని రాష్ట్రం నుండీ తరిమి కొట్టాలని, .... బీజేపె-టీడీపీలను ఎన్నుకోవాలని పిలుపునిచ్చాడు. పనిలో పనిగా జేపీని గెలిపించడానికి ప్రచారం చేస్తానని అదే ఊపులో చెప్పేశాడు. మళ్ళీ 'థూచ్' మని, 'కూటమి ధర్మం' (?) కాపాడటం కోసం జేపీకి ప్రచారం చేయలేనన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా (ఆ మాటకొస్తే తెలుగు వారు విస్తరించిన మేర ప్రపంచ వ్యాప్తంగా) అసంఖ్యాకమైన అభిమానులను కలిగున్నపవన్ కల్యాణ్ సరిగ్గా ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో, ప్రస్తుత రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని, రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొస్తానని విశేష సంఖ్యలో హాజరైన అభిమానుల సమక్షంలో 'జనసేన' అని గంభీరమైన పేరుతో పార్టీ స్థాపించి, వేగంగా..., రోజుల వ్యవధిలోనే దానిని తెలుగుదేశం పార్టీకి 'భజనసేన'గా మార్చేశాడు. మరింత దానికే పార్టీని పెట్టడమెందుకు? ఘనంగా పార్టీని ప్రకటించి ఎలాంటి విధివిధానాలు, కార్యకలాపాలు చేపట్టక(లేక)పోతే దాని అస్తిత్వం ఉన్నట్టా, లేనట్టా? ఉన్నత ఆశయాలు, లక్ష్యాలతో మొదలుపెట్టిన బ్రహ్మాండ రూప పార్టీని పట్టుమని పది వారాలు కూడా గడవక ముందే అంగుళం పరిమాణానికి కుదించి, కళ్ళ ముందే తరిగి అంతర్ధానమయ్యే తన సినిమా ఆదరణ (వసూళ్ళ)ను తలపించాడు. ప్రస్తుత పార్టీ పరిస్థితి ఏదో సాంకేతిక కారణాలతో ఆగిపోయిన సినిమాను తలపిస్తున్నది. అంతలోనే ఏమయ్యిందో ఏమో రాజకీయాలకు దూరంగా, ... మళ్ళీ కొన్నాళ్ళు సినిమా పనుల్లో బిజీగా గడిపాడు. ఇప్పుడు మళ్ళీ ప్రచార బాధ్యతలు అంటూ, .... ఎంత తిక్కున్నా మరీ ఇలానా అనిపిస్తున్నాడు. అలా, రాజకీయాలలో 'కాల్ షీట్ కేటాయింపు' సంస్కృతిని ప్రవేశపెట్టిన ఆద్య నాయకుడయ్యాడు. పవన్ పార్టీ పెట్టడం, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ఆవశ్యకత గురించి సభాముఖంగా తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టడం, మార్పుకు నడుం బిగించాననడం, అంతలోనే స్వయంగా తనే మారిపోవడం, .... "ఇంతకీ పవనెందుకు ఇలా చేస్తున్నాడు? చేతులారా తనకున్న ఇమేజిని ఎందుకు పాడు చేసుకొంటున్నాడు? లాంచనంగా పార్టీని లాంచ్ చేసి, ఎందుకు ఇతరులకు వోటేయమని ప్రచారం చేస్తున్నాడు? అకస్మాత్తుగా పవనుకు ఏమయింది?" ఇలా పవనాభిమానులు తమ మెదళ్ళను తొలిచివేస్తున్న ప్రశ్నల పరంపరకు పవన్ ఇచ్చిన వివరణతో సమాధానపడలేకపోతున్నారు. తాము అభిమానించే నాయకుడు అమ్ముడుపోయాడని మీడియాలో వచ్చిన కథనాలను జీర్ణించుకోలేకపోతున్నారు. అలా జరగకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నారు. చే గువేరా స్పూర్తి, కమ్యునిస్టు సిద్ధాంతాల (ఎరుపు) దగ్గర మొదలైన పవన్ 'మార్పు' క్రమంగా బీజేపీ (నారింజ)కి, తెదేపా (పసుపు)కి మారుతూ, ఊసరవెల్లులకే పాఠాలు నేర్పుతున్నాడు. ఏడు రంగులను సూచించే ఆంగ్ల అక్షర మాల VIBGYORను, ఎవరికీ అనుమానం రాకుండా అట్నుంచి నరుక్కువచ్చే చందాన, వ్యతిరేక దిశలో రంగులు మారుస్తూ (Red, Orange, Yellow) తన అసలు రంగు బయటపెట్టుకొంటున్నాడు. నియోజక వర్గ స్థాయిలో ఫలితాన్ని ప్రభావితం చేయగలనని నమ్మకమున్న కాస్తా బలమైన నాయకుడు, ఎన్నికల్లో రెబెల్ అభ్యర్థిగా పోటీకి దిగి, తుదికంటా బేరాలు సాగించి చివరి క్షణంలో నామినేషన్ ఉపసంహరించుని మద్దతు ఇచ్చేవాడికి, దాన్నే పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీపెట్టి బేరాలు కుదుర్చుకొని ఆపైన ప్రత్యర్థి పార్టీకే మద్దతు ఇస్తున్న పవనుకు తేడా, .... కిట్టుబాటయిన రేటులోనే తప్ప అవకాశాన్ని సృష్టించుకొని, జనాలకు తమమీద ఉన్న పిచ్చి నమ్మకానికి ఖరీదును తీసుకొనే విషయంలో మాత్రం కాదు అనిపించాడు. తన మాటలకు, చేతలకు మధ్యనున్న మైళ్ల ఎడాన్ని బహిర్గతపరచుకొన్నాడు. ఇదంతా తన సహజ ఆవేశంతో చేసినది కాదనీ, పక్కా స్క్రిప్టు ప్రకారం ఏళ్ళ తరబడి రిహార్సల్ చేసుకొని, సింగిల్ టేకుతోనే ఓకే చేసిన బహి'రంగస్థల రాజకీయ నాటకం' అని వీరాభిమానులు కూడా నమ్ముతున్నారు. ఆర్నెల్లు సాము చేసి మూలనున్న ముసలిదాన్ని కుమ్మినట్లుగా, మొదటి సభ ప్రసంగంలో భాగంగా "కాంగ్రెసు హఠావో" అన్నాడు, మన రాష్ట్రంలో కాంగ్రేసుకు ఇప్పటికే నూకలు చెల్లిపోయాయి, పవనే "కాంగ్రేస్ బచావో" అన్నా, అన్నకు చేదోడుగా నిలబడి ప్రచారం చేసినా ప్రజలు వేయబోయే శిక్ష నుండీ తప్పించలేడు. మలి ప్రచారంలో 'నమో' బీజేపీ అని, తరువాత టీడీపీని గెలిపించడం ప్రజల చారిత్రక అవసరం అని తన మనసులోని భావాన్ని(interview) బయటపెట్టేశాడు. తనేం మాట్లాడినా నడుస్తుందని, తను ప్రశ్నించడానికే కానీ జవాబుదారీగా వ్యవహరించడానికి కాదని, కాంగ్రేస్ 'వారసత్వ' రాజకీయాలను కడిగిపారేశాడు, రాహుల్ గాంధీకి 'అనుభవం' లేదని చాటి, ఆ క్రమంలోనే జగన్ 'అక్రమం'గా సంపాదించాడని, పీవీ చలవ వల్లే సచిన్ 'కోట్లు కూడబెట్టుకోగలిగాడ'నీ, క్రికెట్ టీం లోకి రావాలంటే 'దశలవారీ'గా ఆడి అనుభవం సంపాదించి రావాలని తర్జని చూపిస్తూ హెచ్చరించాడు, విచిత్రంగా మిగతా వేళ్ళు తనవైపే చూపిస్తూండడాన్ని చూసినవారు ఇంత ఘరానాగా రాజకీయ ప్రసంగాలు చేసి, అశేష ప్రజానీకం హాజరయిన సభను తన 'అజ్ఞాన ప్రదర్శనా వేదిక'గా వాడుకొన్నాడని విస్తుబోయారు. "నన్నభిమానించే వారందరూ బీజేపీ-టీడీపీ కూటమికే వోటేయండి" అని ఇంత మాత్రం డైరెక్టుగా చెప్పకుండా, ... పార్టీ పెట్టడాలు, బహిరంగ సభలు, ఇంటర్వ్యూలు, అర్థం కా/లేని పుస్తకాలు అచ్చేయించడాలు, మీడియాలో డబ్బా కొట్టించడాలు, ఇంత హంగామా చేసి రాజకీయ అంగ ప్రవేశం (రంగ ప్రవేశం ఐదేళ్ళ నాడే జరిగిపోయింది) చేస్తున్న ఈ ఆరడుగుల బుల్లెట్టు ఏం 'పీకే' స్తాడో అతనికే తెలియాలి మరి! 'ఇజం' అర్థం కాలేదని జుట్టు పీక్కొనేవారు, గతకొంతకాలంగా పవన్ వేస్తున్న తప్పటడుగులను క్షుణ్ణంగా పరిశీలిస్తే 'నిజం' ఏంటో ఇట్టే బోధపడుతుంది. అదే పవనిజం....

మరింత సమాచారం తెలుసుకోండి: