సత్తా అంతా జేపికేనా... మరెవరికి అవసరం లేదా, అంటే అక్షరాల నిజమే అనిపిస్తోంది. జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా పెట్టినప్పటికి నుంచి ఆయన వైఖరి ఇదే. పేరుకే పార్టీ కాని జేపి తప్ప ఎవరు గెలిచింది లేదు. మరెవరిని గెలిపించుకోవడానికి జేపి చేసిన ప్రయత్నం లేదు. కనీసం తన పార్టీ తరఫున ఇతర అభ్యర్థుల విజయం కోసం తాపత్రయపడింది లేదు. అందునే లోక్ సత్తా అంతా జేపి సత్తానే అన్నది వాస్తవం. ఇప్పటి వరకు లోక్ సత్తా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచింది ఆయన ఒక్కడే. మొదట్లో పార్టీ పెట్టినప్పుడు రాష్ట్రం అంతటా తిరిగారు. తన పార్టీ ఉద్దేశ్యాలు వివరించారు. పార్టీలోకి చాలా మందిని ఆహ్వానించారు. కమిటీలను ఏర్పాటు చేసారు. తనతో పాటు పలు చోట్ల అభ్యర్థులను నిలబెట్టారు. అప్పట్లో కొన్ని చోట్ల తన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసినప్పటికి ఆయన తప్ప ఎవరు గెలవలేదు, ఆయన గెలుపు కోసం కష్టపడ్డంత జేపి మరెవరికోసం కష్టపడలేదు. అప్పటి నుంచి లోక్ సత్తా అంటే జేపి, జేపి అంటే లోక్ సత్తా... ఏక వ్యక్తి పార్టీగానే ఉండిపోయింది. పేరుకు మాత్రం పార్టీలో ప్రజాస్వామ్యం. ఈ మద్యనైతే లోక్ సత్తాను ఏకంగా జాతీయ పార్టీగా ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్ష్య పదవికి ఎన్నికలు నిర్వహించి ఎన్నుకున్నారు. ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కోసం జేపి ప్రచారం ఎందుకు చేయడం లేదన్నది కూడా ప్రశ్నే. ప్రస్తుత ఎన్నికల్లో లోక్ సత్తా ఎందరిని నిలబెట్టిందో కూడా జనాలకు తెలియని పరిస్థితి. ఆ పార్టీ రాష్ట్ర అద్యక్షుడే తెరమీద కనపడక పోతే ఇంకెవరు కనిపిస్తారు. అంటే జేపి చెప్పేవన్ని శ్రీరంగనీతులు, దూరేవి... అదేదో అన్నట్లుగానే ఉందంటున్నారు. ఇప్పుడు జాతీయ స్తాయి నాయకుడు కాబట్టి మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా తానొక్కడే గెలిచి తన ప్రాభవాన్నే పెంచుకున్నారు. ఇప్పుడు కూడా ఎంపీగా తానొక్కడే గెలిచే జాతీయ స్థాయిలో తన ప్రతిష్టనే పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు జేపి అన్నది మాత్రం వాస్తవం. కారణం తను ఎంపీగా గెలవడానికి మాత్రమే ఆయన ప్రయత్నిస్తున్నారు తప్ప,రాష్ట్రంలో తన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నించడం లేదు, ప్రచారం చేయడంలేదు. తాను ఎలాగైనా గెలువాలని తన సిద్దాంతాలను కూడా ఆయన పక్కన పెట్టారు. టిడిపి మద్దతు కోరారు. జాతీయ స్థాయిలో బిజేపి మద్దతు కోరారు. ఓ దశలో ఆమ్ ఆద్మీలో పార్టీనే కలిపివేయాలన్న ఆలోచన చేసారు. పవన్ పార్టీ పెడతానంటే తానే ముందుకు పోయారు. ఇప్పడు పవన్ మద్దతును తనకే కోరారు, ఆయనతో జేపి జిందాబాద్ అనిపించుకున్నారు. మోడీతో కూడా ఒక్క జేపినే పొగిడించుకున్నారు. పవన్ కాని, మోడికాని ఇప్పటి వరకు లోక్ సత్తా పార్టీ చాలా మంచిది, ఆపార్టీ అభ్యర్తులను గెలిపించండి అన్నారా అంటే లేదు. కేవలం జేపికి మాత్రమే సై అన్నారు. అంటే పార్టీ సత్తా అంతా కేవలం జేపి కోసమే...జెపి ప్రయత్నాలన్నీ కూడా తాను ఎంపీ కావడం కోసమే. తన పార్టీ అభ్యర్థుల కోసం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: