ఎన్నికల వేళ వైఎస్ఆర్ సీపీని నాటి వైఎస్ పాలనలో జరిగిన పలు కుంభకోణాలు, అవినీతి స్కాంలు వెంటాడుతున్నాయి. తాజాగా వైఎస్ ఆత్మ కేవీపీ టైటానియం కుంభకోణం వెలుగుచూడటంతో జగన్ పార్టీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే జగన్ పై ఉన్న అవినీతి కేసులను అస్త్రాలుగా చేసుకుని ప్రచారం చేస్తున్న విపక్షాలకు మరో పాశుపతాస్త్రం వచ్చి చేరినట్లయింది. కేవీపీ టైటానియం కుంభకోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఇరుకున పడనుందా అవుననే అనిపిస్తుంది. వైఎస్ పథకాలు, విధానాలు, నాటి పాలననే ప్రచారం చేస్తూ ఎన్నికలకు వెళ్తున్న జగన్ పార్టీకి అప్పటి స్కాంలు, కేసులు, విచారణ భారాన్ని మోయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. సరిగ్గా ఎన్నికల సమయంలో బయటపడిన టైటానియం స్కాం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. వైఎస్ ఆత్మ కేవీపీపై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్ బీఐ కేసు నమోదు చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టినట్లయింది. వైఎస్ పాలనంతా దోపిడీ, కుంభకోణాలే అంటున్న టీడీపీకి ఈ పరిస్థితి అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాములుగా అయితే రాజకీయంగా కొట్టిపారేయొచ్చు కానీ ఇది ఎలక్షన్ సీజన్ కావటంతో జగన్ పార్టీ నేతల్లో వణుకు పుడుతోంది. అందులోనూ ఆధారాలతో సహా బయటపెట్టి నోటీసు జారీ చేసింది ఎఫ్ బీఐ. అందుకే అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. నైతికంగా ఇది వైఎస్ఆర్ సీపీకి కొత్త ఇబ్బందని ఆపార్టీ వర్గాలే భావిస్తున్నాయి. ఓ విధానం, దూరదృష్టి, విభజన తర్వాత అనుసరించాల్సిన వ్యూహం లేకుండా వైఎస్ పాలననే నమ్ముకుని ఎన్నికల ప్రచారానికి దిగటం రాజకీయంగా ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉన్నట్లు ఆపార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు. పైకి మాత్రం కేవీపీ కేసుతో మాకేం సంబంధం అంటూ కొట్టిపారేస్తూ అసలు ఆ విషయమే ప్రస్తావించటం లేదు. కేవీపీ వెనకుండి నడిపించింది వైఎస్సే కాబట్టి పార్టీపై ఆ ప్రభావం పడుతుందనిపిస్తుంది. ఇప్పటికే జగన్ పై కేసులు, విచారణలు, వేలకోట్ల ఆరోపణలతో పీకలోతు కష్టాల్లో మునిగిన సమయంలో ఈకొత్త కుంభకోణం ఎన్నికల వేళ దడ్డపుట్టిస్తోంది. అందుకే ఇప్పుడు పార్టీనేతలు సైతం పరిస్థితిని అంచనా వేస్తూ వ్యూహరచనకు సిద్ధమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: