ప్రస్తుతం ఆళ్ళగడ్డ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి శోభానాగిరెడ్డి దుర్మరణం రాజకీయ వర్గాలను ముఖ్యంగా వైసిపి, టిడిపి వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. శోభానాగిరెడ్డి టిడిపితో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆమె అకాల మృతి వైఎస్‌ఆర్‌సికి పెద్దలోటు. తెలుగుదేశం పార్టీలో ఒక్క వెలుగు వెలిగిన ముఖ్య నేతలు ఒకొక్కరుగా రోడ్ ప్రమాదాలలో ఆకాల మృత్యువాత పడుతుండటం పట్ల తాజాగా మరోసారి ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలలో మృతి చెందిన రాజకీయ నేతలలో టిడిపికి చెందినవారుకానీ, లేక ఆ పార్టీలో పూర్వశ్రమంలో పని చేసినవారే ఎక్కువగా ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటున్నారు. ఇలా ఎందుకు జరగుతుంది? టిడిపి కార్యాలయానికి ఏదైనా వాస్తు దోషం ఉందా? అనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది. లోక్‌సభ స్పీకర్ జిఎంసి బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. అదే పార్టీకి చెందిన మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో జరిగిన ఒక విందు కార్యక్రమానికి హాజరై అర్దరాత్రి వేళ తిరిగి ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్ ప్రమాదంలో మృతి చెందారు. అలాగే లోక్‌సభలో ప్రతిపక్ష మాజీ నాయకుడు, శ్రీకాకుళం మాజీ ఎంపి కింజారపు ఎర్రంనాయుడు విశాఖలో జరిగిన ఒక వివాహా రిస్పెష్షన్‌కు హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా, ఆయన కూడా అర్థరాత్రి పూట జరిగిన రోడ్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాకు చెందిన టిడిపి ప్రముఖుడు, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు లాల్‌జాన్ బాషా గత ఏడాది హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి పూట గుంటూరు వెళ్తుండగా, నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలో జరిగిన రోడ్ ప్రమాదంలో మృతి చెందారు. తాజాగా టిడిపి మాజీ నాయకురాలు, ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలలో కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ అసెంబ్లీకి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న శోభానాగిరెడ్డి బుధవారం రాత్రి జరిగిన రోడ్ ప్రమాదంలో మృతి చెందారు. రోడ్ ప్రమాదాలలో మృతి చెందిన ఇంద్రారెడ్డి, ఎర్రంనాయుడు, లాల్‌జాన్ బాషా, శోభానాగిరెడ్డి తదితరులంతా సీటు బెల్ట్ ధరించకపోవడం, కారులో ఎయిర్ బెలూన్ ఒపెన్ కాకపోవడం వంటి కారణాలే కారణం అయ్యాయి. ఇలా ఉండగా, ప్రమాదాలలో మృతి చెందిన ఇతర పార్టీలకు చెందిన ప్రముఖులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలిక్యాప్టర్ ప్రమాదంలో మృతి చెందగా, బిజెపి రాష్ట్ర నాయకురాలు వనం జాన్సీరాణి రెండేళ్ల కిందట జరిగిన రోడ్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: